జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రాంతీయ పార్టీల అస్తిత్వ ఉద్యమాలు, ఆత్మగౌరవ నినాదాలు అంటే గిట్టని అంశాలు. ప్రాంతీయ పార్టీలు బలపడినా, హక్కుల కోసం, న్యాయమైన వాటాల కోసం గొంతెత్తి నినదించినా జాతీయ పార్టీలు సహించలేవు. బీఎస్పీ, సీపీఐ (ఎం), ఆప్, ఎన్సీపీలకు సాంకేతికంగా జాతీయ పార్టీ హోదా ఉన్నా.. అవి దేశవ్యాప్తంగా విస్తరించిలేవు. ఇక ఆసేతు హిమాచలం కనిపించే బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రాంతీయ పార్టీల పట్ల తీవ్ర వ్యతిరేకతను కలిగి ఉంటాయి. లొంగిపోని ప్రాంతీయ పార్టీలను సమయం వచ్చినప్పుడు నామరూపాల్లేకుండా చేయడానికి కూడా అవి వెనుకాడవు. నాలుగు దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల పుణ్యమా అని ఉనికిని కాపాడుకుంటూ కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఈ రెండు పార్టీలే వాస్తవాన్ని, పునాదిని మరిచి ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికి, నిస్తేజపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
Regional Parties | దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 20 ఏండ్ల పాటు కేంద్రంలో, రాష్ర్టాల్లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం.1957లో కేరళలో అవిభక్త సీపీఐ అధికారంలోకి వచ్చినా దేశవ్యాప్త రాజకీయాల్లో గుణాత్మక మార్పు వచ్చింది మాత్రం 1967లోనే. ఆ సంవత్సరం వివిధ రాష్ర్టాల్లో ప్రాంతీయ శక్తులు అధికారంలోకి వచ్చాయి. ఆ ప్రకంపనలు మరో పదేండ్ల తర్వాత ఏకంగా ఢిల్లీనే తాకాయి. 1977లో తొలిసారిగా కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.
కాంగ్రెస్ కుటిలనీతి వల్ల ఆ ప్రభుత్వం 28 నెలలకు, ఆ తర్వాత చరణ్‌సింగ్ సర్కార్ ఆరు నెలలకే కుప్పకూలిపోయాయి. జనతా పార్టీ ముక్కలు చెక్కలు అయిపోయింది. ఆ తర్వాతి కాలంలో వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవేగౌడ, గుజ్రాల్ ప్రధానులుగా పనిచేసినా వీరంతా కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు చెందినవారు కావడంతో పూర్తికాలం పాలించలేకపోయారు. విశేషమేమిటంటే.. వాజపేయి, మన్మోహన్ సింగ్ మాత్రం సొంత మెజారిటీ లేకుండానే పూర్తికాలం ప్రభుత్వాలను నడిపించారు. అదీ ఆ రెండు పార్టీల చాణక్యం.
స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రెస్ 54 ఏండ్లు, బీజేపీ 16 ఏండ్లు సంపూర్ణంగానో, సంకీర్ణంగానో పరిపాలించాయి. ఇతర పార్టీల ప్రభుత్వాలు ఏడేండ్లు మాత్రమే పాలించగా.. ఆ ప్రభుత్వాల పతనాల వెనుక కాంగ్రెస్, బీజేపీల కపట నాటకాలు దాగి ఉన్నట్టు చరిత్ర చెప్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణాలకు దేశాన్ని పాలించే సత్తా లేదన్న దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా పథకం ప్రకారం వ్యాప్తి చేయడంలో ఆ రెండు పార్టీలు కలిసి నడిచాయి. ఆ ప్రచారమే ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ జరిగింది. ఫలితంగా తాజా లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక శాతం ప్రజలు ఎన్డీయే వైపో, ఇండియా కూటమి వైపో చీలిపోయారు. దీంతో ఆ రెండు కూటములకు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు చేదు అనుభవాన్ని రుచిచూశాయి.
