తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గం భావిస్తున్నది. గత రెండు పర్యాయాలు విజయవంతంగా పూర్తి చేసుకొని కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా అభివృద్ధిలో ఇతర రాష్ర్టాలతో పోటీ పడి ముందుకు పోతూ సబ్బండ వర్గాల వారి సంక్షేమానికి కృషి చేస్తున్నది. బీఆర్ఎస్ ఆనాడు ఉద్యమకాలంలో ఇచ్చిన హామీలకు రెట్టింపు అభివృద్ధి చేసి దేశ రాజకీయాల దృష్టి తెలంగాణ వైపు మళ్లే విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నది.
రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న బీఆర్ఎస్ ఏనాడూ ఓటు బ్యాంకు కోసం పని చేయలేదు. నిరంతరం ప్రజా సంక్షేమానికై కృషి చేసింది. కాబట్టే రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యనే ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఈ మ్యానిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నది. గతంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్కు ఉన్నది. కేసీఆర్‌కు కావాల్సింది కూడా అధికారం కాదు, ప్రజల శ్రేయస్సు. ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కాబట్టే ప్రజలు కేసీఆర్‌కు అధికారం ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ఏర్పాటు నుంచి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ సమాజం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారానే సాధ్యమని చెప్తూ వచ్చారు.
అందుకే ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరిని ఏకం చేసి తెలంగాణ సిద్ధాంతకర్త, పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్‌సార్ మార్గనిర్దేశంలో ఉద్యమించారు. ఎందరో యువకుల ఆత్మార్పణం, కేసీఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్టాన్ని సాధించుకోవడం జరిగింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీకు పరిపాలన చేయడం చేత కాదని ఆనాడు ఆంధ్ర పాలకులు సంకుచిత భావంతో హేళన చేసినా ఎన్నికల కదన రంగంలోకి దూకారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మొదటిసారి 2014లో అధికారాన్ని చేపట్టి సుపరిపాలన అందించారు.
2018 సాధారణ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించటానికి ఆంధ్ర పాలకులతో తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు జట్టు కట్టాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణపై మళ్లీ ఆంధ్ర పెత్తనం ఏంటని తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున కేసీఆర్‌కు మద్దతు పలుకడంతో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.
తెలంగాణలో కొందరు నాయకులు ఆనాడు అధికార, ధన ప్రలోభాలకు లోనై ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేశారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ తెలంగాణ ప్రాజెక్టులపై కేసులు వేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకులకు కావాల్సింది ప్రజా సంక్షేమం కాదు, అధికారం. దానికోసం ఎంతదాకనైనా దిగజారి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ విషపూరిత ఆరోపణలు చేస్తూ అధికారం కోసం అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. నేడు అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయిన కాంగ్రెస్ తెలంగాణ అవినీతిపై మాట్లాడటం హస్యాస్పదం. నేడు అధికారం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నది. కానీ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు వారి మాయ మాటలు నమ్మరు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాలలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేక పోతున్నదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈనాడు బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ సరిహద్దు రాష్ట్ర ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపండని అడుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ లేక రైతులు అరిగోస పడిన చరిత్ర చూసినం. యూరియా బస్తాల కోసం తెల్లవారుజామున మూడు గంటలకు పోయి లైన్లో నిలబడిన రోజులు మర్వలేదు. అవి కూడా అరకొర మాత్రమే వచ్చేవి. తప్పని పరిస్థితుల్లో తోసుకున్న రైతులపై విరిగిన పోలీస్ లాఠీలు, కరెంట్‌కోసం ఎదురు చూస్తూ బోరు బావి దగ్గర కుప్పకూలిన రైతన్నలు ఎందరో. అటువంటి పరిస్థితి నుంచి నేడు తెలంగాణ రైతాంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై కేంద్రబృందాలు అధ్యయనం చేసి ప్రజాశ్రేయస్సుకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రశంసించిన విషయం అందరికీ తెలిసిందే.
ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సైతం బీఆర్ఎస్ పథకాలను అభినందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధిలో దూసుకు పోతూ వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులు, రివార్డులు అందుకున్నది. ప్రపంచంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం వల్ల ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుతున్నాయి.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్‌లో మత కలహాలు, పోలీసు కర్ప్యూలు తప్ప అభివృద్ధి ఏ మాత్రం కనిపించేదికాదు. బీఆర్ఎస్ పాలనలో గడచిన పదేండ్ల కాలంలో ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ ప్రజలందరూ కలిసిమెలిసి సోదరభావంతో జీవిస్తున్నారు.
నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చకుండా తాత్సారం చేస్తున్నది. ఇక్కడ ఉన్న ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వకుండా తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనకుండా నూకలు తినండని హేళనగా మాట్లాడిన సందర్భాలను చూశాము. పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్లకు నిధులు మంజూరు చేయకుండ జాప్యం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. బీజేపీ జాతీయ నాయకులు టూరిస్టుల్లా వచ్చి ఇక్కడి స్థానిక నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లి పోతారు తప్ప తెలంగాణ అభివృద్ధికి సహకరించింది లేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేంద్రం నిధులు ఇవ్వకున్నా, ప్రజా సంక్షేమానికి ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నా వాటన్నింటిని ఎదుర్కొని సమర్థవంతంగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికై అడుగులు వేస్తున్నది. తెలంగాణ సమాజం కూడా బీఆర్ఎస్ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అందుకే మరోసారి కేసీఆర్‌కే పట్టం కడుతామని స్పష్టం చేస్తున్నారు.
-మిద్దె సురేష్
97012 09355