తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ సామాజిక, ప్రజాస్వామిక అభ్యుదయ విధానాలను పథకాల రూపంలో ప్రకటించి తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. బీసీల పట్ల గతంలో చేసిన అనేక తప్పిదాలను సరిదిద్దుకునే ప్రయత్నంగా అవి కనిపించాయి. కానీ, తీరా అందలమెక్కాక ఆ పార్టీ అసలు స్వరూపం బయటపడింది. రాష్ట్రంలో అధికార మార్పు కోరుకున్న ఆ పార్టీ నాయకులు.. ఇచ్చిన హామీలను నెరవేర్చి వెనుకబడిన కులాల జీవితాల్లో మార్పు రావాలని మాత్రం కోరుకోవడం లేదు. కాలేల్కర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్ సిఫారసుల అమలు వరకు బీసీల విషయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం క్షమార్హం కానిది.
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలే నేడు ఆ పార్టీ మెడకు ఉచ్చులా బిగుస్తున్నాయి. ముఖ్యంగా బీసీల ఓట్లు కొల్లగొట్టడానికి ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వానికి గుదిబండలా మారుతున్నాయి. అయితే వాటిని నిలబెట్టుకునే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి చింతాకుమందం కూడా కనిపించడం లేదు. బీసీలను ఆ పార్టీ ఇప్పటికీ విస్మరిస్తూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుతో మొదలైన ఇది కొనసాగుతూనే ఉన్నది. బీసీలకు బీఫాంలు ఇచ్చినా గెలవలేరని.. అగ్రకులాలకే టికెట్లు ఇస్తామన్నట్టు ఆ పార్టీ వ్యవహరించిన తీరును మరువకముందే నామినేటెడ్ పోస్టుల్లోనూ హస్తం పార్టీ వంచించింది. కులగణన, సామాజిక న్యాయం అంటూ రాహుల్‌గాంధీ దేశమంతటా తిరుగుతుండగా.. ఇక్కడి నాయకత్వం మాత్రం బీసీలను అణగదొక్కా లని చూస్తున్నది.
వెనుకబడిన తరగతులకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో బుట్టదాఖలు చేసింది. కులగణన చేపట్టి, బీసీల రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఎనిమిది నెలలైనా ఆ ప్రక్రియను చేపట్టలేదు. అంతేకాదు, బీసీ కులాల సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి అసెంబ్లీ సాక్షిగా వంచించింది.
కులవృత్తులకు ప్రతి మండల కేంద్రంలో వృత్తి బజార్లు ఏర్పాటు చేసి, ఉచితంగా షాపులు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం సరికాదు. బీఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తూనే.. 100 రోజుల్లోపే మరో విడత గొర్రెల పంపిణీ చేస్తామని మాటిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక మొత్తం పథకమే విఫలమైందని చేతులెత్తేయడం సబబు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రుణమాఫీకి సంబంధించి 157 సహకార సంఘాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ లెక్కన రుణమాఫీ కూడా విఫలమైందని ప్రభుత్వం ప్రకటించాలి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ అంశాన్ని ఎటూ తేల్చకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఉద్యమానికి బీసీలు సమాయత్తమవుతున్నారు. శ్రామిక కులాలన్నీ ఏకమై రోడ్డెక్కే రోజు దగ్గర్లోనే ఉన్నది. బీసీలంతా ఒక్కతాటిపైకి వచ్చిన నాడు రాష్ట్ర ఆర్థిక రంగం పూర్తిగా స్తంభించిపోవడం ఖాయం. కల్లు మండువన గౌడన్నలు, గొర్ల మందన గొల్లకురుమలు, చాకలి రేవున రజకులు, చేపల చెరువున ముదిరాజులు, కొలిమిన కమ్మరులు, మట్టితట్టా పనుల వద్ద వడ్డెర ఉప్పరివారు.. ఇలా ఎవరికివారు, ఎక్కడికక్కడ సబ్బండ కులాలు ఉద్యమ పిడికిలి బిగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్దార్ సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య, మారోజు వీరన్న, బెల్లి లలితల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ‘మేమెంతో మాకంత’ అంటూ ఆర్థిక, రాజకీయ వాటాలు దక్కే వరకు పార్టీలకతీతంగా బీసీలందరూ ధిక్కారపు స్వరాలుగా నిలవాల్సిన సమయమిది. అమాయక కులాలని, రాజకీయ చైతన్యం లేని వర్గాలని అనుకుంటూ మన వాటాను కూడా పరాన్నజీవుల్లా దండుకుంటున్నవారికి బీసీ కులాల బలమేమిటో చూపించాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పట్టుబట్టి సాధించుకోవాల్సిన బాధ్యత కూడా బీసీ కులాలపైనే ఉన్నది.