తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీల పేరిట ఆర్భాటం చేస్తూ, హడావుడి సృష్టిస్తున్నది. ఇందులో భాగంగా మన ఆడబిడ్డల ఆత్మాభిమానం, స్వాభిమానంతో ఆటలాడుతున్నది. బుధవారం నాడు రేవంత్‌రెడ్డి సర్కార్ మన ఆడబిడ్డలతో ప్రపంచ సుందరాంగుల పాదాలను కడిగించడం హేయమైన చర్య. రాణిరుద్రమదేవి, సమ్మక్క-సారక్క వంటి ధీర వనితలు ధిక్కార స్వరం వినిపించిన ఓరుగల్లు వేదికగా మన ఆడబిడ్డలను అవమానించడం అత్యంత ఖండనీయం. ఈ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మా రెడ్డి, కోవ లక్ష్మి లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం.
గౌరవనీయులైన శ్రీమతి సోనియాగాంధీ గారికి,
నాలుగున్నర కోట్ల ప్రజలకు అంతులేని దుఖాన్ని కలిగించి న ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి తెలంగాణ ఆడపడుచులమైన మేము ఈ లేఖ రాస్తున్నాం. దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ పోరాటం, అసంఖ్యాక అమరవీరుల త్యాగం గురించి మీకు తెలుసు. అయితే, మీ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గారు మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగి, తుడిచే పనులకు తెలంగాణ మహిళలను ఉపయోగించడం అత్యం త దుర్మార్గమైన చర్య. బానిస ప్రదర్శించే చర్యగానే తెలంగాణ సమాజం భావిస్తున్నది. తెలంగాణ ఆడబిడ్డల స్వాభిమానాన్ని అందాల పోటీదారుల పాదాల చెంత ఉంచి తెలంగాణ సంస్కృతిని అవమానించడం క్షమించరాని నేరం. మా తెలంగాణ ఆడపడుచులతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం మా రాష్ట్ర ప్రజల మనసును తీవ్రంగా బాధించింది. ఇలాంటి పనులు మహిళా సాధికారత పేరిట జరగడం దారుణం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి మహిళను, ప్రతి కుటుంబాన్ని ఈ ఘటన తీవ్రంగా కలిచివేస్తున్నది. రేవంత్‌రెడ్డి చర్యలు తెలంగాణ సంప్రదాయాలను అవమానించడమే కాక, ప్రపంచం ముందు మా నేల ఖ్యాతిని మంటగలిపాయని తీవ్ర ఆవేదనతో తెలియజేస్తున్నాం.
తెలంగాణ ఆడపడుచులు ఈ నేల స్వాభిమానానికి నిదర్శనం. వయసుతో సంబంధం లేకుండా ఆడబిడ్డల కాళ్లు మొక్కడం ఈ నేల సంప్రదాయం. తన కూతుళ్లను ఈ గడ్డ ఎంతలా గౌరవిస్తుందో చెప్పడానికి ఈ సంప్రదాయమే నిదర్శనం. అలాంటి మా ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడమనేది రేవంత్ వికృత వ్యక్తిత్వానికి సాక్ష్యం. రేవంత్ చర్యలు తెలంగాణ స్ఫూర్తిని అర్థం చేసుకోలేని అజ్ఞానాన్ని, ఎవరినో సం తోషపెట్టడానికి ఈ నేల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే దాస్య మనస్తత్వాన్నే చూపిస్తాయి. రజాకార్ల, దొరల దౌర్జన్యం అయితేనేమీ, ఉమ్మడి ఏపీలో అనుభవించిన వివక్ష అయితేనేమీ, అణచివేత ఏ రూపంలో ఉన్నా ఈ నేల నిరంతరం ప్రతిఘటిస్తుంది. తెలంగాణ ఉద్యమం అనేది రాష్ట్ర ఏర్పాటు కోసమే కాదు, ఇది మా ఆత్మగౌరవాన్ని చాటడానికి, మా సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు మా తెలంగాణ బిడ్డల సాధికారత కోసం జరిగిన మహాపోరాటం అన్న సంగతి గుర్తెరగాలి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం గళమెత్తిన ఆశావర్కర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం సాగించిన దుశ్శాసన పర్వాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదు. మా సోదరి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రే స్వయంగా నిండు సభలో ఘోరంగా అవమానించారు. అంతేకాకుండా, బెటాలియన్ పోలీసుల భార్యలు తమ భర్తలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా సచివాలయం ముందు నిరసన తెలిపినప్పుడు, వారిపై కూడా అత్యంత కిరాతకంగా జులుం ప్రదర్శించారు. మహిళా జర్నలిస్టులను ‘బట్టలు ఊడదీసి కొడతాం’ అని బెదిరించడం.. ఈ ఘటనలు రేవంత్‌రెడ్డి మహిళా వ్యతిరేక, నియంతృత్వ ధోరణులకు సాక్ష్యాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వికృత సంస్కృతికి ప్రతిబింబాలు.
