శ్వేతపత్రం అనే మాటకు అర్థం ఏమిటి? అటువంటి పత్రాల ఉద్దేశం ఏమిటి? ఆ పత్రాలు వాటిని తయారు చేసేవారి దృక్కోణాన్ని మాత్రమే ప్రతిఫలిస్తే సరిపోతుందా? లేక, ప్రజల ఆలోచనలకు కూడా వాటిలో చోటు ఉండాలా? రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20, 21వ తేదీల్లో శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు శ్వేతపత్రాలు, వాటిపై జరిగిన చర్చలను గమనించినప్పుడు, శ్వేతపత్రాలను తీసుకొచ్చిన లక్ష్యం నెరవేరిందా? అనే మౌలికమైన ప్రశ్న కూడా తెరమీదకు వస్తున్నది. ఆ పత్రాల్లో గానీ, చర్చలో గానీ దీనికి సమాధానం లభించడం లేదు.
శ్వేతపత్రం అనే మాటకు స్థూలమైన అర్థం ఏమంటే.. ఆ పత్రం ఒక నిర్దిష్ట అంశంపై లోతైన అధ్యయనం. అధికారికమైన రీతిలో, తప్పొప్పులు లేకుండా, వాస్తవాలతో కూడి చదివిన వారిని ఒప్పించే విధంగా ఉండాలి. సమస్యలను ముందుకు తేవాలి. అందుకు పరిష్కారాన్ని చెప్పాలి. ఇదంతా జరగాలంటే శ్వేతపత్రం తయారీలో నిజాయితీ ఉండాలి. చదివినవారిని ఒప్పించగల విధంగా ఉండటమంటే ఆ పత్రం పరిశీలనకు కూడా నిలవడమన్నమాట.
ఈ నిర్వచనం ప్రకారం చూసినట్టయితే.. రాష్ట్ర ఆర్థిక స్థితిపై, విద్యుత్తు రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు అందుకు అనుగుణంగా ఉన్నట్టు చెప్పగలమా? లేక, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ఉద్దేశంతో మాత్రమే తయారు చేసినవని అనిపిస్తున్నదా? అదే గనుగ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం అయితే వారికి అటువంటి హక్కు కూడా ఉంటుంది. అందుకు తప్పు పట్టలేము. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. అయితే, అటువంటి స్థితిలో ఆ పత్రాలను శ్వేతపత్రాలనే ఉన్నతమైన, గౌరవప్రదమైన, ఉదాత్తమైన పేరుతో పిలవటం తగదు. అవి కేవలం రాజకీయ పత్రాలుగా మిలిగిపోతాయి.
రెండు శ్వేతపత్రాలు వాటి పద్ధతిలో అవి ఉన్నాయి. వాటిపై అన్ని పార్టీలు తమ పద్ధతిలో తాము చర్చించాయి. ఆ విశేషాలను కొద్దిసేపు అటుంచితే, ముఖ్యమైన విషయం ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి. శ్వేతపత్రాలలో ప్రజల ఆలోచనలకు కూడా చోటుండాలా అనే ప్రశ్న ఒకటి పైన మనం వేసుకున్నాము. ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై, విద్యుత్తు రంగం స్థితిపై శ్వేతపత్రాలు తెచ్చింది. నీటిపారుదల రంగంపై కూడా శ్వేతపత్రం తెస్తున్నట్టు ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో కాంగ్రెస్ సర్కార్ వెనుకడుగు వేసింది. గమనించవలసిందేమంటే.. ఆయా రంగాల విధానకర్తలు ఎవరైనా, అధికార, ప్రతిపక్షాలు ఏవైనా సరే, వాటి మంచిచెడులను నిరంతరం అనుభవించేది మాత్రం ప్రజలే. అటువంటప్పుడు శ్వేతపత్రాల్లో ప్రజల ఆలోచనలు మాత్రం ఎందుకు ప్రతిఫలించకూడదు? ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న దృష్ట్యా వాటిని ప్రతిఫలించడం ఎలా సాధ్యం? అనే సందేహం కలిగే మాట నిజమే. అదేవిధంగా వారు తమ అభిప్రాయాన్ని ఎన్నికల తీర్పులో చెప్పారు గదా? అని కూడా అనవచ్చు. కానీ, ఇది స్థూలమైన వాదనలతో మౌలికమైన ప్రశ్నలను దాటవేసే ధోరణి అవుతుంది.
ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉండటం, ఎన్నికల్లో మెజారిటీ అభిప్రాయం ప్రతిఫలించడం నిజమే. కానీ, వీటిని శ్వేతపత్రాలు అంటున్నామే గానీ, మెజారిటీతో ఎన్నికైన మెజారిటీ ప్రభుత్వ అభిప్రాయ పత్రమనటం లేదు గదా. అలా పిలిస్తే ఏ పేచీ ఉండదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన రీతిలో గెలిచింది. బీఆర్ఎస్ స్పష్టమైన రీతిలో ఓడిపోయింది. కానీ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 2 శాతం కన్నా తక్కువ. అంటే బీఆర్ఎస్ ఆర్థిక విధానాలతో గానీ, విద్యుత్తు విధానాలతో గానీ, కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం ప్రకటించకుండా వెనక్కు తగ్గిన బీఆర్ఎస్ జల విధానాలతో గానీ ఏకీభవించే ప్రజల సంఖ్య తక్కువేమీ కాదు. ఇందుకు సంక్షేమ విధానాలను కూడా జోడించవచ్చు గానీ ప్రస్తుతానికి పక్కనపెడదాం.
ఇటువంటి స్థితిలో ఆయా రంగాలపై శ్వేతపత్రాలు ప్రకటించాలనుకున్నప్పుడు అందులో నిజాయితీగా కూడా ఉండాలనుకుంటే ఆ పని ఈ విధంగా జరగాలి. ఏ వివరాలను కూడా దాచకుండా అన్నింటిని చెప్పాలి. ఈ రెండు పత్రాల్లో చేసినట్టు తమకు అనుకూలమైనవి మాత్రమే కాకుండా అనుకూలించనివి కూడా పేర్కొనాలి. వాటన్నింటిపై తమ అభిప్రాయం ఏమిటో వివరించాలి. ప్రజల్లో గల ప్రధానమైన భిన్నాభిప్రాయాలను ప్రస్తావించాలి. ఇకముందు తమ విధానాలు ఎలా ఉండగలవో, అందువల్ల గత లోపాలు ఎలా తొలగిపోతాయో, పరిపాలన ఏ విధంగా బాగుపడి.. ప్రజల జీవితాలు గతం కన్నా ఎలా మెరుగుపడతాయో సూచించాలి. అప్పుడు మాత్రమే అది నిజమైన అర్థంలో శ్వేతపత్రం అవుతుంది.
ఇటువంటి శ్వేతపత్రాల ప్రకటనకు సంబంధించి ఒక విచిత్రమైన స్థితి ఉంటుంది. ఒక ప్రభుత్వం అనుసరించిన ఒక విధానం మంచిదా? కాదా? దానిని ప్రజలు ఆమోదించారా? తిరస్కరించారా? అనేందుకు ఎన్నికల్లో గెలుపోటములు మాత్రమే గీటురాళ్లు అవుతాయా? తాజాగా ప్రకటించిన ఈ రెండు శ్వేతపత్రాలను, ప్రకటించకుండా వదిలేసిన సాగునీటి రంగాన్ని తీసుకుందాం. వీటిలో ఆర్థిక రంగం అన్నది ప్రధానంగా అంకెలు, సూత్రీకరణలతో కూడుకున్నది గనుక చదువుకున్న వారికి కూడా తేలికగా బోధపడేది కాదు. కానీ, వారితో పాటు సామాన్య ప్రజలకూ వెంటనే తెలిసేది కరెంటు, నీళ్లు, సంక్షేమాల వంటివి. వీటిలో కరెంటు విషయంలో శ్వేతపత్రం రూపంలో సభలో చర్చ జరిగినప్పుడు, ప్రభుత్వం అప్పులు, బకాయిలు, ఒప్పందాలు, టెక్నాలజీ, విద్యుత్తు ప్రాజెక్టుల అమలు లెక్కలు పేర్కొంటూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోయింది. ఇవన్నీ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఉండేవేనని, 2014కు ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ రంగాలకు విద్యుత్తు సరఫరా గణనీయంగా మెరుగుపడిందా? లేదా? అని బీఆర్ఎస్ సభ్యులు ఎదురుదాడి చేశారు.
