ఇప్పుడు కావలసింది తెలంగాణ ఆత్మను, బీఆర్ఎస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడం. ఈ రెండు పనులు అవసరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలుసు. తను స్వయంగా ఇటీవలి కాలంలో కొన్నిసార్లు అన్నవే. కనుక ఆ పని జరగాలి. ఆలస్యం లేకుండా జరగాలి. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడు నెలలైంది. లోక్సభ ఎన్నికలు జరిగి రెండు నెలలైంది. ఈ రెండింటి మధ్య బీఆర్ఎస్ సమీక్షా సమావేశాలు జరిగి మూడు నెలలు దాటింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటికి జరిగేదీ తెలియదు. కనుక బీఆర్ఎస్ను గ్రామస్థాయి నుంచి నిర్మించి బలోపేతం చేయడానికి, దాని వెనువెంటగా తెలంగాణ ఆత్మను, స్ఫూర్తిని తిరిగి శక్తిమంతం చేయడానికి ఇది తగిన సమయం.
పార్టీకి తనవైపు నుంచి ఇవి అనుకూలమైన రోజులు కాగా, బయటి వైపు నుంచి కలిసిరాగల మూడు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలకు, ఆలోచనాపరులకు సదభిప్రాయం ఏర్పడకపోతుండటం. నిర్దిష్ట గడువులతో ప్రకటించిన హామీల అమలులో వైఫల్యం. అవినీతి చూస్తూ చూస్తూండగానే పెచ్చరిల్లుతున్నదనే జనాభిప్రాయం. రెండు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో మోదీ అనుకూల భావనలు తగినంతగా కనిపించినప్పటికీ.. లోక్సభ ఫలితాలు మోదీ ప్రభను దేశంలో తగ్గించివేయడం. మూడు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి-సంక్షేమాలు ప్రజల జ్ఞాపకాలలోకి తిరిగి వస్తుండటం. కాంగ్రెస్ అంతకుమించి ఏదో చేయగలదని ఆశించగా, అటువంటి ఆశలు భ్రమలని నెమ్మది నెమ్మదిగా తేలుతుండటం.
ఇవన్నీ గాక ముఖ్యమైనది మరొకటి ఉంది. అది తెలంగాణ ఆత్మ అనే మాటకు పొడిగింపు వంటిది. తెలంగాణ అనే భూభాగానికి మొదటి నుంచి గల ప్రత్యేక గుర్తింపు, స్వీయ ఆలోచనలు, స్వీయ దార్శనికత, తెలంగాణ తల్లి భావన, ఫెడరలిజం, ఉపజాతీయత వంటివి ఎట్టి పరిస్థితులలోనూ సజీవమైనవే. సుఖాలు లభించినా, ఒడిదుడుకులు ఎదురైనా అది చెక్కుచెదరనిదే. భారతదేశపు వేల ఏండ్ల వైవిధ్యతా చరిత్రలో భాగమైనదే. అందుకే, అంతర్గత వలస ధోరణులను ఢిల్లీ నుంచి జాతీయవాదం పేరిట, లేదా పొరుగు నేల నుంచి భాషావాదం పేరిట ఏ శక్తులు అనుసరించినా ధిక్కరించినది అందువల్లనే. ఎన్నికల ఒడిదుడుకులు ఎట్లున్నా, ఈ విధమైన తెలంగాణ భావనలు, ఆత్మ తమలో సజీవంగా ఉన్నవారు అనేకానేకులు కనిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ భూమి నలుచెరుగుల వరకు. ఇది అది అని గాక అన్ని రంగాలలో. తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర సాధనకు పలు దశాబ్దాల పాటు ప్రధానమైన ఆలంబన అయింది ఈ వర్గాలే. ఈ పరిస్థితులే, ఈ భావనలే.