కాంగ్రెస్‌లో చేరిన మాజీ టీడీపీయులు నటనలో ఆస్కార్‌ను తలదన్నుతున్నారు. గతంలో సోనియాగాంధీ సమక్షంలో రేణుకా చౌదరి, ఇప్పుడు సోనియాగాంధీ గురించి ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డి తమ నటనకు తామే ఆస్కార్ ఇచ్చుకున్నారు.
ఢిల్లీలో కులగణనపై తాజాగా జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రారంభ ఉపన్యాసాన్ని చూస్తే 2004 నాటి రేణుకాచౌదరి ఏడుపు గుర్తుకువచ్చింది. 2004లో యూపీఏ కూటమికి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా సోనియాగాంధీ పేరు తెరపైకి వచ్చింది. ప్రధానిగా ఆమె ప్రమాణస్వీకారం చేయడమే తరువాయి. అయితే, ఆమె ప్రమాణస్వీకారం చేస్తే సహించేది లేదని, ఒక విదేశీ మహిళ ఈ దేశానికి ప్రధాని కావడం ఏమిటని బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ మండిపడ్డారు. సోనియా ప్రధాని అయితే తాను గుండు గీయించుకుంటానని కూడా భీషణ ప్రతిజ్ఞ చేశారు. అదే సమయంలో సోనియా పౌరసత్వంపై సుబ్రమణ్యస్వామి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆమె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయలేరని, అందుకు న్యాయపరమైన అడ్డంకులున్నాయని రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్లారు. వీటన్నింటితో పాటు తెరవెనుక రాజకీయం కారణంగా సోనియాగాంధీ ప్రధాని పదవిని బలవంతంగా త్యాగం చేయక తప్పలేదు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు ‘త్యాగం సమావేశం’ పెట్టారు. సోనియాగాంధీ పుట్టకముందు నుంచీ కాంగ్రెస్‌లో బతుకుతున్న సీనియర్లు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆమె త్యాగాన్ని కీర్తిస్తూ ప్రసంగిస్తున్నారు. రేణుకాచౌదరి వంతు వచ్చింది. ఆమె అంతకుముందే కాంగ్రెస్‌లో చేరారు. టీడీపీలో రాటుదేలిన నాయకురాలు. పార్టీలో ఆమె కొత్త కాబట్టి ‘కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడుతుందిలే’ అని అందరూ అనుకున్నారు. ఆమె మైకు ముందుకువచ్చి కొన్ని క్షణాలు గంభీరంగా ఉండి, అందరూ ఆసక్తిగా చూస్తుండగా ఒక్కసారిగా బోరున విలపించారు. ఆ సన్నివేశం చూసి మహా మహా కాంగ్రెస్ కురువృద్ధులు కూడా ఖంగుతిన్నారు. ‘మనకీ ఐడియా రాలేదే’ అని అనుకున్నవారు కూడా ఉన్నారు. సోనియాగాంధీ త్యాగం సభలో ఆమె కంటే ఎక్కువగా రేణుకాచౌదరి హైలైట్ అయ్యారు. టీడీపీ ట్రైనింగా మజాకా? అనిపించింది చూసేవాళ్లకు.
ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ సమావేశం. ఆ సమావేశానికి హాజరుకావలసిన సోనియాగాంధీ ఢిల్లీలోనే ఉన్నా రాలేదు. కానీ, ఆమె ఒక లేఖ రాశారు. ఆ లేఖను చూపుతూ ‘ఇది నాకు ఆస్కార్, నోబెల్ కన్నా పెద్ద అవార్డు’ అంటూ రేవంత్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఆరు హామీల్లో ఉచిత బస్సు తప్ప ఏమీ ఇవ్వకుండా భలే మేనేజ్ చేస్తున్నావు’ అని లేఖ రాశారా? అప్పు కోసం వెళ్తే దొంగల్లా చూస్తున్నారని అన్నందుకు అభినందిస్తూ రాశారా? బూతులు లేనిదే మాట్లాడలేని వాక్చాతుర్యాన్ని చూసి ముగ్ధులై రాశారా? అని ఆసక్తిగా అసలు ఆ లేఖలో ఏముందని చూశా. ‘సమావేశానికి రాలేను’ అని అందులో ఉంది. సమావేశంలో రేవంత్‌రెడ్డి ఆ లేఖను చూపుతూ ఉద్వేగంగా, నాటకీయంగా మాట్లాడటాన్ని చూసి ‘పుట్టు కాంగ్రెస్ వాదులు’ కూడా ఏమై ఉంటుందా అని ఆలోచనలో పడ్డారు. లేఖ చూశాక టీడీపీలో ప్రచార శిక్షణ మాములుగా ఉండదని లోలోన నవ్వుకున్నారు. సోనియాగాంధీని తెలంగాణ బలి దేవత అంటూ టీడీపీలో ఉన్నప్పుడు మండిపడ్డ రేవంత్‌రెడ్డిని సోనియాగాంధీ అభినందిస్తూ లేఖ రాస్తారా? ‘రాలేను’ అనే రాస్తారు. అదే రాశారు కూడా.
‘రాలేను’ అని రాసిన లేఖను చూపుతూ ఆస్కార్ రేంజ్ నటనను ప్రదర్శించారు రేవంత్‌రెడ్డి. పైగా ఆ లేఖ ఆస్కార్, నోబెల్ పురస్కారాల కన్నా మిన్న అని చెప్పడం విడ్డూరం కాక మరేమిటి!
ఏ ఉద్దేశంతో ఆస్కార్ గురించి ప్రస్తావించారో కానీ, అది సరైన ప్రస్తావనే. నటుల అత్యున్నత ప్రదర్శనకు ఆస్కార్ లభిస్తుంది. నటనలో తనకు ఆస్కార్ అవార్డు రావాలనేది ప్రతి నటుడి లక్ష్యం. సాధారణంగా మనం ఏదైనా విషయంలో ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినా అక్కడి నుంచి మనకు ప్రత్యుత్తరం వస్తుంది.
ఎక్కడున్నా ప్రచారంలో తమను కొట్టేవారు లేరని టీడీపీయులు నిరూపిస్తున్నారు. కాంగ్రెస్‌లోనూ అంతే. టీడీపీ నుంచి వలసపోయిన నాయకుల నటన ముందు పుట్టు కాంగ్రెస్ నాయకులు వెలవెలబోతున్నారు. రేణుకా చౌదరి మొదలుకొని తాజాగా రేవంత్‌రెడ్డి వరకు అదే పరిస్థితి. కులగణనపై రాహుల్‌గాంధీతో పాటు ప్రధాని మోదీని కలుస్తానని గతంలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలోనే ఉన్న సొంత పార్టీ నేత సోనియాగాంధీని సమావేశానికి రప్పించలేరు కానీ, ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పిస్తారట. ఇలా ఉంటుంది టీడీపీయుల వ్యవహారం.