బడుగు, బలహీన వర్గాల పోరాటానికి, ఆకాంక్షలకు కులగుణన రూపంలో పాక్షిక విజయం లభించింది. ఎవరు ఎంతో వారికంత అన్న న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈ దేశంలోని బహుజనులు దశాబ్దాల నుంచి గళమెత్తుతున్నారు, ఉద్యమిస్తున్నారు. ఏ రాజకీయ ప్రయోజనాల కోసమైతేనేమీ ఎట్టకేలకు కులగణనకు కేంద్రం ఒప్పుకోవడం బీసీలు సాధించిన చరిత్రాత్మక విజయమే. అయితే ఈ గెలుపును తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న క్రెడిట్ గేమ్‌ను, పడుతున్న తాపత్రయాన్ని చూస్తుంటే నవ్వొస్తున్నది. అగ్రవర్ణాల ప్రయోజనాలే పరమావధిగా ఉన్న ఈ రెండు జాతీయ పార్టీలకు బహుజనుల పట్ల కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమలోని ఆంతర్యాన్ని, బీసీ హక్కులు, డిమాండ్ల అమలు విషయాల్లో ఆయా పార్టీలు వేసిన రాజకీయ కుప్పిగంతులను బడుగు బలహీన వర్గాలు గుర్తించడం లేదనుకోవడం ఆ రెండు పార్టీల అమాయకత్వానికి నిదర్శనం.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ల నుంచి దళిత, గిరిజనులతో పాటు అటుఇటు గా బడుగుల జీవితాలు కూడా పేదరికంలో మగ్గిపోతుండటం, రాజకీయ-ఉద్యోగ అవకాశాలకు ఆమ డదూరంలో నిలవడమన్నది జగమెరిగిన సత్యం. కులగణన పేరుతో బడుగుల పట్ల ప్రేమ నటిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ఏడున్నర దశాబ్దాల నుంచి దేశాన్ని పాలిస్తున్నాయి. కానీ బడుగుల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ, ఉద్యోగ, విద్యా అవకాశాల కల్పనను ఆ రెండు పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బీసీల ఆకాంక్షలు, సమస్యల పట్ల ఈ రెండు పార్టీలకు సైద్ధాంతిక అవగాహన, ప్రాతిపదిక లేనే లేవు. దాదాపు 50 ఏండ్ల పాటు మైనారిటీలు, దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్, ఆయా సెక్షన్లలో తమ ఆటలు సాగడం లేదని తెలిసిన తర్వాతే, ఇప్పుడు బహుజన వాదాన్ని నెత్తికెత్తుకుని కపట నాటకానికి శ్రీకారం చుట్టింది. 60 ఏండ్ల్ల పాటు బహుజన వాదం గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది. తమ హయాంలో 11 సార్లు జనాభా లెక్కలు తీసినప్పటికీ ఒక్కసారి కూడా కులగణన చేపట్టాలనుకోకపోవడం ఆ పార్టీ సైద్ధాంతిక ఆత్మవంచనకు నిదర్శనం. తమ ప్రభు త్వం కూలిపోయాక వచ్చిన మండల్ కమిషన్, దాని సిఫారసుల అమలుపై 1990 సెప్టెంబర్ 6న లోక్‌సభలో రాజీవ్‌గాంధీ చేసిన ప్రసంగాన్ని ఈ దేశంలోని ఏ బీసీ కూడా కలలో కూడా మరిచిపోడు.
