బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సారాంశాన్ని, సందేశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రజలకు భరోసా, ప్రజా ద్రోహులకు దడ. ఆదివారం నాటి సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి మాట్లాడారన్నది సరే. కానీ, ఆ సభకు తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు అనూహ్యమైన రీతిలో అంత పెద్ద ఎత్తున కదలిరావటం, రాలేనివారంతా టీవీలకు అంకితమైపోవటం జరిగిందంటే తిరిగి కష్టాలలో చిక్కుకున్న తెలంగాణ సమాజం తన తరఫున ఒక స్టేట్మెంట్ ఇచ్చిందన్న మాట. కాంగ్రెస్ ప్రభుత్వ అధ్వాన్నపు పాలనపై అది వారి జడ్జిమెంట్ అన్న మాట. ఆ స్టేట్మెంట్పై, జడ్జిమెంట్‌పై కేసీఆర్ ప్రసంగం ఆమోదముద్ర వేసింది.
కేసీఆర్ దశాబ్దాలుగా తన పాదాలను నేలపై మోపి, వేర్లను ప్రజల మధ్యకు వ్యాపింపజేసి, వారి నాడిని పట్టుకున్న నాయకుడు. కనుకనే తదనంతర కాలపు అభివృద్ధి, సంక్షేమాలకు నాంది అనదగిన ఆలోచనలు, ప్రజాప్రతినిధిగా చర్యలు అప్పటినుంచే మొదలయ్యాయి. ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను పసిగట్టడం నుంచి ఆరంభించి, వారిని ఏకంజేసి, ఎన్నెన్ని కష్టనష్టాలూ సవాళ్లూ ఎదురైనా ప్రజలను రాజీలేకుండా లక్ష్యసిద్ధి వైపు నడపటం వరకు ప్రతిఫలించాయి. అటువంటి బలమైన పునాదులు ఉన్నందువల్లనే ఇప్పుడు ప్రజలకు, తెలంగాణకు ఎదురవుతున్న మరొక పరీక్షా సమయంలో ఆ ప్రజలను, తెలంగాణను మరొకమారు ఇంత బలంగా, వళ్లు జలదరించే రీతిలో ఉప్పెన వలె కదిలించగలిగారు.
2001లో పార్టీ స్థాపన నుంచి, 2025లో రజతోత్సవం వరకు గల మొత్తం క్రమాన్ని ఒకసారి సింహావలోకనం చేసినట్టయితే, ఈ ఘనత ఎటువంటిదో కరడుగట్టిన ప్రత్యర్థులైనా తమ మనసులలో అంగీకరించక తప్పదు. మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నదగిన అధ్యాయాలలో ఇది ఒకటి. దేశాన్నంతా పరికించి చూస్తే బలమైన ప్రాంతీయ పార్టీలు ఏడెనిమిది వరకు ఉన్నాయి. కానీ, వాటిలో తృణమూల్ కాంగ్రెస్ మినహా తక్కినవన్నీ ప్రస్తుత నాయకులకు తమ పెద్దల నుంచి వారసత్వంగా వచ్చినవే. కేసీఆర్ స్వయంగా నెలకొల్పి, ప్రజల ఆకాంక్షలను వారి భాగస్వామ్యంతో ఒక భీషణమైన సుదీర్ఘ ఉద్యమం ద్వారా సాధించి, పాలించి, ఇప్పుడు తిరిగి సమాయత్తం చేస్తున్న క్రమంలో రజతోత్సవపు మైలురాయికి చేర్చిన పార్టీ బీఆర్ఎస్. అదీ ఆ పార్టీ విశిష్టత, చారిత్రాత్మకత. ఆ విధంగా వరంగల్ సభ తెలంగాణ ప్రజలు, కేసీఆర్ కలిసి చేసిన జాయింట్ స్టేట్మెంట్, లేదా ఉమ్మడి ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చెప్పిన ఉమ్మడి తీర్పు. ఇక తెలంగాణ చేయనున్నది ఈ సంకల్ప బలంతో ముందుకు కదలటమే. తన నేలను తిరిగి తన అధీనం చేసుకోవటమే.