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మొదలుకొని ఈ భావనలను, గుర్తింపులను కొన్ని శక్తులు క్రమంగా వెనుకకు తోసివేస్తున్న స్థితి వీరందరిని కలవరపరుస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ రెండూ మౌలికంగానే ఫెడరలిజానికి వ్యతిరేకమన్నది అందరికీ తెలిసిన విషయమే. ఫెడరల్ భావనలు దేశ వైవిధ్యత మూలంగా స్వాతంత్య్రోద్యమంలోనే ఉండి, స్వాతంత్య్రానంతరం కొంతకాలానికే భాషా రాష్ర్టాలు ఏర్పడి, సహకార ఫెడరలిజం అనే మాట రాజ్యాంగంలోనే ఉన్నప్పటికీ, కేంద్రంలో ఏకచ్ఛత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్ మొదటి నుంచీ రాష్ర్టాల ఆర్థిక, పరిపాలనా హక్కులను క్రమంగా హరించడం మొదలుపెట్టింది. ఆర్టికల్ 356ను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తూ కాంగ్రెసేతర పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టి రాష్ట్రపతి పాలనను విధిస్తూపోయింది. ఆ స్థితిపై తీవ్రమైన వ్యతిరేకతలు, పలు కోర్టు తీర్పులు రావడంతో పరిస్థితి సమీక్షకు 1986లో జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్ను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఆ తర్వాత సైతం కాంగ్రెస్ ధోరణి స్వల్పంగా తప్ప మారలేదు. ఫెడరల్ పార్టీల భాగస్వామ్యంతో వివిధ ఐక్య సంఘటనలు కేంద్రంలో అధికారానికి వచ్చిన మీదట గాని తగు మార్పులు కనిపించలేదు. ఇదీ కాంగ్రెస్ చరిత్ర. ఇందుకు ఒక కారణం అధికార దాహం, అధికార కేంద్రీకరణ కాగా, బయటకు అంతగా కనిపించని మరొక ముఖ్యమైన కారణం పెద్దపెద్ద వ్యాపార వర్గాల దోపిడీకి అనుకూలమయ్యే అంతర్గత వలస విధానాలు, ఆర్థిక అసమానతలు.
కాంగ్రెస్ క్రమంగా క్షీణిస్తుండగా ఆ శూన్యంలోకి ప్రవేశించసాగిన బీజేపీ అనే మరో జాతీయ పార్టీకి కూడా ఈ అవలక్షణాలన్నీ ఉన్నాయి. అదిగాక, ఫెడరలిజానికి పూర్తిగా వ్యతిరేకమైన సిద్ధాంతాలు ఆరెస్సెస్ అధికారిక పత్రాల్లోనే బహిరంగంగా, లిఖితపూర్వకంగా ఉన్నాయి. వారు భాషాప్రయుక్త రాష్ర్టాలకు కూడా వ్యతిరేకం.
ఇతర పార్టీల ప్రభుత్వాలను ఆర్థికంగా, ఇతర విధాలుగా ఇబ్బందిపెట్టడం, వివిధ వివక్షలు, ప్రాంతీయ పార్టీలను బలహీనపరచి, చీల్చి, తమలో విలీనం చేసుకోవడం, లేదా నామరూపాలు లేకుండా చేయడం వంటి చర్యలన్నీ ఈ వ్యూహంలో భాగమే. ఈ రెండు జాతీయ లేదా యూనిటరిస్టు పార్టీలు తమ వివిధ వైఫల్యాల కారణంగా సొంత మెజారిటీలను కోల్పోయి ఫెడరల్ పార్టీల మద్దతుపై ఆధారపడవలసి వచ్చిన పరిస్థితుల్లోనూ, పైకి సహకార ఫెడరలిజం నటనలు చేస్తూ ప్రాంతీయతలకు, వాటి హక్కులకు భంగకరంగా వ్యవహరిస్తూనే వస్తున్నాయి. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదన్నట్టు.. ఈ రెండు పార్టీలు లేదా యూనిటరిస్టు శక్తుల స్వభావం మార్పుపై ఎటువంటి ఆశలు పెట్టుకోలేం.
