బీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి అని కాకుండా బహుజన రాష్ట్ర సమితిగా పిలవాలని నాకు అనిపిస్తుంది. నిజానికి బీఆర్ఎస్ను అలా అనుకోవడానికి నాకు మాత్రమే కాదు, నాలాంటి బీసీ బిడ్డలందరికీ సరైన కారణాలు, ప్రాతిపదిక ఉంటాయని బలంగా నమ్ముతాను. కులగణన చుట్టూ అల్లుకున్న వివాదం, నాయకులు చేసుకుంటున్న విమర్శలను చూస్తున్న నాకు కొన్నేండ్ల క్రితం నాటి బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితి కండ్ల ముందు మెదిలింది.
ప్రపంచ బ్యాంకు సంస్కరణలను బలవంతంగా అమలుచేయాలనుకున్న కార్పొరేట్ జీతగాళ్ల కనిపించని కుట్రల ఫలితంగా అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదంలోకి నెట్టివేయబడిన బీసీ కులాల దుస్థితి యాదికొచ్చింది. నా కాలేజీ రోజుల్లో పల్లెల్లో మార్మోగిన గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అన్న పాట యాదికి వస్తుంది. పీడితులు, తాడితుల పక్షాన నిలబడి వారి సమస్యల కోసం పోరాడటమే సామాజిక న్యాయం. ఏ కాలంలో అయినా, ఏ వ్యవస్థలోనైనా సామాజిక న్యాయానికి స్థూలంగా ఇదే నిర్వచనం.
సుపరిపాలన, స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎగిసిపడి, అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తి సామాజిక న్యాయమే. పాలనా పరమైన వివక్షను ఎదుర్కొని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం గొంతెత్తి ఉద్యమించేందుకు ప్రత్యేక పార్టీగా పురుడు పోసుకున్న ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ ప్రతీ సందర్భంలోనూ అన్యాయానికి బలయ్యే పీడితుల పక్షానే నిలబడింది. కలబడి కొట్లాడింది.
సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి పరంగా వెనుకవేయబడ్డ తెలంగాణ కోసం ఓవైపు పోరాడుతూనే సామాజికంగా వెనుక వేయబడ్డ కులాలు, వర్గాల హక్కుల పరిరక్షణ కోసం గులాబీ పార్టీ ఉద్యమించింది. పార్టీ పెట్టిన ఒక్క సంవత్సర కాలంలో అంటే 2003లోనే కేసిఆర్ బహుజన, గిరిజన, మైనారిటీ, దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయా వర్గాల మేధావులు, పెద్దలతో సుదీర్ఘ సమావేశాలు జరిపి అందరి అభిప్రాయాలు తీసుకుని విప్లవాత్మకమైన విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. దాంతోపాటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత బీసీ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉండాల్సిన బీసీ పాలసీని 2003 అక్టోబర్ 19 నాడే రూపొందించి దూరదృష్టి, దార్శనికత చాటుకున్నారు.
కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలన్న డిమాండ్‌తో 2004లో కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ బీసీ నేతలతో వెళ్లి నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో చర్చించారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత కూడా అనేక సందర్భాల్లో బహుజన సంఘాలు, బీసీ మేధావులతో కలిసి బీఆర్ఎస్ ఉద్యమించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు, ఆరాటాలను దగ్గర నుంచి చూసిన కేసీఆర్ స్వరాష్ట్రం ఏర్పడ్డాక బహుజనుల కోసం ఎన్నో వినూత్నమైన, విప్లవాత్మకమైన, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేశారు. మంచిచెడులు ఎలా ఉన్నా భారతీయతతో పెనవేసుకుపోయిన కులాన్ని, దాని సంక్షేమాన్ని విస్మరిస్తే సమాజంపై అది దుష్ప్రభావాన్ని చూపిస్తుందని అంచనా వేసి, స్వరాష్ట్రంలో అలాంటి దుస్థితి రాకూడదన్న సదుద్దేశంతో బీసీ సంక్షేమం, అభివృద్ధి కోసం 2003లో తయారుచేసిన పాలసీని సీఎం అయ్యాక అమలు చేశారు. గొర్లు, బర్లు ఇచ్చి బీసీలను అవమానిస్తారా? అంటూ కొందరు అగ్రకుల పెత్తందారులు, ఇంకొందరు సూడో బీసీ నాయకులు చేసిన విమర్శలను పట్టించుకోకుండా బహుజనుల సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేశారు. స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అన్న ఆధునిక ప్రపంచపు అభివృద్ధి సిద్ధాంతాన్ని బీసీ బిడ్డలు సైతం అందిపుచ్చుకోవాలనుకున్నారు. శతాబ్దాలుగా భారతీయ సమాజంలో అంతర్గతంగా ఉండిపోయిన అద్భుతమైన కులవృత్తి నైపుణ్యాలను వృథాగా ఎందుకు పోనివ్వాలన్న ఉద్దేశంతో బహుజనులు వృత్తి నైపుణ్యానికి మరింత పదును పెట్టేందుకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక పథకాలతో సాయం అందించారు.
కేసీఆర్ ప్రారంభించిన ప్రతి సంక్షేమ పథకం వెనక మాడ్రన్ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్ (ఆధునిక పారిశ్రామికీకరణ అభివృద్ధి నమూనా) కాన్సెప్ట్ ఉన్నది. కులవృత్తులు చేసుకునే బీసీలు ఆధునిక పోకడలను అందిపుచ్చుకుని యాంత్రీకరణ, మార్కెటైజేషన్ వైపు సాగాలన్న ఉదాత్తమైన ఆలోచన, ముందుచూపు ఉన్నది. అందుకే పద్మశాలీలకు మరమగ్గాలిచ్చి ధోతులు మాత్రమే తయారు చేసుకోమని చెప్పి చేతులు దులుపుకోకుండా మార్కెట్ అవసరాలకు తగినట్టుగా పట్టు చీరలను తయారు చేసేలా వారి నైపుణ్యానికి పదును పెట్టేలా లూమ్ మాడ్రనైజేషన్తో ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా బతకడమే దినదినగండంగా సాగిన నేతన్నల జీవికకు ఓ దిక్కు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూనే ఆదాయం సంపాదించుకునేలా వాళ్లను మార్కెట్‌తో కనెక్ట్ చేశారు. గౌడ సోదరులు వారికి అనువైన స్థలాల్లో ఈతవనాలను పెంచుకునేందుకు అనుమతినిచ్చి కేసీఆర్ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. చెట్ల పన్నుఎత్తేసింది. పాత బకాయినలను రద్దు చేసింది. పెన్షన్లను ఇచ్చి ఆసరా అయింది. నీరా పాలసీతో గౌడ సోదరులకు గౌరవాన్ని ఇచ్చింది.
ఇక, గంగపుత్రులు, ముదిరాజుల కోసం కూడా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. చేప పిల్లలను ఇవ్వడమే కాదు వారికి మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ తీసుకొచ్చి గంగపుత్రుల జీవనాధారానికి తిరుగులేని భరోసా ఇచ్చారు. అలాగే, యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చి వారి సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారు. ఆయన సీఎంగా ఉన్న కాలంలో దాదాపు 8 వేల కోట్ల రూపాయాల పశు సంపదను సృష్టించారు. మాంసం ఉత్పత్తిలో మన రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు గ్రామీణ వ్యవస్థ బలోపేతమైంది. ఇతర రాష్ర్టాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలుచేశాయి. రజకుల కోసం ధోబీ ఘాట్లను విరివిరిగా నిర్మించారు.
ఓ వైపు అంతరించే దశలో ఉన్న బహుజనుల కులవృత్తులకు తిరిగి ప్రాణం పోసిన కేసీఆర్ బీసీలను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారు. 2003లో తీసుకున్న విధాన నిర్ణయాలకు అనుగుణంగా స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దాకా బడుగులకు గొడుగు పట్టారు. తెలంగాణ తొలి శాసనమండలి చైర్మన్‌గా స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారికి అవకాశం కల్పించారు. మధుసూదనాచారి ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. బండా ప్రకాశ్ ముదిరాజ్ శాసనమండలి వైస్ చైర్మన్‌గా, ఇంకా ఎంతోమంది బీసీ నేతలను వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాదాయ కమిటీల్లోనే కాకుండా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల సారథులు, సభ్యులుగా కేసీఆర్ నియమించారు. రాజకీయంగా బీసీలకు ఇంత విస్తృతంగా అవకాశాలను ఇచ్చింది బీఆర్ఎస్ ఒక్కటే.
కేసిఆర్ కృషి పట్టుదలతో ఒకప్పుడు ఆత్మహత్యలే శరణ్యమని భావించిన పద్మశాలీలు అద్భుతమైన కళా నైపుణ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తెలంగాణ ముదిరాజ్‌లు, యాదవులు తమ కులవృత్తితో దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలంగాణలోని బహుజనులను ఆర్థికంగా సంపన్నులను చూసి వారి పట్ల ఉన్న సామాజిక వివక్షను తొలగించి కుల రహిత సమాజానికి కేసీఆర్ బీజం వేశారు. అధికారంలో ఉన్నా, లేకున్నా బహుజనులను బీఆర్ఎస్ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా చూడలేదు. వారితో ఓట్ల రాజకీయాలు చేయలేదు. వారికి ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం కోసం కదం తొక్కింది. పిడికిలి బిగించింది. ఉద్యమించింది. బహుజనులకు అండగా నిలిచింది. అందుకే భారత రాష్ట్ర సమితిని బహుజన రాష్ట్ర సమితి అని పిలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
బీసీ డిక్లరేషన్ పేరుతో బహుజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన ప్రతి హమీని తుంగలో తొక్కి, ఇస్తామన్న రిజర్వేషన్లకు అసెంబ్లీ సాక్షిగా మంగళం పాడింది. చట్టం తీసుకువచ్చి మరీ బీసీలకు 42 శాతం ప్రాతినిధ్యం ఇస్తామని, కుల గణన పేరుతో ఉన్న ప్రాతినిధ్యాన్నే ప్రమాదంలోకి నెట్టింది. ఈ సందర్భంలో భవిష్యత్తుపైన ఆందోళనలో ఉన్న బీసీలంతా భారత రాష్ట్ర సమితితో కలిసి కదం తొక్కేందుకు సిద్ధంగా ఉన్నారు.
– డాక్టర్ మహేశ్ మాణిక్య ముదిరాజ్