పార్టీ అధ్యక్షుని ప్రసంగాన్ని గమనిస్తే అది ఒక వ్యూహం ప్రకారం, ప్రణాళికాబద్ధంగా సాగినట్టు అర్థమవుతుంది. సభ సందర్భంలో ప్రధానమైన అంశాలు నాలుగున్నాయి. ఒకటి, ఇది రజతోత్సవం అయినందునా పార్టీ చరిత్రను, అందులో భాగంగా తెలంగాణ కడగండ్లు, ఉద్యమం, ఆ కడగండ్లకు కారణమైన కాంగ్రెస్, ఉద్యమకాలంలోనూ ఎన్నెన్ని సమస్యలు సృష్టించిందో ప్రజలకు గుర్తుచేయటం. రెండు, బీఆర్ఎస్ పాలనలో ఏమేమి మంచి జరిగి ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయో, మొత్తం దేశంలోనే రాష్ట్రం పలు రంగాలలో అగ్రస్థానాలకు చేరిన తీరేమిటో తెలియజెప్పటం. మూడు, అంతకుమించి నూటొక్కటి చేయగలమన్న హామీలతో ఓటర్లను మభ్యపెట్టి గెలిచిన కాంగ్రెస్ చూస్తూ చూస్తుండగానే ప్రజలను ఎట్లా మోసగిస్తున్నదో ఆ ప్రజల సమక్షంలో వారితో కలిసిచెప్పుకోవటం. నాలుగు, సాధించుకున్న స్వరాష్ట్రం కండ్లముందే తెర్లవుతూ అన్ని తరగతుల ప్రజలు బాధలు పడుతుండగా తానిక మౌనంగా ఉండలేనని, ప్రజలతో పాటు తిరిగి కదిలి విపత్తు నిర్మూలనకు సాగుతానని పూర్తి భరోసానివ్వటం.
ఆ ప్రకారం కేసీఆర్ ఏమి మాట్లాడారో చూసేముందు రెండు మాటలు చెప్పుకోవాలి. ఒకటి, వరంగల్ సభ సందర్భంగా ప్రజలు ఎటువంటి కేసీఆర్‌ను చూడాలనుకుంటున్నారో అటువంటి నాయకుడు వారికి కన్పించారు. ఆయన నుంచి ఏమి మాటలు వినాలని కోరుకుంటున్నారో ఆ మాటలు, అదే శైలిని చూశారు. తనను చూసి, విని ప్రేరణ పొందేందుకు పాతికేండ్లుగా అలవాటుపడినవారు, పార్టీ రజతోత్సవ వేళ అదే ఆశించి, చూసి, సంతృప్తి చెందారు.
ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో ఆయన ఉద్యమకారుడా, పాలకుడా, ప్రతిపక్ష నాయకుడా అన్న తేడాలు వారికి తోచలేదు. ఆ విధంగా రజతోత్సవ సందర్భం కేసీఆర్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఒక బలమైన శక్తిగా, ప్రజా పక్షపాతిగా సుస్థిరపరిచింది. ఈ వాస్తవాలు తెలిసి, మనసులో గుర్తించి కూడా ‘ఆయన పని, ఆ పార్టీ పని అయిపోయి’దంటూ పైకి రాజకీయాల కోసం బీరాలు మాట్లాడే కాంగ్రెస్, బీజేపీలు, కొందరు మహా మేధావులు, తమకు వరంగల్ సభ కలిగించిన దిగ్భ్రాంతి నుంచి కొంతకాలం వరకు కోలుకోలేరు.
