కొందరు రాజకీయంగా ఎంత పెద్ద పదవులు అనుభవించినా.. ప్రజల్లో వారికి అంతగా ఆదరణ ఉండదు. పదవి పోగానే సహజంగా ఆ రాజకీయ నాయకుడు ప్రజలకు దూరంగా ఉండాలని చూస్తాడు. అలా పదవులు అనుభవించినంత కాలం ప్రజల్లో ఉండి హోదా, పలుకుబడి రాగానే మానవత్వాన్ని మరిచే రాజకీయ నాయకులు ఎందరో. కొందరు అలా కాదు. రాజకీయ పదవులు చేపట్టకపోయినా.. వారు చేసిన ప్రజా సేవలను బట్టి చరిత్రలో వారికంటూ ఓ గుర్తింపు ఉంటుం ది. అటువంటి గొప్ప ప్రజా సారథి, సేవకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి.
తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు, అంతకుముం దునుంచే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జిట్టా బాలకృష్ణారెడ్డి ఎంతగానో పరితపించేవారు. నల్లగొండ జిల్లాలో పుట్టిన ఆయన తన జన్మభూమి ఎదపై గుదిబండగా మారిన ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టేందుకు అహర్నిశలు శ్రమించారు. భువనగిరి నియోజకవర్గవ్యాప్తంగా తాగునీటి వాటర్ ప్లాంట్లను ప్రారంభించి నిజమైన సేవకుడినని నిరూపించుకున్నారు. రాజకీయంగా కలిసి వస్తే విధానపరమైన నిర్ణయాలతో ప్రజలకు మరింతగా సేవ చేయాలని ఆయన సంకల్పించారు. కానీ, ఆయన అనుకున్నది జరగలేదు. అయినప్పటికీ ఏనాడూ ఆయన ప్రజలకు దూరం కాలేరు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ జిట్టా ఉండేవారు.
ప్రజాప్రతినిధి కాలేకపోయినా, ప్రజా నాయకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న జిట్టా తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. 2001లో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ మలివిడత ఉద్యమం ప్రారం భం కాగానే నల్లగొండ నుంచి తొలి పిడికిలి ఎత్తింది జిట్టానే. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత యువజన విభాగానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాడే ఢిల్లీలో జరిగే స్వాతం త్య్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించేలా ఆయ న కృషిచేశారు. నల్గొండ వ్యాప్తంగా ఉద్యమ నిర్మాణ జెండా గద్దెలు నిర్మించి ఊరూరా చైతన్యం నింపిన నిస్వార్థ సేవకుడు.
అంతేకాదు, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో తన ఆస్తులను ధారపోశారు జిట్టా. వందల కోట్ల రూపాయల ఆస్తులను ప్రజా ఆకాంక్షల కోసం త్యాగం చేశారు. ఉద్యమానికి సర్వస్వం అర్పించిన జిట్టాకు రాజకీయంగా మాత్రం ఏదీ కలిసిరాకపోవడం విచారకరం. దీంతో రాజకీయ సమీకరణాల కారణంగా 2009లో ఆయన టీఆర్ఎస్ను వీడాల్సి వచ్చింది. అయితే ఏ పార్టీ లో చేరినా ఆయనకు మోసమే ఎదురైంది. ఈ నేపథ్యం లో ఆయనే స్వయంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించి రాజకీయంగా మార్పు తేవాలని భావించారు. అడుగడుగునా అణచివేత, స్వార్థంతో నిండిన ఈ రాజకీయ వ్యవస్థలో ఆయన ఇమడలేకపోయారు. నిఖార్సయిన తెలంగాణవాదిగా ఉండి మోసపోయానని గుర్తించిన జిట్టా 20 18లో మళ్లీ ఉద్యమ పార్టీలో చేరారు.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని భావించిన జిట్టా మరోసారి గులాబీ పార్టీ తరపున గళమెత్తారు. బహుశా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆయనకు సముచితమైన స్థానం దక్కేదేమో. స్వల్ప తేడాతో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ప్రత్యక్షంగా రాజకీయ సేవ చేసే అవకా శం రాలేదు. కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉంచి, ప్రజా సేవ చేస్తున్న ఆయనను అనారో గ్యం వెంటాడింది. కాలం కలిసివచ్చే సమయానికి నిస్వార్థ సేవకుడిని ప్రజలకు దూరం చేసింది.
స్వరాష్ట్ర సాధన కోసం జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన కృషి చరిత్రాత్మకం. ఆయన సేవలను తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా ఉద్యమాల గడ్డ నల్లగొండ ప్రజలు ఎన్నటికీ మరువరు. అలుపెరగని ప్రజానాయకుడిగా ఆయన తెలంగాణ చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. భువనగిరి గడ్డ జిట్టా బాలకృష్ణారెడ్డికి రాజకీయంగా అండగా నిలబడకపోయినా.. ప్రజల కోసం పరితపిస్తూ ఆయన చేసిన సామాజిక సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మలిదశ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి చూపిన చొరవ, చైతన్యం, నాయకత్వాన్ని భవిష్యత్తు తరాలు పదిలంగా దాచుకుంటాయి.
– సంపత్ గడ్డం