ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ 25 ఏండ్ల ఆవిర్భావ పండుగకు సిద్ధమైం ది. స్వరాష్ట్రం కలను సాకారం చేసి, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన బీఆర్ఎస్.. చరిత్ర సమస్తం పోరాటాల మయమే. గులాబీ జెండాను, కేసీఆర్‌ను వేరుచేసి చూడలేం. 1969 ఉద్యమం అణగారిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా? అని జనం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో గులాబీ జెండానుచేతబూని కేసీఆర్ బయల్దేరారు. చినుకుగా మొదలైన ఆ ఉద్యమ ప్రస్థానం అనతికాలంలోనే తుఫాన్‌గా మారింది.
2001, ఏప్రిల్ 27న తెలంగాణ జాతిని విముక్తం చేయడానికి కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి, ఉద్యమంలో తొలి అడుగు వేశారు. అదే ఏడాది మే 17న కరీంనగర్ సింహగర్జన సభలో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి తీరుతానని కేసీఆర్ సుస్పష్టంగా చెప్పారు. ఆ లక్ష్యం నుంచి తప్పుకొంటే రాళ్లతో కొట్టాలని స్పష్టం చేశారు. రాజకీయ పక్షాల్లో ఎంతమంది నాయకులు అలా చెప్పగలరు? ఆ తెగు వ, ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధే టీఆర్ఎస్ను ఇన్నేండ్లు నిలబెట్టాయి. కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ కోణంలోనే చేస్తారు. ఏ సమస్య వచ్చినా బాధితుడి వైపు నుంచే ఆలోచిస్తారు. ఆయనను సన్నిహితంగా గమనిస్తే.. ‘విజేతలు విభిన్న పనులేవీ చేయరు.
అందరూ చేసే వాటినే విభిన్నంగా చేస్తారు’ అన్న శివ్‌ఖేర్ మాటలు వాస్తవమనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానమూ అంతే. కేసీఆర్ భిన్నమైన పంథాను ఎన్నుకున్నారు. ఉద్యమాన్ని, రాజకీయాన్ని మేళవించారు. గతంలో జరిగిన అనేక రాష్ర్టాల ఆవిర్భావాలను లోతుగా అధ్యయనం చేశారు. ఒక్క నెత్తురు చుక్క చిందించకుండా రాష్ట్రం సాధించడం మాటలు కాదు. నిరసన తెలపాల్సి వస్తే శాంతియుత మార్గాన్నే ఎన్నుకున్నారు. తానే ఆమరణ దీక్షకు పూనుకొని శాంతియుతంగానే రాష్ట్రం సాధించారు. సడక్ బంద్, వంటావార్పు, సకల జనుల సమ్మె… ఇలా ఏ నిరసన చేసినా శాంతియుతమే.
‘ఉద్యమ సూర్యుడా వందనం..
ఒక్క పిడికిలి బిగిస్తే.. బిగుసుకున్నయ్ కోట్ల పిడికిళ్లు
ఒక్క గొంతు జై కొడితే జంగు సైరనయ్యింది
స్ఫూర్తి ప్రదాతా వందనం.. ఉద్యమ సూర్యుడా వందనం’..
అంటూ తెలంగాణ ప్రజలు రజతోత్సవ సంబురాలకు సన్నద్ధమవుతున్నారు. ‘తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన జెండా.. గుండె గుండెను ఒకటి చేసిన జెండా.. ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా, పేదవాడి ఆకలి తీర్చిన జెండా, రైతన్నకు భరోసా ఇచ్చిన జెండా.. తెలంగాణ ప్రజలకు అండాదండా మన గులాబీ జెండా..’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినదిస్తున్నాయి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
– కోలేటి దామోదర్