ఎలాగైనా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిన అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఒకటి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, కులగణన చేపట్టి దాని ఆధారంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతామని, ఐదేండ్లలో బీసీల అభ్యున్నతికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ హామీల అమలు పట్ల చిత్తశుద్ధి పూర్తిగా కరువైంది.
బీసీ సంఘాల ఒత్తిడిని తట్టుకోలేక తూతూమంత్రంగా కులగణనను ముగించే కుట్రలో భాగంగా ఆ కార్యాన్ని చెల్లని నాణెం లాంటి బీసీ కమిషన్ చేతిలో కాంగ్రెస్ సర్కార్ పెట్టింది. ఆ కమిషన్ ఇచ్చే నివేదికకు చట్టబద్ధత ఉండదని, అధికారికంగా ఎందుకు పనికిరాదని బీసీ సంఘాలు అడ్డుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇక తప్పదన్నట్టు డెడికేటెడ్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని ఆధ్వర్యంలో చేపట్టిన కులగణనను కొందరు పట్టించుకోలేదు, కొందరు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదు. కులగణన కోసం తమ ఇంటికి ఎవరూ రాలేదని చెప్పినవారు కూడా ఉన్నారు. మొత్తానికి తెలంగాణ జనాభాలో 56 శాతం బీసీలున్నారని ఆ లెక్కల్లో తేలింది. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం.. బీసీ జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు, మిగతా హామీలు సాకారం కావలసి ఉన్నది.
కులగణన ఘనకార్యం చేసిన మొదటి ప్రభుత్వం తమదేనని చెప్తూ కాంగ్రెస్ భుజాలు ఎగరేయడమే తప్ప, దాని వల్ల ఇప్పటివరకు బీసీలకు అందిన ప్రయోజనం శూన్యం. తెలంగాణ కంటే ముందే 2023లో బీహార్‌లో కులగణన జరిగింది. కుల ప్రాతిపదికన విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులు తెచ్చింది. వాటికి గవర్నర్ ఆమోదం లభించింది. అవి గెజిట్‌లో నోటిఫై కూడా అయ్యాయి. కానీ, చివరికి ఈ రిజర్వేషన్ల పెంపు చెల్లదని 2024 జూన్‌లో పాట్నా హైకోర్టు అడ్డుపడింది. రిజర్వేషన్ల మార్పుపై రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులు చెల్లవని రాజకీయ నాయకులందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిబ్రవరిలో కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను ఉభయ చట్టసభల్లో అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సెప్టెంబర్‌లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు జీవో నెం.9 జారీ అయింది. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన సామాజిక న్యాయం దిశగా తొలి అడుగు పడిందని సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అయితే, ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం లభించలేదు. దాన్ని రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ ఢిల్లీకి పంపించారు. ప్రస్తుతం ఆ బిల్లు అక్కడే పడి ఉన్నది. ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా జీవో విడుదల చేసి చేతులు దులుపుకొంది.
రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చితే తప్ప రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు. అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి బీసీలకు 62 శాతం రిజర్వేషన్లకు తమిళనాడు రాష్ట్రం రాజ్యాంగ రక్షణ పొందింది. ఇదంతా తెలిసి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇవ్వడం మోసం చేయడం కాక మరేమిటి? రాహుల్‌గాంధీ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పాలన వస్తే సామాజిక న్యాయం చేస్తామన్నారు తప్ప, కేవలం రాష్ట్రం ద్వారా అది సాధ్యపడుతుందని చెప్పలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల కేంద్ర పరిధి నిర్ణయాలను అంగీకరించదు. రాజకీయంగా ఎదగకుండా ఒక పార్టీని మరో పార్టీ తప్పకుండా అడ్డుకుంటుంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పాలన ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యపడదని తేలిపోయినట్టే. నాలుగు నెలలుగా రాష్ట్రపతి వద్ద ఉన్న ఫైల్ కదలిక కోసం ఆగస్టు 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేవంత్, మంత్రులు చేపట్టిన ధర్నా ఎలాంటి ఫలితాన్నివ్వలేదు. ఈ బిల్లుకు మోదీ ఆమోదం తెలపకపోతే ప్రజలు ఆయనను గద్దె దింపి, ఆమోదాన్ని సాధించుకుంటారని రేవంత్ ఆ సభలో అన్నారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పాలన వస్తే తప్ప రిజర్వేషన్లు సాధ్యం కాదని పరోక్షంగా ఆయన చెప్పినట్టే.
రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం సహాయనిరాకరణతో పాటు కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. 2024 జనవరి నాటికే జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కేంద్రం నుంచి పంచాయతీలకు అందవలసిన నిధులు ఆగిపోయాయి. 42 శాతం రిజర్వేషన్లు సాధించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బీసీలు భారీ ఆందోళన చేపడతారని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. డిసెంబర్ ఒకటి నుంచి ఆరంభమయ్యే పార్లమెంట్ శీతాకాలపు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వివిధ బీసీ సంఘాలు తమ కార్యాచరణను ప్రకటించాయి. అఖిలపక్ష పార్టీలను రేవంత్‌రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని అంటున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గర పడుతున్నది. ఈ గండం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తే బీసీలు, బీసీ నేతల నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి.
– బద్రి నర్సన్