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో దళిత, గిరిజన ఆడబిడ్డలపై పోలీసులు అర్ధరాత్రి జరిపిన అకృత్యాలను సాటి మహిళలుగా మేం ఎన్నటికీ మరిచిపోలేం. ఆ బాధిత మహిళలకు న్యాయం దక్కాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోని మహిళా కమిషన్, మానవహక్కుల కమిషన్ వరకు వెళ్లి మేం పోరాడాం. ఆ సంస్థలు తప్పుబట్టినా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంకా బుద్ధి రాలేదు. వస్తుందన్న నమ్మకం రాష్ట్రంలో ఎవరికీ లేదు.
మేడమ్, గత 17 నెలలుగా రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని మీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి, రాష్ట్ర ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ, అడుగడుగునా తెలంగాణ స్వాభిమానాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికల సమయంలో మహిళల సంక్షేమం కోసం గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని, ప్రతీ విద్యార్థినికి స్కూటీ ఇస్తామని రకరకాల హామీలిచ్చింది. ఏడాదిన్నర గడిచినా ఈ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. రేవంత్‌రెడ్డి ఈ వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. తద్వారా తెలంగాణ మహిళలను దారుణంగా మోసం చేశారు. ఓవైపు తెలంగాణ దివాలా తీసిందని, ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయిందని, అప్పుల కోసం వెళ్తే దొంగను చూసినట్టు చూస్తున్నారని తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్న ముఖ్యమంత్రి.. మరోవైపు అందాల పోటీల కోసం ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేయడం తెలంగాణ మహిళలను మాయమాటలతో మోసం చేయడమేనని తేలిపోయింది. ఇలాంటి ఆర్భాటాల కోసం రూ.200 కోట్లు వెచ్చించడం కంటే, ఆ మొత్తాన్ని మహిళల సంక్షేమం, విద్య, ఉపాధి కోసం ఉపయోగించి ఉంటే రాష్ట్ర ఆడబిడ్డలకు నిజమైన గౌరవం దక్కేది.
మాకు బాగా గుర్తుంది. తెలంగాణ ఏర్పడినప్పుడు ‘ఇది ఆత్మగౌరవానికి సంకేతంగా నిలవాలి’ అని మీరు ఆకాంక్షించారు. ప్రతినిత్యం ఆడబిడ్డల ఆత్మాభిమానంతో ఆటలాడుతున్న ముఖ్యమంత్రిని ఇంకా వెనకేసుకొస్తారా అనేది కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి. ఈ సర్కారు చర్యలు అధికార దుర్వినియోగం, మహిళల పట్ల ఉన్న చులకనభావాన్ని ప్రతిబింబిస్తాయి. తెలంగాణ తల్లులు, అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ… తెలంగాణ మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
– సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి
– వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే
– కోవ లక్ష్మి, ఎమ్మెల్యే
– సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి