2014 నాటి తమ ఎన్నికల ప్రణాళికలో ‘వాతావరణం, మార్పులకు కాలుష్యానికి గురికాకుండా విస్తృత ఉపశమన చర్యలు చేపడుతాం. పర్యావరణ రక్షణార్థం ప్రపంచ దేశాలతో, పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తాం. బొగ్గు, వగైరా ఖనిజాల పొదుపు, భద్రతల మేనేజ్మెంట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం’ అని రాసుకొన్నది బీజేపీ. కానీ గద్దెనెక్కిన దగ్గరి నుంచి, బీజేపీ ప్రభుత్వం తమ ఎన్నికల ప్రణాళికను పాటించకపోగా, యూపీఏ ప్రభుత్వం రూపొందించిన పర్యావరణ పరిరక్షణ చట్టాలకు తూట్లు పొడుస్తున్నది.
ఇలా పర్యావరణ చట్టాలకు తూట్లు పొడుస్తూ ఉద్యమాలను, ఉద్యమకారులను అణచివేస్తూ, గత ఐదేండ్లలో 409 చ.కి.మీ. అటవీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
హరితహారం: గీత 13-28 ‘విశ్వమంతటా ఈశ్వరుడు సమంగా నిల్చి ఉండుటను చూడగలిగిన జ్ఞాని, దేనిని హింసించినా, ఈశ్వరుని హింసించినట్లని గ్రహించగలడు’ ఉదా: ప్రాణి మనుగడకు వివిధ అవయవాల రూపంలో దేహమంతటా నిలిచినట్లే.. జీవుల మనుగడ కోసం భూమి అంతటా సముద్రాలు- కొండలు- అడవులు- నదులు- చెరువులు- పొలాలు- నివాసాల రూపంలో నిలిచి ఉన్నాడు ఈశ్వరుడు. దీన్నే ప్రకృతి సమతూకమన్నారు శాస్త్రజ్ఞులు. ఈ సమతూకాన్ని కాపాడుకుంటుండాలన్న ‘గీతా ప్రబోధాన్ని పాటిస్తున్న నేతల్లో ప్రథముడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
ఉదా: 33.3 శాతం ఉండాల్సిన అడవులు, విచక్షణారహితంగా నరికారు కాబట్టి తెలంగాణలో 19 శాతానికి పతనమైనట్లు పలు సర్వేల ద్వారా గుర్తించారు కేసీఆర్. అడవులు తరిగితే రాష్ట్ర ప్రజలు వర్షాభావం- వాయు కాలుష్యం- భూ తాపం- భూ కంపాలు మొదలైన ప్రమాదాల బారినపడతారని గ్రహించారు. ‘వృక్షో రక్షతి, రక్షితః!’ అంటూ ప్రజలను, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులను ప్రోత్సహిస్తూ ఇండ్లముందు- చేలగట్లు మీద- రోడ్ల పక్కన కార్యాలయాల చుట్టూ, ఖాళీ ప్రదేశాల్లో ఏడేండ్లలో 250 కోట్ల మొక్కలను నాటించారు. నాటడమే కాదు, వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయించి, కంచె వేయించి వృక్షాలుగా అభివృద్ధి చేశారు. అడవుల్లోనూ ఖాళీలున్న చోటా పండ్ల చెట్లను నాటించారు. అవి కాపురాగానే గ్రామాల్లోని కోతులన్ని అడవిబాట పట్టాయి. ఆ పండ్ల చెట్లే నేడు ‘మంకీ ఫుడ్ కోర్టులుగా’ మారినయి. అడవుల రక్షణార్థం వాటి చుట్టూ కందకాలు తీయించి, బయటి పశువులు అడవులను మేయకుండా చేశారు. కందకాలలోని నీళ్లు అడవి జంతువులకు తాగునీరైంది. సీఎం కేసీఆర్ ‘హరితహారాన్ని’ నిరంతర ప్రక్రియగా రూపొందించే సంకల్పంతో గ్రామగ్రామాన నర్సరీలను పెంపొందింపజేస్తున్నారు. ‘ఓట్లు రాల్చని చెట్లు ఎన్ని నాటితే ఏం లాభం?’ అన్నట్టు చూస్తున్న ప్రజాప్రతినిధులతో ‘హరితహారం’ పథకానికి ఓట్లు రాలవ్, కానీ వర్షాలు మాత్రం కచ్చితంగా రాలుతయి! మీకు హామీ ఇస్తున్నా అంటూ ప్రోత్సహించారు.
భూమి నుంచి నీటిని తోడుకుంటున్న మనపై తిరిగి భూమికి నీరందించాల్సిన బాధ్యత కూడా ఉన్నదని, మన ఇళ్ల దగ్గర, వీధుల పక్కన ఇంకుడు గుంతలు నిర్మించి, చెరువులను పునరుద్ధరించి, తద్వారా భూగర్భ జలాలను పెంపొందించే ప్రణాళికలను కూడా రూపొందించారు కేసీఆర్. తత్ఫలితంగానే పుష్కల వర్షాలతో, పాడిపంటల సమృద్ధితో భారతదేశానికి మరో ధాన్యాగారంగా, దేశానికి అత్యధికంగా ఆదాయాన్నందిస్తున్న నాల్గవ రాష్ట్రంగా వర్ధిల్లుతున్నది తెలంగాణ.
తన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ‘విశ్వనగరం’గా ఖ్యాతిని, ‘వరల్డ్ గ్రీన్ సిటీ’ జాతీయ అ వార్డును కూడా సంపాదించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ, నాడు తన గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా కలుషిత రాష్ట్రంగానూ! నేడు ప్రధానిగా కాలుష్యరహిత దేశాల్లో తన భారతదేశానికి 180వ ర్యాంకును, మిక్కిలి కాలుష్యపూరిత 20 ప్రపంచ నగరాలలో 15 నగరాలున్న దేశంగా, తన దేశానికి; అత్యంత కాలుష్య నగరం గా తన దేశ రాజధాని ఢిల్లీకి, బోలెడంత అపఖ్యాతిని తెచ్చిపెట్టారు నరేంద్ర మోదీ. దీన్నిబట్టి రాజనీతిజ్ఞుడెవరో, రాజకీయ వ్యాపారి ఎవరో, దేశ ప్రజలు ఏ నేతను ఎందుకు రమ్మంటున్నారో? ఏ నేతను ఎందుకు పొమ్మంటున్నారో? ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది.
– పాతూరి వెంకటేశ్వరరావు
98490 81889
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)