చర్చనంతా గమనించిన ప్రజలు, వివిధ రంగాల వారు ఈ రెండు వాదనల గురించి ఏమనుకొని ఉంటారు? తమ పదేండ్ల అనుభవం వారికి ఏం చెప్పి ఉంటుంది? ఇటువంటి అనుభవాన్ని ప్రతిఫలించనట్టయితే అది శ్వేతపత్రమవుతుందా అన్నది ప్రశ్న. కానప్పుడు అధికార పక్షం తన ఉద్దేశాల కోసం చెప్పే రాజకీయ పత్రం మాత్రమే కాదా? పైగా, గణాంకాలలో తమకు అనుకూలమైన విధంగా అనేక తప్పులను కూడా చొప్పించి చూపినప్పుడు. విద్యుత్తు సరఫరా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్టు 24 గంటలు జరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టు 10-12 గంటలా అన్న వాదనలు ఆ స్థాయిలో ఎంతైనా చేసుకోవచ్చు గాక. కానీ, ఈ శ్వేతపత్రాలు, వాదోపవాదాలకు బయట ప్రజల స్థాయి అనేది ఒకటున్నది.
ప్రజల ప్రత్యక్ష జీవితానుభవాలు 2014కు ముందేమిటి? తర్వాత పదేండ్లలో ఏమిటి? వివిధ పారిశ్రామిక, వ్యాపార రంగాల వారు, గృహ యజమానుల భావనలు ఏమిటనే దానికి మన ప్రజాస్వామిక వ్యవస్థలో విలువ అనేది ఉండనే ఉండదా? వారి అభిప్రాయాలకు శ్వేతపత్రంలో ఎంతమాత్రం చోటు ఇవ్వరా అనేవి సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్నలు. అలా కానప్పుడు అంతా ‘నేల విడిచి సాము’ అవుతుంది. వారందరినీ ఎన్నుకున్న ప్రజలకు కావాల్సింది వారి రాజకీయ యుద్ధ కౌశల ప్రదర్శనలు కావు. వాస్తవ గణాంకాలు, వాస్తవ పరిస్థితుల వివరణలు రాజకీయాతకు అతీతంగా నిజాయితీతో జరగటం.
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రయత్నించాలి. అంతేగానీ, శ్వేతపత్రాల పేరిట ఏదో చేయబోయి స్పష్టమైన తడబాటుకు గురై తన బలహీనతలను బయటపెట్టుకున్నట్టుగా మున్ముందు వ్యవహరించకపోవడం మంచిది. ఒక పెద్ద ఎన్నికల మ్యానిఫెస్టో రూపంలో వారు తమపై తాము ఒక పెద్ద భారాన్ని మోపుకొన్నారు. దాన్ని వారు ఎలా నెరవేర్చగలరన్న దానిపైనే మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. అంతేగానీ, ఇటువంటి పత్రాలు, వాదోపవాదాలు ప్రజలను విసిగించే వృథా ప్రయాసలు మాత్రమే కాగలవని పాలకులు గుర్తించాలి.
-టంకశాల అశోక్