ప్రపంచవ్యాప్తంగా చూసినా, భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని పరిశీలించినా, ప్రత్యేకించితెలంగాణ రాష్ర్టాన్ని చూసినా.. అవన్నీ ఒకనాడు దట్టమైన కారడవులు, కొండకోనలు కలిగిన ప్రాంతాలే. ఆధునిక ప్రపంచంలో ప్రస్తుతం మనకు కనిపిస్తున్న నగరాలు, పట్టణాలన్నీ ఒకప్పుడు చెట్లు, పుట్టలతో నిండిన అటవీ ప్రాంతాలే. మనం ఇప్పుడు చూస్తున్న నాగరికతకు కొండకోనలు, అడవుల్లో నివసించే ఆదివాసీ గిరిజనులే మూలం. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆదివాసీ గిరిజనులను గుర్తిస్తూ, వారి ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవడం మనమందరం గర్వించదగ్గ విషయం.
ఆదిమానవుల నుంచి నేటి ఆధునిక సమాజం వరకు అందరికీ జీవనమార్గం చూపింది ఆదివాసీ గిరిజనులే. చక్రాన్ని కనుగొని ఆధునిక చరితకు నాంది పలికింది వారే. ఎడ్లబండ్లను తయారు చేసి రవాణాకు మార్గం సుగమం చేసింది వారే. చివరికి బ్రిటిష్ పాలకులను గడగడ వణికించి స్వాతంత్య్ర పోరాటానికి ఊపిరిపోసింది వారే. చరిత్ర దాచినా దాగని నగ్నసత్యమిది.
యుగాలు మారాయి, కాలాలు మారాయి. కానీ, ఆదివాసీ గిరిజనుల బతుకులు మాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వారి స్థితిగతులను పరిశీలించాలని 1982లో ఐరాస నిర్ణయించింది. పదేండ్ల పాటు వివిధ దేశాలు తిరిగిన ప్రతినిధి బృందం 1992లో నివేదికను ఐరాసకు సమర్పించింది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడాలని, వారి అభ్యున్నతికి పాటుపడాలనే ఉద్దేశంతో ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఐరాస ప్రకటించింది.
2011 జనాభా లెక్కల ప్రకారం.. మన దేశంలో మొత్తం జనాభాలో 8 శాతం ఆదివాసీ గిరిజనులున్నారు. 500కు పైగా తెగలు, సమూహాలు, 705 భాషలను భారత ప్రభుత్వం గుర్తించింది. వారి సమగ్రాభివృద్ధికి ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. కానీ, సమైక్య పాలకుల నిర్వాకం వల్ల అభివృద్ధికి ఆమడదూరంలోనే ఆదివాసీ గిరిజనులు నిలిచిపోయారు. 1952లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ను ఆదివాసీలుగా రాజ్యాంగం గుర్తించింది. ఉమ్మడి పాలకులు మాత్రం ఆంధ్ర ప్రాంతంలోని బంజారాలను ఎస్టీలుగా గుర్తించి, తెలంగాణవారిని విస్మరించారు. 1976లో తెలంగాణ ఆదివాసీలకు ఎస్టీలుగా గుర్తింపు దక్కింది. దీంతో 20 ఏండ్ల పాటు వారికి రాజ్యాంగ ఫలాలు అందలేదు.
అంతేకాదు, గ్రామ పంచాయతీలలో తండాలు, గూడేలు, చెంచుపేటలు భాగంగా ఉండటం వల్ల అవి అభివృద్ధికి నోచుకోలేదు. ఆయా ప్రాంతాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదు. దీంతో ప్రసవ సమయాల్లో మహిళలు పురిటినొప్పులతోనే కాలినడకన, ఎండ్ల బండ్ల మీద, మంచాలపై దయనీయమైన స్థితిలో ప్రయాణించాల్సి వచ్చేది. సమయానికి వైద్యం అందక చాలామంది మరణించేవారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత భయానకంగా ఉండేది. వైద్యశాలలు అందుబాటులో లేకపోవడంతో విషజ్వరాలు, రోగాల బారిన పడి అనేకమంది మరణించేవారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు అందుబాటులో ఉండేవారు కాదు.
అడవులే జీవనాధారంగా పోడు వ్యవసాయం చేసుకొని బతికే ఆదివాసీ గిరిజనులకు భూ పట్టాలిచ్చి ఆదుకోవాల్సిన పాలకులు వారి పట్ల అమానుషంగా వ్యవహరించేవారు. అటు ఫారెస్టు అధికారులతో, ఇటు రెవెన్యూ అధికారులతో అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేసేవారు అప్పటి పాలకులు. అంతేకాదు, జైళ్లలో పెట్టి వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసేవారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను కూడా సరైన రీతిలో సమైక్య పాలకులు నిర్వహించకపోవడంతో ఆదివాసీల బతుకులు ఆగమాగమయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ విధాత, స్వరాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆదివాసీ బిడ్డల కష్టాలను దగ్గర్నుంచి చూసిన ఆయన వారి గోసను తీర్చాలని సంకల్పించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్ష (మా తండాలో- మా రాజ్యం, మావనాటే- మావరాజ్)ను నిజం చేశారు. తండాలు, గూడేలు, చెంచుపేటలను గ్రామ పంచాయతీలుగా గుర్తించారు. 3,146 పంచాయతీలను ఏర్పాటు చేసి, ఆదివాసీ గిరిజనులను పాలకులుగా తీర్చిదిద్దారు. పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న 1,51,146 మంది ఆదివాసీ బిడ్డలకు 4,06,369 ఎకరాల పోడు పట్టాలు ఇచ్చి యజమానులను చేశారు.
ఉమ్మడి ఏపీలో గిరిజన జనాభా 10శాతం ఉండగా.. సమైక్య పాలకులు 6 శాతం రిజర్వేషన్లే ఇచ్చి మోసం చేశారు. ఈ అన్యాయంపై నిలదీయాల్సిన కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సిద్ధించాక ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేసీఆర్ ఎంతగానో శ్రమించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవడంతో జీవో నెం.33 ద్వారా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, గిరిజన పక్షపాతిగా కేసీఆర్ నిలిచారు.
ఆదివాసీ బంజారాల ఆదిపురుషుడు శ్రీసంత్ సేవాలాల్, ఆదివాసీ గోండ్ పోరాట యోధుడు కుమ్రం భీం, ఆదివాసీ ఎరుకల తెగకు చెందిన నాంచారమ్మల జయంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా బీఆర్ఎస్ సర్కార్ నిర్వహించింది. అంతేకాదు, వారి పేరిట బంజారాహిల్స్లో రూ.50 కోట్లతో ఆధునిక హంగులతో భవనాలు నిర్మించింది. 1,682 గిరిజన ఆవాసాల్లో రూ.1276 కోట్లతో 3,173 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మించిన కేసీఆర్ అభివృద్ధికి బాటలు వేశారు. ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి కోసం కేసీఆర్ చేసినవి ఇంకా చాలా ఉన్నాయి. అందుకే ఆదివాసీ గిరిజన సమాజానికి కేసీఆర్ చేసిన కృషి మరువరానిది.
(వ్యాసకర్త: ఆదివాసీ గిరిజన నేత)
– ఎల్.రూప్సింగ్
90005 00760