2023, నవంబర్ 10 నాడు కామారెడ్డి పట్టణం వేదికగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఆ పార్టీ గద్దెనెక్కేందుకు ఎంతో ఉపయోగపడింది. 2023 మేలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలు ఇచ్చిన సలహాల్లో ఇదొకటి. కర్ణాటకలో కన్నా తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ ఉన్నందున బీసీల కోసం ఎన్నికల ముందు ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన అవసరాన్ని ఆయన సూచించారు. దాని ఫలితంగా ఆ పార్టీకి బీసీ ఓట్లు పెరిగాయనవచ్చు. అయితే బీసీ డిక్లరేషన్‌లోని హామీలేవీ ఇంతవరకు ఆ వర్గాలకు దక్కలేదు.
Congress | అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ కులగణన చేయించి, ఆ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ల పెంపు కూడా జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకున్న 23 శాతం కోటాను 42 శాతానికి పెంచుతామన్నారు. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంతవరకు అసెంబ్లీలో ఆ పెంపు బిల్లు ప్రవేశపెట్టలేదు. ఇందు కోసం రూ.150 కోట్లు ఫిబ్రవరిలో మంజూరైనప్పటికీ పని మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బీసీ కమిషన్‌కు కొత్త కార్యవర్గం నియామకమై నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి మార్గదర్శకాలు రానందున మరింత కాలయాపన జరుగుతున్నది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం మనసులో ఏముందో అనే అనుమానం కూడా కలుగుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్‌లోగా కులగణన, బీసీలకు రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు జరిగే అవకాశాలున్నాయా అనిపిస్తున్నది. ఎందుకంటే, ఈ దిశగా ప్రభుత్వ చర్యల్లో వేగం కావలసినంతగా కానరావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు తగ్గిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఒక భయం పట్టుకొన్నట్టుంది. ఏడాది తిరగకముందే గ్రామస్థాయిలో పరాభవం ఎదురైతే పాలన ముందుకు సాగడం కష్టమైపోతుంది. అధిష్ఠానం దృష్టిలో రేవంత్ గ్రాఫ్ కూడా పడిపోవచ్చు. కాంగ్రెస్ పాత కాపులు తిరగబడవచ్చు. వీటన్నిటి కన్నా ఎలాగోలా కోర్టు ముందు మోకరిల్లి వీలైనంతకాలం సాగదీయాలని ముఖ్యమంత్రి ఆలోచన కావచ్చు.
జనవరి 31తో రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసి, రాష్ట్రంలో గత తొమ్మిది నెలలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల చేతుల్లో కొనసాగుతున్నది. మాజీ సర్పంచుల పనుల బిల్లులు పూర్తిగా చెల్లింపు కాలేదు. వారు ఈ మధ్య గవర్నర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక సంస్థల్లో పాలకవర్గం లేనందువల్ల సమావేశాలు, తీర్మానాలు జరగక గ్రామాభివృద్ధి కుంటుపడుతున్నది. మరోవైపు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు లెక్క తప్పుతాయి. కులగణన, రిజర్వేషన్ల పెంపు కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన ప్రధాన హామీ. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో తీర్చుతామన్న మాట ఏడాదిలో కూడా సాకారమయ్యేలా లేదు. బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న మరిన్ని హామీల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
ఏడాదికి రూ.20 వేల కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు చేస్తామన్నారు. ఈ బడ్జెట్లో మాత్రం బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. బీసీ యువతకు వ్యాపారాలు, ఉన్నత చదువుల కోసం రూ.10 లక్షల వరకు వడ్డీ లేని, థర్డ్ పార్టీ గ్యారెంటీ లేని రుణాలు ఇస్తామని అన్నారు. ఈ అప్పు బ్యాంకుల ద్వారానా, సర్కారే ఇస్తుందా అనే స్పష్టత లేదు. రూ.50 కోట్లతో జిల్లాకొక ప్రొ.జయశంకర్ ఐక్యత భవన్‌ను నిర్మించి వాటిలో స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు. వృత్తుల వారికి వృద్ధాప్య పింఛన్ వయసును 57 నుంచి 50కి తగ్గించి, ఇప్పటికే గౌడ, నేత వృత్తుల వారికి ఇస్తున్న ఈ పింఛన్‌ను మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, కంసాలి వృత్తుల వారికి కూడా వర్తింపజేస్తామని డిక్లరేషన్ ఇచ్చారు. వీటి అమలుకోసం బీసీ నేతలు పార్టీలు, రాజకీయాలకతీతంగా ఐక్యమై ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవసరం ఉన్నది.