భారత్ అనుకూల విధానాలకు పేరుపొందిన షేక్ హసీనా వాజెద్ జెన్-జీ తిరుగుబాటులో పదవిని కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందారు. గందరగోళ పరిస్థితుల్లో సైన్యం వత్తాసుతో ప్రభుత్వ నిర్వహణా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనుస్ మొదటి నుంచీ భారత వ్యతిరేక ఉల్లేఖనలు చేస్తూనే ఉన్నారు. ఆయన తాత్కాలిక పాలకుడిగా ముందుకు వచ్చినప్పటికీ రెండు దేశాల సంబంధాల్లో దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలపై తన పరిధికి మించి మాట్లాడుతుండటం గమనార్హం. భౌగోళికంగా కీలక ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ మరోసారి సంక్షోభంలో కూరుకుపోతున్నది.
2024 జూలైలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీసిన ప్రముఖ యువజన నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు గురికావడం తాజా సంక్షోభానికి దారితీసింది. నిలువెల్లా భారత వ్యతిరేకతను నింపుకున్న ఇస్లామిక్ తీవ్రవాది అయిన హాదీ బంగ్లా విముక్తి కాలం నాటి విలువలను పూర్తిగా తిరస్కరించారు. బంగ్లాలో ఇస్లామిస్టు పాలన రావాలనేది తన ఆశయం. ఈ వివాదాస్పద యువనేతపై డిసెంబర్ 12న ముసుగు వ్యక్తులు కాల్పులు జరిపారు. సింగపూర్‌లో చికిత్స పొందుతూ డిసెంబర్ 18న అతడు మరణించాడు. హాదీ మృతికి నిరసనగా మొన్నటి గురువారం రాత్రి చెలరేగిన అల్లర్లు బంగ్లా ప్రస్తుత ఆలోచనాతీరుకు, అదేవిధంగా రాబోయే రోజుల్లో భారత్‌కు ఎదురుకానున్న సమస్యలను సూచనప్రాయంగా తెలియజేస్తున్నాయి. పోలీసులు అరడజను మంది అనుమానితులను అరెస్టు చేసినప్పటికీ హాదీ హత్యకు బాధ్యులెవరో ఇప్పటివరకైతే ఇదమిద్ధంగా తెలియదు. హాదీ మద్దతుదారులు మాత్రం ఇది హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ పనేనని ఆరోపిస్తూ అల్లర్లకు దిగారు. బంగ్లాలోని రెండు ప్రధాన పత్రికలైన ప్రొథొమ్ ఆలో, ది డైలీ స్టార్ ఆఫీసులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అనేక సాంస్కృతిక కేంద్రాలు, అవామీ లీగ్ పార్టీ కార్యాలయాలు, మాజీ మంత్రుల నివాసాలపై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. బంగ్లా విముక్తి పోరాట నేత, బంగ బంధుగా పేరుపొందిన ముజీబుర్ రహమాన్ ఇంటిని సైతం అల్లరి మూకలు విడిచిపెట్టలేదు. మైమెన్సింగ్ నగరంలో ఓ యువకుడిని అల్లరిమూకలు కొట్టిచంపడమే కాకుండా, మృతదేహాన్ని వేలాడదీసి తగులబెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
హసీనా పదవీచ్యుతురాలై 15 నెలలు గడుస్తున్నా బంగ్లాదేశ్ ఇంకా కుదుటపడలేదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. హసీనా నిరంకుశ పోకడలు కొంతవరకు ప్రజాగ్రహానికి కారణమైన మాట వాస్తవమే అయినప్పటికీ మధ్యంతర పాలన చేపట్టిన పెద్దలు సంయమనానికి, సామరస్యానికి కృషిచేసి, ప్రజాస్వామ్య పాలన నెలకొల్పే దిశగా ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. పైగా అవామీ లీగ్ పట్ల, ఆ ముసుగులో భారత్ పట్ల వ్యతిరేకతను ఎగదోస్తుండటం గమనార్హం. తాత్కాలిక ప్రభుత్వం ఈసరికే సుస్థిరత స్థాపించే అవకాశాన్ని చేజార్చుకున్నదని చెప్పక తప్పదు. అవామీ లీగ్‌ను, పార్టీ విద్యార్థి విభాగమైన ఛాత్రా లీగ్‌ను నిషేధించి, ఇస్లామిక్ ఛాందసవాదాన్ని భుజాలకెత్తుకునే జమాతే ఇస్లామీ వంటి సంస్థలపై నిషేధం ఎత్తివేయడం వారు ఎటువైపో తెలియజేస్తున్నది. తాత్కాలిక ప్రభుత్వ విధానాల అండదండలతో ఇస్లామిక్ తీవ్రవాదం బుసలు కొడుతున్నది. ఫలితంగా దేశంలో ప్రతీకార రాజకీయాలు ప్రజ్వరిల్లి అరాచకం ప్రబలుతున్నది. ఇది ప్రాంతీయ సుస్థిరతకు విఘాతంగా పరిణమిస్తున్నది. బహుళపక్ష ఎన్నికలు జరిపి ప్రజాతీర్పుకు పట్టం కట్టడం తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి మరో మార్గం లేదు. కానీ, సలహాదారు హోదాలో చక్రం తిప్పుతున్న మహమ్మద్ యూనస్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించడం లేదు.