తెలంగాణ గడ్డపై మహోన్నత లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్నాళ్లుగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే కాళేశ్వరం ప్రాజెక్టును నీటితో నింపి అన్నదాతకు ఊతంగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ, కాంగ్రెస్ సర్కారు కక్షగట్టి నీరివ్వకుండా ప్రాజెక్టును ఎండబెట్టింది. మేడిగడ్డ ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయించకుండా, ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేసింది. దీనిపై విజిలెన్స్ విచారణతోపాటు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సర్కారు కపట నాటకానికి తెరదీసింది.
కాళేశ్వరంపై నియమించిన కమిషన్ విచారణ సందర్భంగా చాలామంది తమ వాదనలు వినిపించారు. వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా వాదోపవాదాలు జరిగాయి. కమిషన్‌పై పలు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కమిషన్‌పై ఆరోపణలు ఎలా చేస్తున్నారని ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ అడిగితే మీడియాలో వస్తున్న కథనాలను పలువురు చూపించారు. అయితే, ‘మీరు చెప్పే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పని లేదు’ అని ఆయన తోసిపుచ్చారు. ఇలా విచారణ సందర్భంగా పారదర్శకత పాటించకుండా, అసంబద్ధంగా వ్యవహరించడంతో కమిషన్‌పై, విచారణపై, ఇచ్చే నివేదికపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నది సుస్పష్టం. ఈ క్రమంలోనే కమిషన్ తన నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో సుమారు 20 లక్షలకు పైగా ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. గోదావరి జలాలతో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా కేసీఆర్ తీర్చిదిద్దారు. ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఎదిగింది.
కాంగ్రెస్ సర్కారు వచ్చాక కూడా గతంలో మాదిరిగానే కాళేశ్వరం ప్రాజెక్టును నమ్ముకుని అన్నదాతలు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టడంతో పంటలన్నీ ఎండిపోయాయి. తత్ఫలితంగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం కాస్తా 73 వేల ఎకరాలకు పడిపోయింది. పంటలు ఎండటంతో తెలంగాణ తల్లి తల్లడిల్లుతున్నది. అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రం కాస్తా.. రైతన్న కన్నీటితో ఆకలితో అల్లాడే దుస్థితికి చేరింది. కేసీఆర్‌కు పేరు రావొద్దని, రైతులు కేసీఆర్‌ను మర్చిపోవాలని, కేసీఆర్ పేరును చెరిపేసే కుట్రలో భాగంగా ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్నేసింది. నీరు ఇవ్వలేమంటూ స్వయంగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోందడరెడ్డి వ్యాఖ్యానించడం రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనం.
పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపకుండా గాలికొదిలేశారు. గోదావరి జలాలను ఒడిసిపట్టకుండా విడిచిపెట్టారు. ఇది ముమ్మాటికీ చారిత్రక తప్పిదం. బహుళార్థ సాధక కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించి, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ఇలాంటి కుట్రలకు పదునుపెట్టింది. అందులో భాగంగానే నీరు నిల్వ చేయడం లేదు. పిల్లర్లకు మరమ్మతులు చేయించకుండా తాత్సారం చేస్తున్నది. పంటలకు నీరందకుండా చేసి, రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటినుంచి సమస్యను అన్నదాతల కోణంలో చూడటం లేదు, పరిష్కరించడం లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు.
గోదావరి జలాలు ఎగువ ప్రాంతానికి రావన్న మాటలకు చెక్ పెడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కట్టించారు. ఏకంగా ఒక నదిని ఎత్తిపోసే భగీరథ ప్రయత్నం చేశారు. రికార్డు స్థాయిలో నాలుగేండ్లలోనే ప్రాజెక్టును పూర్తిచేసి కండ్లముందు సాక్షాత్కరింపజేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టు కట్టినా నాన్చుడు ధోరణితో కమీషన్ల కోసం అంచనాలు పెంచుకుంటూపోయేవి. ఈ క్రమంలోనే రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆ సందర్భంలో తెలంగాణ సోయి లేని కాంగ్రెస్ నేతలు చెప్పిన ‘మేము ప్రిపేర్ అయ్యి రాలేదు’ అన్న మాటలను ప్రజానీకం ఇంకా మర్చిపోలేదు.
‘నాగార్జునసాగర్ కట్టిన నాడు రూ.90 కోట్లు వ్యయం అయ్యింది. ఇప్పుడు అలాంటి ప్రాజెక్టు రూ.9 లక్షల కోట్లు పెట్టినా కట్టలేం. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టి, నేను పూర్తి చేయలేకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా?’ అని గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల, రైతాంగం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఇది తార్కాణం. స్వయంగా రైతు అయిన కేసీఆర్ అన్నదాతల కష్టాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణను ధాన్యాగారంగా మార్చి, రాష్ర్టాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేశారు.
అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారంటూ ఆరోపణలు చేస్తున్న నాయకులు.. దాని ఫలాలు చూడకుండా అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. వ్యవసాయం అభివృద్ధి చెంది రైతులు పుట్లకు పుట్టు వడ్లు పండిస్తే ఆర్థిక వృద్ధి జరగకుండా ఉంటుందా? రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ అయ్యి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఉంటుందా? ఈ విషయాన్ని కుహనా మేధావులు గుర్తించకపోవడం శోచనీయం. దూరదృష్టితో రాష్ట్ర ప్రజానీకానికి మంచి చేయాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే, ఆయన మార్క్ కనబడకుండా చేయాలనే దురుద్దేశంతో ఆరోపణలు చేయడం సహేతుకం కాదు. రైతుల మదిలో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారనే అక్కసుతో విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించాలని చూస్తున్న తీరును చరిత్ర క్షమిస్తుందా? రైతన్నలు క్షమిస్తారా? గత వానకాలంలో చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా వరద వచ్చినా మేడిగడ్డ ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. మొన్నటివరకు రాజకీయ లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, మేడిగడ్డ పిల్లరు కుంగిపోయిందని అసంబద్ధ ఆరోపణలు చేసిన నేతలు ఏం సమాధానం చెప్పాలి?
దేశవ్యాప్తంగా చూసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా ఏ ప్రాజెక్టుకైనా నిర్వహణ అనేది అనివార్యం. నాగార్జునసాగర్ అయినా, శ్రీశైలం అయినా చిన్నచిన్న రిపేర్లు వస్తూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ నీరు నిల్వ ఉంచడం పరిపాటి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన చిన్న ఇబ్బందిని అధిగమించి మరమ్మతులు చేయించి, నీరు నిల్వ ఉంచి అన్నదాతలకు అందించాలి. అంతే తప్ప కేసీఆర్‌పై కోపంతో రైతులను బలి చేయాలనుకోవడం సరికాదు.
కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో కేంద్రప్రభుత్వ పెద్దలు వచ్చి సందర్శించారు. కాళేశ్వరం ఒక అద్భుతమని కొనియాడారు. మరి అదే ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులివ్వడం వెనుక ఎవరి హస్తం ఉంది? అటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులివ్వడం దేనికి సంకేతం? ఈ నోటీసుల వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు బీజేపీకి చెందిన కొందరు నాయకులు ఉన్నారని, కుమ్మక్కు రాజకీయంలో భాగంగానే ఈ నోటీసుల పర్వం రక్తికట్టించేలా చేస్తున్నారనేది బహిరంగ రహస్యం.
కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎన్నయినా చేసుకోవచ్చు. కేసీఆర్ చేసిన మంచి కంటే రెట్టింపు చేసి ప్రజలకు చూపింపవచ్చు. అన్నదాతలను కేసీఆర్ ఆదుకున్న దానికంటే ఎక్కువగా ఆదుకోవచ్చు. గొప్ప ప్రాజెక్టుల్ని కట్టి ప్రజాభిమానాన్ని చూరగొనవచ్చు. కానీ, మంచి చేసిన కేసీఆర్ పేరును చెరిపేద్దామనుకుని ఇలాంటి రాజకీయం చేయడం దుస్సాహసమే. ఎందుకంటే చెరిపేయడానికి కేసీఆర్ పేరు బ్లాక్ బోర్డుపైనో, బల్లపైనో లేదు. లక్షలాది ఎకరాలకు నీరందించిన రైతన్నల గుండెల్లో సుస్థిరంగా ఉన్నది. తెలంగాణ సాధించిన జాతిపితగా ఏ మూలకు వెళ్లినా ఆయనే కనిపిస్తారు. ఉద్యమమే ఊపిరిగా, పోరాటమే శ్వాసగా మార్చుకున్న కేసీఆర్.. కాంగ్రెస్ ఉడత ఊపులకు జంకరు. రైతులను ఆదుకోవడంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం.. కమీషన్లకు అలవాటు పడిన కాంగ్రెస్ నేతలకు కనిపించదు. రైతులు పొందిన మేలును ఆ కండ్లు చూడలేవు. కపట నాటకాలతో రైతాంగాన్ని ఇబ్బంది పెడితే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు.
(వ్యాసకర్త: ఎమ్మెల్సీ)
– పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి