అన్నదాత ఆర్థిక పరిస్థితి దేశ శ్రేయస్సు మీద ఆధారపడుతుంది. అందుకే, ‘అన్నదాత సుఖీభవ’ అంటూ రైతు శ్రేయస్సును కోరుకుంటాం. అయితే, ఆరుగాలం కష్టపడ్డా కర్షకులు ఆర్థికంగా వెనుకబడటంతో వారికి కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆధునిక వ్యవసాయం వల్ల ఖర్చులు పెరిగి సాగు మరింత భారమవుతున్నది. మరోవైపు పెరుగుతున్న దేశ జనాభాకు ఆహార భద్రత కల్పించడం తప్పనిసరి.
దేశ ఆహారభద్రతను కాపాడుకోవడానికి రైతులకు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులను 1960 హరిత విప్లవం పరిచయం చేసింది. దీంతో దేశ వ్యవసాయరంగ ముఖచిత్రం మారింది. అయితే, హరిత విప్లవం వల్ల ఉత్పత్తి పెరిగినప్పటికీ ఎరువులు, పురుగుమందులను ఎక్కువగా వాడటంతో నేల సారం కోల్పోయి భూమి బంజరుగా మారి, సాగు ఖర్చు పెరిగింది. ప్రాచీన భారతంలో సాగుకు తక్కువ ఖర్చయ్యేది. ఆ కాలంలో సాగుకు అవసరమయ్యే విత్తనం, ఎరువులు, శారీరక శ్రమ, సంప్రదాయ నీటి పారుదలను అవలంబించి సాగు చేయడం ద్వారా ఖర్చు తక్కువగా ఉండి అధిక దిగుబడుల వల్ల రైతు లాభపడేవాడు.
11వ వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం (2021-22) తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు దాదాపు 91.4 శాతం (4.94 ఎకరాల కంటే తక్కువ) ఉండి 68.2 శాతం (43 లక్షల హెక్టార్లు) భూమి సాగు చేస్తున్నారు. మరోవిధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టడంలో సింహభాగం చిన్న, సన్నకారు రైతులే కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో పంట ఉత్పత్తికి సగటు నెలవారీ ఖర్చు రూ.2,959 కాగా, మన రాష్ట్రంలో సగటు నెలవారీ పంటల ఉత్పత్తికి అయ్యే ఖర్చు రూ.6,543 ఇది దేశ సగటు కంటే రెండింతలు అధికం. అందుకు ప్రధాన కారణాలు ఎరువులు, పురుగుమందుల వినియోగం పెరగడమే కాకుండా, వాటికి అయ్యే ఖర్చు పెరగడంతో పాటు వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగి సాగుకు అధిక ఖర్చవుతుంది.
మన రాష్ట్రంలో పంట ఉత్పత్తికి అవసరమయ్యే వివిధ రకాల ఇన్పుట్లకు సగటు నెలవారీ ఖర్చులలో విత్తనానికి 7.6 శాతం, ఎరువులకు 21.8 శాతం, సస్యరక్షణకు 14.2 శాతం, కౌలుకు 3.3, కూలీలకు 25.4, ఇతర ఖర్చులకు 27.7 శాతం ఖర్చవుతున్నది. (2018-19). రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం చూసినట్లయితే, 2021-22లో దేశ సగటుగా ఎరువుల వినియోగం హెక్టారుకు 141.2 కిలోలు కాగా మన రాష్ట్రంలో సగటున ఒక్క హెక్టారుకు 229 కిలోల ఎరువులను (ఎన్పీకే) వినియోగించడంతో దేశంలోనే అత్యధికంగా ఎరువులు వాడుతున్న రాష్ర్టాల్లో 3వ స్థానంలో నిలిచింది. జిల్లాలవారీగా ఎరువుల (ఎన్పీకే) వాడకంలో నల్గొండ, నిజామాబాద్,
సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో అత్యధికంగా వాడుతున్నారు (2021-22). అదే విధంగా 2023-24లో దేశవ్యాప్తంగా రసాయన పురుగుల మందులు 55235.85 మెట్రిక్ టన్నులు వాడగా మన రాష్ట్రం 4,920 మెట్రిక్ టన్నులు వినియోగించి దేశంలో నాలుగవ అత్యధిక రసాయన పురుగుల మందులు వాడే రాష్ట్రంగా నిలిచింది. 2014-15లో భారత సాధారణ వ్యవసాయ కూలి సగటు వార్షిక రోజువారీ వేతనం రూ.268 ఉండగా, తెలంగాణలో రూ.256 ఉండేది, అయితే 2022-23 నాటికి భారత సాధారణ వ్యవసాయ కూలి సగటు వార్షిక రోజువారీ వేతనం రూ.394.52 కాగా తెలంగాణలో రూ.465.56కు చేరింది.