మండల్ కమిష న్ సిఫారసులను అమలు చేసి 27 శాతంబీసీలకు రిజర్వేషన్ ఇస్తే దేశం విచ్ఛిన్నమవుతుంది, కులయుద్ధాలు వస్తాయన్న రాజీవ్‌గాంధీ వ్యాఖ్యలు బహుజన చరిత్రలో అతిపెద్ద ద్రోహంగా మిగిలిపోతాయి. ఇంతేకాదు కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక ప్రమాణాల ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్ సూచించారు. రాజీవ్ ప్రసంగం తర్వాతనే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్లలోని ఓబీసీలు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. అక్కడ కొత్త ఓబీసీ రాజకీయశక్తులు పుట్టుకొచ్చాయి. కులాలవారీగా కాకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలని మూడున్నర దశాబ్దాల కింద ప్రకటించిన కాంగ్రెస్‌కు రిజర్వేషన్ల అసలు లక్ష్యం, ఉద్దేశం ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ రోజు బహుజనుల పట్ల ఎక్కడ లేని ప్రేమను నటిస్తున్న కాంగ్రెస్, 50 ఏండ్ల్ల క్రితమే బీసీలకు తగిన రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి ఉంటే ఈనాడు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కులగణన ప్రకటనను కేంద్ర ప్రభు త్వం చేసిన వెంటనే రాహుల్‌గాంధీ ఒక్కడితోనే ఇది సాధ్యమైందన్న కాంగ్రెస్ వాదనలో ఆవగింజంత నిజం కూడా లేదు. బీజేపీ మత ఎజెండాను ఎదుర్కోవడానికి, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు గతాన్ని మరచిపోయి, బహుజనవాదంతో లభించే ఓట్ల కోసమే రాహుల్‌గాంధీ ఈ డ్రామాలు ఆడుతున్నాడు.
రాహుల్‌గాంధీ కులగణన రాగం ఎత్తుకున్న తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఆయా రాష్ర్టాల్లో కులగణన ఎందుకు చేపట్టలేదో కర్ణాటకలో పదేండ్ల కిందట జరిగిన కులగణనను ఇప్పటికీ ఎందుకు బయటపెట్టడం లేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణ న సర్వేను మోడల్‌గా రాహుల్‌గాంధీ చెప్పడం ఆ పార్టీ సిగ్గులేనితనానికి నిదర్శనం. జనాభాకు అనుగుణంగా అవకాశాల కేటాయింపునే కోరుతున్న బహుజనుల దీర్ఘకాలిక డిమాండ్‌ను తుంగలో తొక్కి, అనుకూల సామాజికవర్గాల సంఖ్యను కృత్రిమంగా పెం చేందుకు సర్వేను వాడుకున్నారు. లక్షలాది మంది బహుజనుల సంఖ్యను తక్కువగా చూపించి జరిగిన అన్యాయాన్ని తెలంగాణ మోడల్‌గా దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం విడ్డూరం. 75 ఏండ్లుగా బహుజనుల ఆకాంక్షలను పట్టించుకోకుండా దారుణంగా మోసం చేసినందుకు బీసీలకు రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలి. అప్పుడే కాంగ్రెస్ చేసిన పాపాలకు కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుంది.
ఒక వ్యక్తిని, వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే వారి చరిత్ర కూడా అధ్యయనం చేయాలి. అప్పుడే వారి నినాదాల వెనుకున్న ప్రయోజనాలు, అజెండాల వెనుకున్న మర్మాలను గుర్తించవచ్చు. కాంగ్రెస్ కొత్తగా ఎత్తుకున్న బహుజన నినాదం పట్ల ఈ దేశ బీసీలు జాగ్రత్తగా ఉండాలి. అట్లనే మోదీ కులగణన అజెండాలోని మర్మాన్ని అర్థం చేసుకోవాలి. మహా త్మా పూలే సినిమా విడుదల విషయంలో కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ యంత్రాంగం, వ్యవస్థలు వ్యవహరించిన తీరును చూసిన తర్వాత కులగణన నిర్ణయం, ఆ తర్వాతి ఫలితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేకసార్లు ఆ రెండు పార్టీల చేతిలో మోసపోయిన బీసీ బిడ్డలు తమ నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోవాలి. లేదంటే ఇంకో వందేండ్లు అయినా అగ్రవర్ణ జాతీయ పార్టీల ఎన్నికల అస్ర్తాలుగా మాత్రమే బీసీలు మిగిలిపోతారు. తస్మాత్ జాగ్రత్త.. జాగో బహుజన..