భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత ఖమ్మం వేదికగా బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సభకు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇతర పార్టీల అధినేతలు వస్తున్నారు. గులాబీ దళం ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ను దేశవ్యా ప్తంగా విస్తరింపజేయడమే జాతీయ అధ్యక్షులు కేసీఆర్ వ్యూహం. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలి. జనసందోహం ఎక్కువగా తరలిరానున్న నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని మంత్రుల బృందం పర్యవేక్షిస్తున్నది. ఈ సభకు లక్షలాది మంది వస్తారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఏర్పడినప్పటికీ ఇతర రాష్ర్టాల నుంచి మంచి స్పందన వస్తుండటమే దానికి కారణం. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ ఎదుగనున్నదని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశ రాజకీయాలు తెలంగాణ కేంద్రంగా సాగనున్నాయి. అందుకే ఖమ్మం సభ చరిత్రలో మైలురాయిగా నిలువనున్నది. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే వారిపక్షాన ప్రజలు నిలబడతారనేది కేసీఆర్ నమ్మిన సిద్ధాంతం. కేసీఆర్‌కు బలం ప్రజలే. ఈ విషయాన్ని చాలా సభల్లో ఆయనే బహిరంగంగా ప్రకటించారు. అందుకే ఆయన ప్రజా సంక్షేమం విషయంలో ఏనాడూ రాజీపడలేదు. పేద ప్రజల స్థితిని, దేశ ఆర్థికవ్యవస్థను మార్చడానికి కేసీఆర్ ప్రజల ముందుకు వస్తున్నారని దేశం విశ్వసిస్తున్నది. దేశ సంక్షేమం కోసం ఏ ఎజెండాతో ముందుకుపోవాలనే విషయంలో కేసీఆర్ ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ తన శంఖారావం పూరించనున్నది.
– మిద్దె సురేష్, 97012 09355
ఎత్తింది తెలంగాణ జెండా భారత ప్రజల ఎజెండా.. నింగిని తాకుతూ గులాబీ జెండా ఖమ్మం గుమ్మం నుంచి ఎర్ర కోట గమ్యం వైపు కదులుతున్నది. జాతి భవితకు భరోసా ఇస్తున్న జగజ్జేత కేసీఆర్. భారత్ రాష్ట్ర సమితి ఉజ్వల కెరటం ఖమ్మం గుమ్మం నుంచి గజ్జె కట్టింది. ఉవ్వెత్తున జన చైతన్యం ఖమ్మంకు కదం తొక్కనున్నది. దేశం కోసం రైతుల కోసం తెలంగాణ కాగడా ఖమ్మం నుంచి దేశమంతా వెలుగులు నింపనున్నది. ఇప్పుడు దేశం చూపంతా ఖమ్మం వైపే ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, జాతీయపార్టీల నాయకులు రానున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న మొదటి సభ కాబట్టి భారీగా జనం వచ్చే అవకాశం ఉన్నది. గతంలో వరంగల్‌లో జరిగిన సభ ప్రపం చ చరిత్రలో నిలిచింది. ఇప్పుడు ఖమ్మం సభ కూడా అదే స్థాయి లో జరుగుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే పది లక్షల జనం వస్తారని అంచనా వేశారు. ఒకప్పుడు ఎన్నో విప్లవోద్యమాలకు, కమ్యూనిస్టు ఎర్రజెండాలకు సాక్షిగా నిలిచిన ఖమ్మంలో నేడు గులాబీ జెండా రెపరెపలాడనున్నది. ఎన్నో ఉద్యమాలు, సభలతో చరిత్ర సృష్టించిన కేసీఆర్ ఖమ్మం సభతో మరో చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఖమ్మం గుమ్మం నుంచి పడుతున్న తొలి అడుగు ఎర్రకోట గమ్యాన్ని చేరేవరకు విశ్రమించదు. కేసీఆర్ దేశానికి కొత్త వెలుగు నింపబోతున్నారు.
– చిటుకుల మైసారెడ్డి, 94905 24724
భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో ఖమ్మంలో నేడు తొలి సభ జరుగనున్నది. ఈ సమావేశానికి పలు పార్టీల జాతీయ నాయకులు హాజరుకానున్నారు. ఈ సభా వేదికగా పలువురు జాతీయ నాయకులు తమ మద్దతును తెలుపనున్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో దీక్షకు బయల్దేరిన కేసీఆర్‌ను కరీంనగర్లో అరెస్టు చేసి ఖమ్మం తరలించిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ అక్కడే దీక్షకు దిగి ఉద్యమాన్ని మలుపుతిప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి సభ ఖమ్మంలో జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఖమ్మం జిల్లా కేంద్రం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లకు సరిహద్దు జిల్లా. రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలకు కూడా ఖమ్మం వేదిక కానున్నది. కాబట్టి ఈ రెండు రాష్ర్టాల కార్యకర్తలు, నాయకులు ఈ సభకు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. దేశ రాజకీయాలను మలుపుతిప్పే ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభ సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పలువురు మేధావులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
– ఈదునూరి వెంకటేశ్వర్లు, 99663 36457