పోతే, ‘ఆపరేషన్ కగార్’ను కేంద్రం వెంటనే నిలిపివేసి నక్సలైట్లను చర్చలకు పిలవాలని కేసీఆర్ కోరటం గమనార్హమైన విశేషం. అక్కడ జరుగుతున్నది గిరిజనులను, యువకులను, ఊచకోత కోయటమని, అది ధర్మం కాదని అన్నారాయన. ‘బలం ఉంది కదానని చంపుకుంట పోవుడు కాదు. అది ప్రజాస్వామ్యం కాదు… నక్సలైట్లను పిలిచి చర్చలు జరపండి. వాళ్లు ఏమి మాట్లాడుతరో చూడండి. అదిగూడ తెల్లనా నల్లనా దేశం ముందరికి రానీయండి. అట్ల కాదు, మొత్తం నరికి పారేస్తం, కోసి పారేస్తం అంటే ఎట్లా? మిలిటరీ మీ దగ్గర ఉంది కాబట్టి కొడుతరు. కానీ, అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది ధర్మం కాదు’ అన్న ఆయన, ప్రజలు ఆమోదించినట్టయితే ఆ మేరకు తీర్మానించి కేంద్రానికి లేఖ పంపగలమని ప్రకటించారు.
ఈ సభా సందర్భంలో కేసీఆర్ ‘ఆపరేషన్ కగార్’ ప్రస్తావన తేవటం, ఆ చర్యలను వ్యతిరేకిస్తూ అంతగా మాట్లాడటం ఊహించనిదే గాక, ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. కాని కొంత ఆలోచిస్తే, అది సహజమైన స్పందన అనాలి. ఎందుకంటే, నక్సలైట్ ఉద్యమ సిద్ధాంతంతో, హింసతో ఎంతమాత్రం ఏకీభవించకపోయినా, ఆ ఉద్యమ కారణాలు సామాజిక సమస్యలతో, పేదరికంతో ముడిబడి ఉన్నటువంటివని కేసీఆర్‌కు పూర్తి అవగాహన మొదటినుంచి ఉంది. ప్రజాస్వామికవాదులందరి అవగాహన అది. ఇంకా చెప్పాలంటే, ఉద్యమాన్ని అణచివేస్తూ వస్తున్నవారికి కూడా ఆంతరంగికంగా తెలిసిందే. అందువల్లనే పేదరికం తొలగింపు అని కనీసం మాటలలోనైనా అంటారు.
మరొక స్థాయిలో, ఒకప్పుడు రైతాంగ సాయు ధ పోరాటానికి, తర్వాత నక్సలైట్ ఉద్యమానికి తెలంగాణే కేంద్ర స్థానం. ప్రస్తుతం ఆపరేషన్ కగార్‌లో అక్కడ ప్రాణాలు కోల్పోతున్నవారు, ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నవారు పలువురు తెలంగాణ వారు. మాజీ ఉద్యమకారులు, కళాకారుల పాత్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా పెద్దది. బీఆర్ఎస్ అధికారానికి రాకముందు తెలంగాణలో ఎన్కౌంటర్ల పరిస్థితి ఏమిటో తెలిసిందే. తర్వాత, కేసీఆర్ విదేశాలలో ఉండగా, ఆయనకు తెలియకుండా జరిగిన ఒక ఘటన మినహా అవి పూర్తిగా ఆగిపోయాయి. తనకు నక్సలైట్లతో ఏకీభావం ఉందనలేము గాని, ఆ సామాజిక సమస్యల పట్ల, అందులోని ప్రజాస్వామిక వేదన పట్ల సానుభూతి ఉంది. అందువల్లనే వరంగల్ వంటి కేంద్రంలో ఆ వైఖరి తీసుకున్నారనాలి. అందులో గమనించదగ్గ మాటలు ‘చర్చలకు పిలవండి, ఏమి మాట్లాడుతారో చూడండి, అది దేశానికి తెలియనివ్వండి, బలం ఉంది కదానని చంపేస్తామనటం ప్రజాస్వామ్యం కాదు, ధర్మం కాదు’ అన్నవి. ఈ హేతుబద్ధమైన సూచనను కేంద్రం ఆమోదించగలదని భావించాలి.