హిందూత్వ పక్షాన మోదీ (ఎన్డీయే కూటమి), లౌకికవాదం పక్షాన రాహుల్ (ఇండియా కూటమి) మల్లయోధులుగా జబ్బలు చరుస్తూ అరచిన పెడబొబ్బల హోరులో ప్రాంతీయ అస్తిత్వ, ఆత్మగౌరవ నినాదాలు వినపడకుండా పోయాయి. సామంత రాజులను స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి రాచరిక వ్యవస్థలో చక్రవర్తులు సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగించినట్టే.. ప్రత్యర్థి ప్రాంతీ య పార్టీలను, ప్రభుత్వాలను వీలైతే లొంగదీసుకోవడానికి, కాకుంటే తుంగలో తొక్కడానికి గవర్నర్, సీబీఐ, ఈడీ, ఐటీ వ్యవస్థలను ఉపయోగించుకున్న కాంగ్రెస్ సంస్కృతిని పెంచిపోషించిన మోదీ అనుకున్నది సాధించారు.
‘మీకు మేమే దిక్కు’ అని హుంకరిస్తున్న ఈ రెండు ఆధిపత్య జాతీయ పార్టీలకు అంత బలం ఉందా? ప్రాంతీయ శక్తుల సహకారం లేకుండా ఒంటరిగా అవి కేంద్రంలో అధికారంలోకి రాగలవా? అన్న ప్రశ్నలకు లేదనే సమాధానం చరిత్ర చెప్తున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కేవలం 215 సీట్లలోనే ప్రాంతీయ శక్తుల ప్రమేయం లేకుండా తలపడ్డాయి. వీటిలో 162 చోట్ల బీజేపీ గెలిస్తే, కాంగ్రెస్ 53తో సరిపెట్టుకుంది.
అంటే బీజేపీ గెలిచిన 240 సీట్లలో 78, కాంగ్రెస్ గెలిచిన 99 సీట్లలో 45 ప్రాంతీయ రాజకీయ శక్తుల మద్ద తు పుణ్యమా అని వచ్చినవే కదా. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీ క్యాబినెట్లో కూడా అప్నా దళ్(ఎస్), హిందుస్థాన్ ఆవాం మోర్చా(ఎస్) ఒక్కొక్క లోక్‌సభ సీటే గెలిచినా, రాష్ట్రీయ లోక్‌దళ్, జేడీ(ఎస్) రెండు సీట్ల చొప్పున గెలిచినా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ)కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకున్నా ఏరి కోరి వీరందరికీ కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారంటేనే బీజేపీ ఎంత బలహీనంగా ఉందో విదితమవుతున్నది.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మెజారిటీ రాదని, ప్రాంతీయ శక్తులే కేంద్రంలో చక్రం తిప్పుతాయని లోక్‌సభ ఎన్నికలకు చాన్నాళ్ల ముందుగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రహించారు. ఆ విషయాన్ని ప్రాంతీయ పార్టీలకు చెవినిల్లు కట్టుకుని చెప్పారు. రెండు జాతీయ పార్టీలను ఎండగడుతూ ప్రాంతీయ శక్తులను ఒక్క తాటిమీదికి తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేశారు. ప్రాంతీయ శక్తులన్నీ ఏకమైతే బీజేపీ, కాంగ్రెస్‌లను మట్టి కరిపించి కేంద్రంలో అధికారంలోకి రావడం సాధ్యమేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆయన ఆశించా రు. కానీ, అది జరగలేదు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైపు మోహరించిన ప్రాం తీయ పార్టీలకు వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. ప్రధానిగా, ప్రతిపక్ష నేతగా బీజేపీ, కాంగ్రెస్ అధినేతలే సింహాసనాల్లో కొలువుతీరా రు. వారికి మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు పల్లకి మోసే స్థాయిలోనే మిగిలిపోయాయి.
1989-2014 దాకా ఏడు సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మెజారిటీ దక్కలేదు. 2014-24 మధ్య బీజేపీకి మెజారిటీ వచ్చినా అది ప్రాంతీయ పార్టీల సహకారం వల్లే తప్ప సొంతంగా కాదు. ఇప్పుడున్న మోదీ ప్రభుత్వం కూడా పరాధీన ప్రభుత్వమే. ఇది ప్రజలిచ్చిన సంకీర్ణ సంకేతం. ప్రాంతీయ పార్టీల మధ్య బీజేపీ, కాంగ్రెస్ అనుసరిస్తున్న విభజించు, పాలించు సిద్ధాంతమే
ఆ రెండు పార్టీల బలం.
