ప్రధాని మోదీ 2019 నుంచి పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన అంశమేదైనా ఉందంటే అది జమిలి మాత్రమేనని చెప్పవచ్చు. 2022లోనే జమిలి ఎన్నికల ప్రక్రియ ఆచరణలోకి రావాల్సి ఉన్నప్పటికీ, కరోనా కారణంగా అది వాయిదా పడింది. అంతేకాదు, ఆ సమయంలో సాహసం చేయడం మోదీకి ఇష్టం లేకపోవడంతోనే 2024 సార్వత్రిక ఎన్నికలు సాధారణంగా జరిగాయి. 2024 తర్వాత కార్యాచరణ మొదలుపెట్టడానికి వీలుగా ఎన్నికలకు ఒక ఏడాది ముందుగా ఆగమేఘాల మీద జమిలిపై కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో దాన్ని ఓ ప్రచారాంశంగా మార్చేసింది. ఒకవేళ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించి ఉంటే దాన్ని జమిలికి ప్రజామోదంగా ప్రచారం చేసుకునేవారు. అంతేకాదు, ఈ పాటికే ఆ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందేది. కానీ, మోదీ, బీజేపీ అనుకున్నది జరగలేదు.
Jamili Elections | సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో ఇంకోటర్మ్ వరకు ప్రధాని మోదీ.. జమిలి ఊసెత్తరని రాజకీయ పండితులు భావించారు. అసలు అది అసాధ్యమని, కేవలం ఎన్నికల స్టంటేనని కొంతమంది మేధావు లు గతంలో వాదించారు. గత పదేండ్లలో నినాదాలు, ఆశయాలు, లక్ష్యాల గురించి ప్రస్తావించిన మోదీ తర్వాతి కాలంలో వాటిని మర్చిపోవడమే దానికి కారణం. అయితే, అందుకు భిన్నంగా మళ్లీ జమిలి అంశాన్ని మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే అమల్లో ఉన్న ల్యాటరల్ ఎంట్రీ లాంటి పార్లమెంట్ ఆమోదం అవసరం లేని చిన్న అంశాన్ని కూడా మోదీ సర్కార్ వెనక్కి తీసుకున్నది. కానీ, మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమైన జమిలి విషయంలో మాత్రం ప్రధాని వెనక్కి తగ్గకపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. తన ప్రభుత్వ ప్రతిష్ఠను పణంగా పెట్టి మరీ మరోసారి ఆయన ‘జమిలి’పై స్వారీ చేస్తున్నారు. అది కూడా సొంత మెజారిటీ లేని సమయంలో కావడం మరింత విస్మయం కలిగిస్తున్నది. ఈ విషయాన్ని మోదీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
జమిలి చుట్టూ అనేక వివాదాలున్నా యి. జమిలి వల్ల జాతీయ అంశాలు తెరపైకివచ్చి, స్థానిక అంశాలు వెనకతట్టు పట్టి.. ప్రాంతీయ పార్టీలకు, ఫెడరలిజానికి తీరని నష్టం జరుగుతుందనేది వాటిలో ఒక వాదన. స్థానిక సమస్యలు, ప్రాంతీయ అంశాలకే ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తారని, అందువల్ల జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలకే లాభం చేకూరుతుందనేది మరో వాదన. ఈ వాదనలు ఎంతసేపటికీ ఎవరికి లాభం, ఎవరికి నష్టం చుట్టూనే తిరుగుతున్నా యి. ఈ సంకుచిత పరిధిని దాటి ఆలోచించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చివరకు ప్రాంతీయ పార్టీలు కూడా. చర్చం తా ముఖ్యంగా మొదటి వాదన మీదనే నడుస్తున్నది. అయితే, ఎవరికి మోదం, ఎవరికి ఖేదం అనేది కాలమే సమాధానం చెప్తుంది.
