రాచరిక పాలన నుంచి స్వతంత్ర భారత్ వరకు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 1940వ దశకంలో మహోన్నత సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన చరిత్ర తెలంగాణ సమాజానిది. షేక్ బందగీ, దొడ్డి కొమరయ్యల అమరత్వం నేటికీ స్ఫూర్తిగా నిలిచిపోయింది. సాయుధ పోరాట విరమణ, హైదరాబాద్ సంస్థానం విలీనం, భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరిట తెలంగాణను ఏపీలో కలపడంతో మళ్లీ తెలంగాణకు అన్యాయం జరిగింది.
అనేక ఉద్యమాలు జరిగినా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేకపోయాయి. పదవులపై ఉన్న మమకారంతో ప్రజల ఆకాంక్షలను తెలంగాణ నేతలు ఢిల్లీలో తాకట్టుపెట్టారు. ఈ నేపథ్యంలో స్వరాష్ట్రం కల సాకారమవ్వాలంటే పదవుల త్యాగం తప్పనిసరని భావించిన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమ కాగడాను చేతబూని బయలుదేరారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పేరిట జనంలోకి వెళ్లారు. తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా సుదీర్ఘ పోరాటం చేశారు. ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరూ ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. నిరసనలు, ఆందోళనలతో మహోన్నత ఉద్యమాన్ని నిర్మించారు. కేసీఆర్ అవిశ్రాంత పోరాటం, ప్రజల ఆకాంక్షలు ఫలించి స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది.
ఉద్యమ నాయకుడి చేతుల్లోనే పాలనాపగ్గాలు ఉండాలని భావించిన ప్రజలు కేసీఆర్‌కే పట్టం కట్టారు. ప్రజల కష్టాలను స్వయంగా చూసిన కేసీఆర్.. ఆ వెతలకు చరమగీతం పాడాలని నిశ్చయించుకున్నారు. అనేక విప్లవాత్మక పథకాలను రూపొందించి అమలుచేశారు. పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా నిలిపారు. తెలంగాణను సుస్థర అభివృద్ధి వైపు నడిపించారు. తెలంగాణకు అనేక అవార్డులను తెచ్చిపెట్టాయి. ఉద్యమంలో పద్నాలుంగేండ్లు, స్వయంపాలనలో పదేండ్లపాటు కేసీఆర్ నాయకత్వంలో ముందుకుసాగామని చెప్పేందుకు గర్వపడుతున్నా. నేడు మళ్లీ తెలంగాణ ప్రమాదంలో పడింది. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వం అవసరమనే భావన ప్రజల్లో కలుగుతున్నది. కేంద్రంలో బీజేపీ వైఫల్యాలను ఎండగట్టాలన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలన నుంచి విముక్తి కలగాలన్నా కేసీఆర్‌తోనే సాధ్యం. బీఆర్ఎస్ 25 వసంతాల పండగ సందర్భంగా కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరుద్దాం! భవిష్యత్ తెలంగాణను సంరక్షించుకుందాం!
-నాయినేని రాజేశ్వరరావు, 94902 01066