గులాబీ జెండాతోనే నా ప్రయాణం సాగింది. ఎందుకంటే… ఆ జెండా, నేను ఒకే ఈడోల్లం కాబట్టి. నాకు గులాబీ జెండాకు మూడు, నాలుగేండ్లు అటుఇటైనా… గులాబీ జెండాతోనే సాగింది నా వయసు. అందుకే తెలంగాణపై మమకారం నా మనసులో లోతుగా పాతుకుపోయింది.
సరిగ్గా యాదికి లేదు కానీ, 2003 అనుకుంటా మా ఊరు (సాగరం, జాఫర్ఘడ్ మండలం) ఒక గొప్ప సంఘటనకు వేదికైంది. అదేమంటే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన గాదె ఇన్నయ్య (మా గ్రామవాసి) కేసీఆర్‌ను గాలి మోటార్లో మా గ్రామానికి తీసుకువచ్చి గులాబీ జెండాను ఎగురవేయించారు. ఆ సమయంలో మా ఊరికి సరిగ్గా బస్సే లేదు, కానీ, గాలి మోటార్ రావడమంటే మా ఊరోళ్ల ఆగం ఎట్లుంటదో ఊహించుకోండి. ఆ సమయంలో నా అసొంటి బడికిపోయే పోరగాళ్లం గాల్లో గిరా గిరా తిరిగి పోచమ్మ కాడ దిగిన గాలి మోటారును చూసి సంబురపడ్డం.
ఆ గాలిమోటార్లో ఎవలొచిండ్రనే ముచ్చట మాకు తెల్వదు. కానీ, ఆ తర్వాత కేసీఆర్ వచ్చిండు అని పెద్దోళ్లు మాట్లాడుకోవడం చూసి మురిసిపోయాం. గాలి మోటార్ ముచ్చట పక్కకుపోయి, కేసీఆర్ అనే శక్తిని చూడటం కోసం తాపత్రయపడ్డాం. గులాబీ రంగు కండువా మెడలో వేసుకొని బక్కగా చకచకా అడుగులు వేస్తున్న కేసీఆర్‌ను అప్పుడే తొలిసారి ప్రత్యక్షంగా చూసిన. ఆనాడు ఆ రూపు మదిలో ముద్ర పడిపోయింది.
అక్కడినుంచి తెలంగాణకు సంబంధించిన ఏ విషయమైనా అక్కడ కేసీఆర్ ఉంటడని తెలిసింది. చిన్నోన్నే అయినప్పటికీ నిశితంగా ఉద్యమాన్ని, కేసీఆర్ పోరాటాన్ని గమనిస్తున్నాను. పెద్ద పెద్ద ఉద్యమాలు చేయలేదు కానీ, ఏనాడు తెలంగాణ బంద్ ప్రకటించినా ఆ రోజు మా మిషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులందరం రాష్ట్రం కోసం ర్యాలీగా ఊరంతా తిరిగి నినాదాలు చేసినం..
***
మొత్తానికి కేసీఆర్ పోరాటంతోనే రాష్ట్రం ఏర్పడటం, ఏర్పడిన రాష్ట్రం ఆయన నాయకత్వంలో బాగుపడటం చూసి గర్వపడుతున్నాను. ప్రపంచంలో జరిగిన ఎన్నో విప్లవాలు ఎందరినో కదిలించాయి. ఎంతో స్ఫూర్తిని నింపాయి. క్యూబా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, భారత స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం ఇలా ఎన్నో… కానీ, కేసీఆర్ నాయకత్వం వహించి పల్లె పల్లెను దండు కట్టి నడిపించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మాత్రం నాపై చెరగని ముద్ర వేసింది. ఈ తెలంగాణ గడ్డ మళ్లీ పరాయి పాలకుల పాలు కాకుండా ఉండాలంటే, స్వాభిమానంతో వెలగాలంటే మన ఇంటి పార్టీని ఆదరించాలి. గులాబీ జెండాను గుండెలకు హత్తుకోవాలి.
(వ్యాసకర్త: బీర్ఎస్వీ నాయకులు, కేయూ)
– విజయ్‌కుమార్ పిన్నింటి
90520 39109