e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఎడిట్‌ పేజీ డబ్బా పోదు, కరంటు వస్తది

డబ్బా పోదు, కరంటు వస్తది

డబ్బా పోదు, కరంటు వస్తది

మనకు దసరా అంటే పెద్ద పండుగ. కని ఆ పండుగొచ్చిందంటే మాకు మాత్రం గుండె గావరైతది, పానం చిత్తుబొత్తయితది. అసొంటి దినం జీవితంల మళ్లా రావొద్దని ఆ దుర్గమ్మకు రెండు చేతులెత్తి మొక్కుకుంటం. 2002 కరెక్టు దసరా పండుగ రోజు… పట్నం మొత్తం పండుగ మైకంల మునిగి తేలుతున్నది. మాకు మాత్రం పండుగ లేదు, పబ్బం లేదు. రోజుకు ఒక్క పూటయినా తిండి దొరికితే అదే మాకు దసరా పండుగ. అందుకే దసరా రోజు కూడా ఇద్దరం అయ్యాకొడుకులం ఫుట్‌పాత్‌ మీదున్న మా మంగలి డబ్బాకు ఎదురుంగ రెండు కుర్చీలేసుకొని కూసున్నం.
పండుగ యాల్ల మంగలి దుకాన్లకు ఎవ్వర్రారని ఎర్కున్నా ఎక్కడో చిన్న ఆశ. ఒక్కలొచ్చినా తెల్లారి కూరగాయల కర్సుకైతయనే ఆశ మమ్మల్ని పొద్దంతా అక్కడ కూసోవెట్టింది. సినిమా ఐపోయినంక టాకీస్‌ల పరద కిందికి దిగినట్టే సూర్యుడు కూడా కిందికి దిగుతనే ఉన్నడు. ఎలుతురు మాయమౌతూ చీకటి చిట్టచిట్ట అడుగులేసుకుంటూ అస్తూనే ఉన్నది. మా ఫుట్‌పాత్‌ డబ్బాల లైటు బుగ్గ ఉంటే ఇంకో గంటో, రెండు గంటలో ఉందుమేమో! కని కరంటు బుగ్గ కూడా లేకపాయె. చీకటయ్యేసరికి నాయిన మొగంల బాధ.. తన పరిస్థితి మీన తనకే కోపం.. పండుగ నాడు సుత మా కుటుం బం అనుభవించే అవస్థ, ఏమీ చేయలేనితనం ఆయన మొగంల కనిపించింది. బుజం మీదున్న తువ్వాల న్యాలగ్గొట్టిండు.. ‘ఇగ డబ్బాకు తాలమేద్దాం పారా ప్రవీణ్‌’గా అన్నడు. ఇంతల ‘ఓ ప్రకాశన్నా.. జర్రాగరాదె సవురం జేత్తువు’ అనుకుంటా ఓ పెద్ద మనిషి అచ్చిండు. అప్పటికే చిర్రుకెత్తి ఉన్న మా నాయిన మొకంల నవ్వు కరంటు బుగ్గ లెక్కనే ఎలిగింది. ఆ నవ్వు ఎంతోసేపు లేదు. కత్తెర చేత వట్టి కటింగ్‌ ఇట్లా షురూ జేసిండో లేదో, ఉన్నదున్నట్టు కూలవడ్డడు మా నాయిన ప్రకాశ్‌. ఓ చేతు అటువో యింది, ఓ కాలు ఇటువోయింది. మూతంకరవోయింది, కనుగుడ్లు పెద్దగైనయి, నాలిక సాగి గదమకానింది.
నా పేరు కొత్వాల్‌ ప్రవీణ్‌, బేగంపేటలోని శ్యాంలాల్‌ ఏరియాలో పదో తరగతి దాకా సదువుకున్న. అమ్మ మీనా, తమ్ముడు, అక్కా, నాయిన ఈ నలుగురే నా లోకం. నిల్వ నీడ లేకుంటే ఒకింటికి కిరాయికి వొయినం. చిన్న రూం, నలభై రూపాల కిరాయి. నాయిన మంగలి పన్జేస్తడు, అమ్మా ఓ ఇంట్ల పన్జేస్తది. ఆ ఇండ్లల్ల మిగిలిన అన్నం దెచ్చి మా కడుపు నింపేది. అప్పటిదాంక ఒగల్దగ్గర పన్జేసిన నాయిన 1996ల శ్యాంలాల్‌ ఏరియాలోని ఫుట్‌పాత్‌ మీద సొంతంగా ఓ డబ్బా ఓపెన్జేసిండు. అప్పుడు నేను ఆరో తరగతి. ఇద్దరు జేస్తే ఐదుగురం తినాలె. ఇట్లయితే ఇల్లు గడిసేటట్టు లేదని అటు ఆరోది సదువుకుంటనే ఇటు నాయినెంబడి నడిసిన మంగలి పన్నేర్సుకోవడానికి. 2000 సంవత్సరంల పదో తరగతి సెకండ్‌ క్లాస్‌ల పాసైన. నాయిన నేర్పిన కులవృత్తి, మంగలిపని గూడ మొత్తం అచ్చింది.
‘సద్వినకాడికి సాల్‌ తియ్యిరా ప్రవీణు’ అంటే వాళ్ల మాట తీసెయ్యలేక మంగలి పనికే కుదిరిన. నేను చేతికందిన్నని అమ్మానాయినల ఆనందానికి అడ్డూ అదుపు లేదు. అదే ఫుట్‌పాత్‌ మీద అయ్యాకొడుకులం ఇద్దరం గలిసి మంగలి పన్జేస్తున్నం. అప్పుడెంతచ్చేటియని! ఎంతజేసినా ఇంటికి పోంగ చెరో వంద రూపాలు వట్కపోతే అదే మా గొప్ప. రెండేండ్లు గడిసినయి. కరెక్టు 2002 దసరా రోజున నాయిన పక్షవాతం వచ్చి కూలవడ్డడు. దవాఖానకు తీస్కపోదామంటే చేతిల చిల్లిగవ్వ లేక ఇంట్లనే పండవెట్టినం. మూణ్నెళ్ల గోస మాది. అసొంటి రోజులు పగోనిగ్గూడ రావొద్దు. మా గోస సూడలేక ఇంటి ఓనర్‌ ప్రేమన్న 50 వేల రూపాలు చేతిల వెడ్తే దవాఖానకు తీస్కపోయినం నాయినను. దేవుని పుణ్యాన బతికి బయటవడ్డడు. కాల్‌రెక్కల్‌ మంచిగైనయి. ఆయన పని ఆయన చేసుకుంటున్నడు. ఇగ అప్పటిసంది నాయినకు టెన్షన్‌ పెట్టే పన్లేం జెప్పలే, ఉన్నడా అంటే ఉన్నడన్నట్టు బతికించుకుంటున్నం. అప్పో కుప్పో అమ్మనే సూసుకున్నది.
నేనుగూడ నాయినను ఇబ్బంది పెట్టదల్సుకోలె. అందుకే డబ్బా మంచిచెడ్డలు నేనే తీసుకున్నా. 2003.. ఒక్కోరోజు ఒక్క మనిషి కూడా అచ్చేటోడు కాదు. ఉత్త చేతులతోని ఇంటికిపోయిన దినాలెన్నో.. ‘ఫుట్‌పాత్‌ డబ్బా మీద ఎవ్వడు గడ్డం గీస్కుంటడు’, ‘ఈ డబ్బాల కరంటే ఉండదు కటింగ్‌ ఎట్ల చేస్తవురా’ అని కొందరు మొగం మీదనే అనెటోళ్లు.
కరంటు లేకుంటే గిరాకీ అచ్చేటట్లు లేదని ఓ ఉపాయం జేసిన. డబ్బా ఎన్క ఉండే ఇంట్లకెళ్లి వైరు గుంజిన. వాళ్లకు నెలకు 50 రూపాలు కట్టాలె కరంటు బిల్లు. మరేం జేస్తం మీటర్‌ పెట్టిద్దామంటే అంత ఐషత్‌ లేదాయె? ఆ 50 రూపాలు ఇప్పుడు 400 అయింది. ఇప్పటికీ నా డబ్బాల కరంటు మీటర్‌ లేదు. మొన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు మంగలోళ్లకు కరెంటు ఫ్రీ ఇస్తనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటిచ్చిండు. సార్‌ మాటిచ్చినట్టే మంగలి దుకాన్ల కు 250 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ జీవో తీస్కచ్చిండు. అచ్చేనెల ఒకటి నుంచి ఫ్రీ కరెంటే వస్తదట మాకు. అందుకే నేను గూడా నా డబ్బాల కరంటు మీటర్‌ పెట్టించుకుంటా. ఒకప్పుడు కరంటు లేక చీకట్ల మునిగిన నా డబ్బా ఇప్పుడు వెలుగులతో తళతళా మెరుస్తది.