తాత్కాలిక లబ్ధి కోసం వాటిని ఆశ్రయించడమే ప్రాంతీయ పార్టీల బలహీనత. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీ బలం 240, కాంగ్రెస్ బలం 99 కాగా.. ఇతర పార్టీల బలం 204. ఈ 204 మంది లోక్‌సభ సభ్యులు ఒక్కటై ‘మేమే అధికారం చేపడతా’మంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది కాదా? 1998, 1999లో వాజపేయి, 2004, 2009లో మన్మోహన్ సింగ్ అతి తక్కువ సీట్లతోనే ప్రధాని కాలేదా? అలాంటప్పుడు లోక్‌సభలో 204 మంది సంఖ్యా బలమున్న పార్టీలు ప్రధాని పీఠాన్ని అధిరోహించలేవా? పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని గమనించిన బీజేపీ, కాంగ్రెస్‌లు మెజారిటీ ప్రాంతీయ పార్టీలను అస్తిత్వం, ఆత్మగౌరవం, అభివృద్ధి అనే అంశాల నుంచి దృష్టి మరల్చి హిందూత్వ, లౌకిక అంశాలు తప్ప ప్రజలకు వేరే సమస్యలే లేనట్టు భ్రమలు కల్పించి తప్పుదారి పట్టించడంలో, దారికి తెచ్చుకోవడంలో తాత్కాలిక విజయం సాధించాయి.
ఒంటరి పోరాటం చేస్తున్న ప్రాంతీయ పార్టీలను, ప్రధానంగా బీఆర్ఎస్ను మింగేయడానికి ఆ రెండు జాతీయ పార్టీల అనకొండలు పొంచి చూస్తున్నాయి. బీఆర్ఎస్ను లేకుండా చేస్తే మిగతా వాటిని మట్టుపెట్టడం పెద్ద సమస్య కాదని వాటి భావన. ఆ వ్యూహంలో భాగంగానే తెలంగాణలో చీకటి ఒప్పందాలు చేసుకొని బీఆర్ఎస్ను దెబ్బతీశాయి. ఎన్నికల అనంతరం కూ డా బీఆర్ఎస్ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. వాస్తవానికి రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ బద్ధ శత్రువులు. కానీ, తెలంగాణలో మాత్రం మిత్రులు. రేవంత్ సర్కార్ వైఫల్యాలను బీజేపీ కనీసం వేలెత్తిచూపదు. రేవంత్ సైతం బీజేపీని పల్లెత్తు మాట అనరు. ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్పై దాడిచేస్తాయి. ఇదెక్కడి చోద్యం? ప్రస్తుత దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అస్తిత్వ, ఆత్మగౌరవాల నినాదాన్ని బలంగా వినిపించగలిగే శక్తి కేసీఆర్‌కు ఉన్నదని అందరికీ తెలుసు.
పరిపాలనాదక్షుడు, జాతీయ స్థాయి దార్శనికత ఉన్న ఏకైక నేత, హిందీ, ఇంగ్లిష్‌లలో సైతం అనర్గళంగా మాట్లాడగలిగే వక్త కేసీఆర్ ఒక్కరేనని, దేశంలోని ఏ ప్రాంతాన్ని అయినా ఆయన ప్రభావితం చేయగలరని బీజేపీ, కాంగ్రెస్‌లకూ తెలుసు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరివారం బీఆర్ఎస్, కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. వారి ఆటలు కొనసాగితే జాతీయ స్థాయిలో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలకు, పార్టీలకు, వాటికి ఐకాన్‌గా ఉన్న తెలంగాణ ప్రజలకు ప్రమాదం పొంచి ఉన్నట్టే. జాతీయస్థాయిలో నానాటికీ బరితెగించి దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఆధిపత్య, నిరంకుశ ధోరణులకు విరుగుడుగా ప్రాంతీయ పార్టీలు మూడవ ప్రత్యామ్నాయంగా ఎదగడమే దేశానికి శ్రేయస్కరం. అందుకు సమ యం ఆసన్నమైంది. దేశ రాజకీయ వాతావరణం అందుకు అనుకూలంగా ఉంది.
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238