జమిలి వల్ల లాభాలున్నట్టే, నష్టాలూ ఉన్నాయనడంలో ఎలాంటి సంశయం లేదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోనే కుప్పకూలితే పరిస్థితి ఏమిటన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఒకవేళ మధ్యంతర ఎన్నికలు జరిగి, మరో ప్రభుత్వం ఏర్పడితే దానికి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఐదేండ్ల పదవీకాలం కాకుండా, కేంద్ర ప్రభుత్వ కాలవ్యవధిలో మిగిలిన సంవత్సరాలకు మాత్రమే కొత్త రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగించాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరు ద్ధం. ఎంతో కీలకమైన ఈ అంశం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అస్థిర ప్రభుత్వాల పోకడ, రాష్ర్టాల దీర్ఘకాలిక వ్యూహా లు, ప్రజాస్వామ్యానికి జరిగే నష్టం గురించి కూడా ఎవరూ చర్చించడం లేదు. తక్కువ కాలం పనిచేసే ప్రభుత్వాల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. పరిణతి లేని ప్రజాస్వామ్యంలో అడ్డూఅదుపు లేని అధికారం ఎంతటివారినైనా మత్తులో ముంచుతుంది. అదే సమయంలో నిరంతర ఎన్నికల కోడ్, వ్యయం, వనరుల పొదుపు గురించి కూడా ఆలోచించాల్సిందే. అయితే, వీటిని సమన్వయం చేసుకోవడమెలా అన్న చర్చ ఎక్కడా జరగడం లేదు.
జమిలికి మేలైన ప్రత్యామ్నాయం ఉన్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తూనే, రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేకుండా క్రమబద్ధంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. అదెలాగంటే, రాజ్యాంగం ప్రకారం ఏదైనా చట్టసభలో ఒక స్థానం ఖాళీ అయితే విధిగా, గరిష్ఠంగా ఆరు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాలి. ఇది రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు. కాబట్టి, ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు నిర్వహించకుండా, ఆరు నెలల కాల వ్యవధి మించకుండా సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. అందుకు జనవరి-జూలై, లేదా ఫిబ్రవరి-ఆగస్టు, జూన్- డిసెంబర్ అత్యంత అనుకూలం.
అయితే, దీనికి మేలైన ప్రత్యామ్నాయం ఉన్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తూనే, రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేకుండా క్రమబద్ధంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. అదెలాగంటే, రాజ్యాంగం ప్రకారం ఏదైనా చట్టసభలో ఒక స్థానం ఖాళీ అయితే విధిగా, గరిష్ఠంగా ఆరు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాలి. ఇది రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు. కాబట్టి, ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు నిర్వహించకుండా, ఆరు నెలల కాల వ్యవధి మించకుండా సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. అందుకు జనవరి-జూలై, లేదా ఫిబ్రవరి-ఆగస్టు, జూన్- డిసెంబర్ అత్యంత అనుకూలం. ఇందుకు అతి తక్కువ పండుగలున్న నెలలను ఎంచుకోవాలి. ఆయా నెలలో రెండు వరుస సెలవులు ఉన్న సమయాన్ని చూసుకోవాలి. ఉదాహరణకు జనవరిలో రెండవ ఆదివారం, జూలైలో రెండవ ఆదివారం నేషనల్ ఎలక్షన్ల డేస్‌గా ప్రకటించి, యావత్ దేశంలో అన్ని రకాల ఎన్నికలు ఆ రోజుల్లో మాత్రమే నిర్వహించేలా చూసుకోవాలి. దానికి మూడు వారాల ముందు దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేయాలి. నామినేషన్ల అనంతరం 10 రోజుల పాటు ప్రచారానికి సమయమివ్వాలి. అనంతరం ఆ నెల రెండో శనివారం, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా ఒకేసారి పోలింగ్ నిర్వహించాలి. ఒక వారం రోజులు రిజర్వుగా గుర్తించి, నాలుగో ఆదివారం నాడు ఫలితాలు విడుదల చేయాలి. ఆ విధంగా చేసినట్టయితే 52 వారాలు నిరంతరంగా ఉండే ఎన్నికల రణగొణ ధ్వనిని దాదాపు ఏడాదిలో (3+3) ఆరు వారాలకు తగ్గించవచ్చు.
ప్రత్యేకంగా సెలవులు ప్రకటించాల్సిన అవసరమూ ఉండదు. తద్వారా పని దినాలను, ప్రభుత్వ వనరులను ఆదా చేయవచ్చు. ఎవరైనా సభ్యుడు మరణిస్తే అతని స్థానం తర్వాతి ఎన్నికల సైకిల్లో భర్తీ అవుతుంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతే తర్వాతి సైకిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆరు నెలల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
వనరుల దుర్వినియోగం, నిరంతర ఎన్నికల కోడ్‌ను నివారించడం, డబ్బు, సమయం ఆదా కోసం ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవైపు బీజేపీ చెప్తున్న ఎన్నికల కోడ్, అధిక వ్యయం లాం టి అంశాలకు పరిష్కారాన్ని చూపుతూ, ఏ పార్టీకి లబ్ధి లేదా నష్టం చేయని ఈ విధానానికి ప్రాంతీయ పార్టీలు మద్దతు పలకాలి. దీన్ని ప్రజల ముందు చర్చకు పెట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.