నాకు 2010లనే పెండ్లయ్యింది. మా ఇంటామె పేరు రజిత. నాకిద్దరు మొగపిల్లలు. సాయిరాం, జివో. ముప్ఫై ఏండ్లాయె మేం ఫుట్‌పాత్‌ మీద డబ్బా నడపవట్టి. మొన్నెవ్వల్లో జీహెచ్‌ఎంసీ అధికారులట. వచ్చి డబ్బాలు ఖాల్జేయిర్రి. లేకపోతే పొక్లయినర్లు వెట్టి లేపేస్తమని బెదిరించిర్రట. ‘డబ్బా లేకపోతే, జీవితమే లేదు. మమ్మల్ని కాపాడండి.. సార్‌’ అని మంత్రి కేటీఆర్‌కు లెటర్‌ రాసినం. అంతే ఇప్పటివరకు ఏ ఆఫీసర్‌ డబ్బా మొఖాన రాలె. నా డబ్బాకు కరంటు తెస్తున్న కేసీఆర్‌కు, నా డబ్బాను కాపాడిన కేటీఆర్‌ సార్లకు వేన వేల శనార్థులు.

  • గడ్డం సతీష్‌, 99590 59041

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డబ్బా పోదు, కరంటు వస్తది

ట్రెండింగ్‌

Advertisement