బీఆర్ఎస్ అధ్యక్షుని ప్రసంగపు ప్రధానాంశాలకు తిరిగివస్తే, అవన్నీ ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో విన్నవి, పత్రికలలో చదివినవే అయినందున ఇక్కడ వివరంగా రాయవలసిన అవసరం లేదు. కానీ, ఒక దృక్కోణం తీసుకొని కొంత విశ్లేషించుకోవాలి. ఆ విధంగా ఆయన మొదట చేసింది, దేశ స్వాతంత్య్రానంతరం ప్రత్యేకంగా ఉండిన తెలంగాణను 1956లో ఆంధ్ర రాష్ట్రంతో బలవంతంగా విలీనం చేయటం నుంచి మొదలుకొని, ఈ నేలకు అన్యాయాలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల అణచివేతలు, మలివిడత ఉద్యమకాలంలోనూ చేసిన మోసాలు, వీటన్నింటిలో నెహ్రూ, ఇందిరల నుంచి ఆరంభించి ఆ వంశీకులు, వారి పార్టీ, ఇక్కడి కాంగ్రెస్‌వాదులు చేసిన దగా, చివరికి 2014లో విధి లేక రాష్ర్టాన్ని సృష్టించినా ఇప్పుడు అధికారానికి వచ్చి ఏడాదిన్నర అయినా తిరగకముందే చేస్తున్న నష్టాలను అసమర్థ పాలనను ప్రజల దృష్టికి తేవటం ఒకటి. ఆ విధంగా మొదటినుంచి ఇప్పటివరకు తెలంగాణకు కాంగ్రెస్సే మొదటి విలన్ ఎట్లా అయిందనే చరిత్ర విడమరిచి చెప్పారు.
రెండవ అంశం బీజేపీ. దాని శక్తి తెలంగాణలో స్వల్పమే గనుక, పైగా గత దశాబ్దాల కాలంగా దాని పాత్ర అంటూ లేనందున, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నా, ఇక్కడి నుంచి ఎంపీలు గెలిచినా, రాష్ట్రం కోసం చేసింది కూడా స్వల్పమేనని ఎత్తిచూపారు. అదే సమయంలో, ప్రధానమంత్రి మోదీ ఇంకా అధికారానికి రాకముందు ప్రచారకాలంలో ఆ తర్వాత కూడా ‘తల్లిని చంపి బిడ్డను బతికించా’రంటూ తెలంగాణను అవమానించటాన్ని గుర్తుచేశారు. మోదీ దృష్టిలో ఉమ్మడి రాష్ట్రం తల్లి అన్న మాట. ఆయన పదే పదే కీర్తించిన ఆ తల్లి తన తెలంగాణ ‘బిడ్డ’ను యాభై ఏండ్లకు పైగా ఎట్లా గొంతు నులుముతూ వచ్చిందో మాత్రం ఆయనకు పట్టలేదు. లేదా, అట్లా గొంతు నులిమితే ఆ ‘తల్లి’ ద్వారా తన ప్రయోజనాలు నెరవేరగలవని ఆయన ఆశించి ఉంటారనుకోవటం సరైనదవుతుందేమో.
మూడవ అంశం రైతులు, నాల్గవది మహిళలు, అయిదవది యువకులు, ఆరవది సకల జనుల సంక్షేమ పథకాలు, ఏడవది పరిశ్రమలు, ఎనిమిదవది ఐటీ తదితర సర్వీస్ రంగాలు, తొమ్మిదవది రియల్ ఎస్టేట్, పదవది తెలంగాణ అనేక విధాలు గా వెనుకబడుతూ ఇతర రాష్ర్టాలతో పోల్చినప్పు డు బీఆర్ఎస్ పాలనా కాలపు ర్యాంకులు దిగజారుతుండటం. చివరిగా కేసీఆర్ అన్నది, ఇంతలోనే ఇట్లా జరుగుతుందనుకోలేదు. ఇది చూసి బాధ, దుఃఖం కలుగుతున్నాయి. కడుపులో కాలుతున్న ది. తెలంగాణ తిరిగి విజయపథంలో సాగి అందరి ముఖాలలో నవ్వు కనిపించాలి. అందుకోసం ఇక స్వయంగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు రాగలనని ప్రకటించారాయన. ఒక ఉపమానం చెప్పవచ్చునో లేదో తెలియదు గానీ, రోగి కోరుకున్నది, వైద్యుడు సూచించింది రెండూ ఒకటే అయ్యా యి. అనగా, తెలంగాణలో ఇక ప్రజోద్యమ రాజకీయ రంగాన్ని చూస్తామన్న మాట.