ఈ నేపథ్యంలో సాగు భారాన్ని అధిగమించి చౌకైన సాగును అవలంబించాలి. అందుకు నేటి ఆధునిక ప్రపంచంలో కచ్చితమైన వ్యవసాయం చేయడం తప్పనిసరి. అందుబాటులో ఉన్న ప్రతి వనరును తెలివిగా వినియోగించుకోవాలి. అయితే, దేశవ్యాప్తంగా సాగుకు సంబంధించిన సాంకేతిక సలహా పొందుతున్న వ్యవసాయ కుటుంబాలు సుమారుగా 45 శాతం మాత్రమే. రైతులు అనేక విధాలుగా వ్యవసాయ సమాచారం పొందుతున్నారు. అందులో ప్రధానంగా ఆదర్శ రైతు నుంచి 20.3 శాతం, ఇన్పుట్ డీలర్ల నుంచి 19.1 శాతం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా 12.3 శాతం సమాచారాన్ని పొందుతున్నారు. అయితే రైతులు ప్రాథమికంగా ఎరువులు, పురుగుమందుల కొనుగోలు కోసం డీలర్లును సంప్రదిస్తున్నారు.
ప్రైవేట్ సంస్థల సిఫారసు మేరకు పంటకు కావలసిన దానికంటే అధిక మోతాదులో రైతులకు డీలర్లు సూచిస్తున్నారు. పంటల దిగుబడికి పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల పంటకు సరిపడా మోతాదులో పోషకాలందించాలి. సూక్ష్మ స్థాయిలో, పోషకాల వాడకమనేది దేశంలో వివిధ ప్రాంతాలకు వివిధ రకాల మోతాదులో నేలల రకాలు, పంటలు, వాతావరణ పరిస్థితుల మీద ఆధార పడి ఉంటుంది. హరిత విప్లవం తర్వాత దీర్ఘకాలికంగా రసాయన ఎరువులు వాడటం వల్ల ముఖ్యంగా నత్రజని సంబంధిత ఎరువులు నిరంతరం అధిక మోతాదులో ఉపయోగించడం వల్ల నత్రజని ఎరువులకు పంటల ప్రతిస్పందన తక్కువ కావడం పాటు ఇతర ప్రధాన, సూక్ష్మ పోషకాల లోపాలకు గురై నేల ఆరోగ్యం, పంట ఉత్పాదకతపై హానికరమైన ప్రభావం చూపిందని పలురకాల పరిశోధనల్లో తేలింది. అందువల్ల ఎరువుల వాడకాన్ని రైతు స్థాయిలో నేల పరీక్ష ఆధారిత సమతుల్య, సమగ్ర పోషక నిర్వహణను సిఫారసు మేరకు ఎరువులను విభజించి వేయడం, నెమ్మదిగా విడుదల చేసే ఎన్-ఎరువులు, నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్ల వాడకం, కాలానుగుణంగా పప్పుధాన్యాల పంటలను పండించడం ద్వారా సహజంగా నేలలు సారవంతమౌతాయి.
ప్రపంచలో పారిశ్రామికీకరణ ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందిన దేశాలు సుమారు 75 శాతం పైగా వ్యవసాయ యాంత్రీకరణ సాధించాయి. ఆ స్థాయి ఇప్పటికీ 40-50 శాతం మధ్య ఉంది. భారతీయ వ్యవసాయ సమాజంలో వ్యవసాయ యాంత్రీకరణను స్వీకరించడం చాలా అవసరం. సాగు ఖర్చు తగ్గించుకోవడాని కూలీలకు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ రంగాన్ని యాంత్రీకరించడం వల్ల సాధ్యమవుతుంది. ఇది రైతుల సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులు, పండించే పంటలు, నీటిపారుదల సౌకర్యాల వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే సాగు యంత్రాల, పరికరాల ప్రారంభ ఖర్చులు అత్యధికంగా ఉండటం చేత చిన్న, సన్నకారు రైతులు సాగులో యాంత్రీకరణకు దూరమవుతున్నారు.
ఈ తరుణంలో చిన్న, సన్నకారు రైతుల సాగు భారాన్ని తగ్గించాలంటే, అందుబాటులో ఉన్న అన్నిరకాల వ్యవసాయ సంబంధిత సాంకేతిక సమాచారాన్ని ప్రతి రైతుకు అందించాలి. ప్రభుత్వమే ప్రతి మండలానికి ఒక్కటి చొప్పున నేల పరీక్షా ప్రయోగశాలను ఏర్పరచాలి. భూమిలోని పోషకాలను నిర్ధారించి అందుకనుగుణంగా వ్యవసాయ అధికారులు సిఫారసు చేయాలి. అంతేకాకుండా, సేంద్రీయ, జీవ ఎరువుల ఉత్పత్తి వాడకంపై రైతులకు విస్తృత స్థాయిలో శిక్షణ ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ముందుకువచ్చి ప్రతి మండల పరిధిలో ‘కస్టమ్ హైరింగ్ సెంటర్లు’ ఏర్పాటుచేసి చిన్న, సన్నకారు రైతులకు తక్కువ ఖర్చులతో సాగుయంత్రాలు, పరికరాలు అందించాలి. అప్పుడే కూలీల ఖర్చులు తగ్గి సాగు బాగుపడుతుంది.
– డాక్టర్ రేపల్లె నాగన్న
79908 42149