2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పుడు గులాబీ జెండా సగర్వంగా ఎగిరింది. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం పలు సవాళ్లను అధిగమించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు సంక్షేమ పథకాలను అమలుచేసింది.
‘రైతుబంధు’.. ఈ పథకం రైతులకు పెట్టుబడి సహాయ పథకం, వారికి ఆర్థిక భరోసాను అందించింది. అంతేకాదు, దేశానికే ఆదర్శంగా నిలిచింది. ‘రైతు బీమా’.. అనుకోకుండా రైతు మృతిచెందితే అతని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే పథకం. ‘మిషన్ భగీరథ’… ప్రతి ఇంటికీ సురక్షిత తాగు నీరు అందించే లక్ష్యంతో అమలైన బృహత్తర పథకం. ‘మిషన్ కాకతీయ’.. చెరువుల పునరుద్ధరణ ద్వారా సాగునీటి సామర్థ్యాన్ని పెంచిన కార్యక్రమం.‘కాళేశ్వరం ప్రాజెక్టు’.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. తెలంగాణ వ్యవసాయానికి ఈ ప్రాజెక్టు నీటి భరోసా కల్పించింది. ఇలా ఎన్నో రైతు సంక్షేమ పథకాలను గత బీఆర్ఎస్ అమలుచేసింది. రాష్ట్రంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, జీవన ప్రమాణాలను మార్చాయి. తద్వారా బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిగా మారింది.
మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఐటీ రంగం పురోగమించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రపంచస్థాయి ఐటీ హబ్‌గా రూపాంతరం చెందింది. ఆయన ప్రవేశపెట్టిన వినూత్న విధానాలు తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా మార్చాయి.
తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సరిహద్దులకే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నారైలు ఈ ఉద్యమానికి బలమైన మద్దతును అందించారు. ఆర్థిక సహాయం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ గొంతుకను బలంగా వినిపించడం ద్వారా ఎన్నారైలు ఈ ఉద్యమాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లారు.
బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని, 2025, జూన్ 1న అమెరికాలోని డాలస్ నగరంలోని DR Pepper వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హాజరుకానున్నారు. కేటీఆర్ ఒక గ్లోబల్ ఇన్ఫ్లూయెన్సర్గా, భవిష్యత్తు తెలంగాణకు జెండాదారుగా నిలుస్తున్నారు. ఆయన నాయకత్వం తెలంగాణ ఆశయాలను ప్రపంచ వేదికపై మరింత ఉన్నతంగా నిలబెడుతున్నది.
అదే విధంగా సౌతాఫ్రికాలో 2025, ఆగస్టులో జరిగే రజతోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుగనున్నాయి. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి మేము సౌతాఫ్రికాలోని అన్ని సమాజ సంస్థలతో సమన్వయం చేస్తున్నాం. సౌతాఫ్రికా ఎన్నారై అధ్యక్షుడిగా నాకు లభించిన ఈ బాధ్యత ఒక గౌరవం మాత్రమే కాదు, బీఆర్ఎస్ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకానికి సంకేతం. ఈ అవకాశం కేసీఆర్ దూరదృష్టి వల్లే సాధ్యమైంది.
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు గత విజయాల స్మరణ కాదు; అవి భవిష్యత్తును ముందుకు సాగే సందర్భం. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లు, అవినీతి, అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం, ప్రజల ఆశలను నీరుగార్చే విధానాలను ఎండగడుతాయి. తద్వారా మరోసారి బీఆర్ఎస్ శ్రేణులను ఉద్యమించేందుకు పిలుపునిస్తున్నాయి. రాష్ట్రం మళ్లీ అగాథంలోకి జారిపోకుండా, ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ శ్రేణులను సిద్ధం చేస్తుంది.
కేసీఆర్, కేటీఆర్ దూరదృష్టితో, తెలంగాణ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చి రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెడుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. బీఆర్ఎస్ రజతోత్సవం రాజకీయ పార్టీ వేడుక కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, పోరాటం, అభివృద్ధి సమగ్ర ప్రయాణం. డాలస్ నుంచి సౌతాఫ్రికా దాకా ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు నిర్వహించే ఈ వేడుకలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుతున్నాయి. ఈ సందర్భం తెలంగాణ యువతకు, రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి ఒక సందేశాన్నిస్తున్నాయి.
తెలంగాణ అంటే ఒక రాష్ట్రం కాదు; అదొక భావోద్వేగం, అదొక ఐక్యత, అదొక గ్లోబల్ గుర్తింపు. బీఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని, పార్టీ నాయకత్వం పట్ల నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఇదొక జ్ఞాపకం కాదు; రేపటి తరాలకు స్ఫూర్తినిచ్చే ఒక విజయగాథ. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మరోసారి ప్రజల ఆశయాలకు నీరాజనం పట్టాలి. ఇదే ఈ రజతోత్సవ సందేశం.
-బీఆర్ఎస్ సౌతాఫ్రికా ఎన్నారై అధ్యక్షుడు నాగరాజు గుర్రాల