ఈ వాస్తవాలన్నీ ప్రజలకు అర్థం కావడం వల్లనే దేశంలో ప్రాంతీయ పార్టీలు వర్ధిల్లుతున్నాయి. ఇది మొదటినుంచి ఉన్న చరిత్ర. 1980ల నుంచి మరింత బలంగా కనిపిస్తున్న చరిత్ర. మొన్నటి లోక్సభ ఎన్నికలలోనూ అదే మరొకసారి రుజువైంది. తెలంగాణ కూడా ఈ విస్తృత చిత్రంలో భాగమే. ఈ విషయాలు ఇంతగా చెప్పుకోవడం ఎందుకంటే, పైన చెప్పుకున్నట్లు, ఒడిదుడుకులు కొన్ని ఎదురైనా, ఈ విధమైన తెలంగాణ భావనలు, ఆత్మ తమలో సజీవంగా ఉన్నవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఈ భూమి నలుచెరుగుల వరకు. ఇది అది అనిగాక అన్ని రంగాల్లో.
ఇటువంటి భావనలతో పాటు తెలంగాణ భౌగోళికం, చరిత్ర, సమాజం, అవసరాల గురించి కేసీఆర్కు తెలిసినంతగా మరొకరికి తెలియదు. కేసీఆర్ లాంటివారు మరొకరు కనిపించరు. ఆయనంత స్పష్టత, నిబద్ధత గలవారు కూడా మరొకరు కనిపించరు. ఈ మాటలతో ఎవరైనా విమర్శకులు విభేదించదలిస్తే, ఆ ఇతరులు ఎవరో పేర్లు చెప్పాలి. ఇప్పుడు అంతిమ విషయం ఏమంటే, ఆయన బీఆర్ఎస్ను స్వయంగా తానే చెప్తున్న విధంగా, గ్రామస్థాయి నుంచి నిర్మించి బలోపేతం చేయాలి. తెలంగాణ ఆత్మ అనే దానిని మరొక విధంగా చెప్పాలంటే, తెలంగాణ ఫిలాసఫీ అన్నమాట. ఎప్పుడైనా దేనికైనా ఫిలాసఫీ లేదా తాత్తికత అనేది మూలాధారం. ఒక జాతికైనా, దేశానికైనా, అదే పద్ధతిలో ఒక ఉపజాతికైనా, ఒక ఫెడరల్ భూభాగానికైనా ఆ ఫిలాసఫీ సకల విషయాల సమాహారమవుతుంది. ఒకసారి అది రూపుదిద్దుకుంటే ఇక చలనం ఉండదు. ఉపజాతిపరంగానైనా, భౌగోళికంగానైనా, చివరకు అందుకు ప్రాతినిధ్యం వహించే పార్టీకి ఎన్నికల పరంగానైనా. అందుకు ఉదాహరణలు దేశ ఎన్నికల చరిత్రలో అనేకం కనిపిస్తాయి.
ఈ రోజున మనముందున్న తప్పనిసరి అవసరం, అత్యవసరం ఏమంటే, తెలంగాణ తెర్లుతెర్లు కావద్దు. ఫెడరలిజానికి వ్యతిరేకమైన యూనిటరిస్టు రాజకీయ శక్తులు, అంతర్గత వలసలుగా మార్చే ఆర్థిక శక్తులు, స్వప్రయోజనాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టని శక్తులు, ఈ ఎన్నికల ఫలితాలను ఆధారం చేసుకుని తిరిగి ఇటు చూపులు సారిస్తున్న పొరుగు ప్రాంత వలస శక్తులపాలు కావద్దు ఈ వీర భూమి. ఈ సవాళ్లకు ఏకైక సమాధానం తెలంగాణ ఏకైక ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ గ్రామస్థాయి నుంచి పునర్నిర్మితమై బలోపేతం కావడం, తెలంగాణ ఆత్మ బలోపేతం కావడం. ఈ అవకాశాన్ని కోల్పోతే తెలంగాణకు సమీప భవిష్యత్తులో మరొక అవకాశం అభించకపోవచ్చు.
– టంకశాల అశోక్