Telangana | సాంకేతికంగా ఎంత ముందంజ వేసినప్పటికీ మనదింకా వ్యవసాయిక దేశమే. ప్రజలకు ఆహారాన్ని సమకూర్చడమే కాకుండా అత్యధిక ఉపాధి కల్పించేదీ వ్యవసాయమే. దాని చుట్టూరా అభివృద్ధి అల్లుకొని ఉంటుంది. అందుకే, అన్నదాతను నిలబెట్టుకుంటే అన్నిరంగా లు నిలదొక్కుకుంటాయన్న ఆలోచనలతోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగుకు పెద్దపీట వేశారు. రైతు అనుకూల విధానాల పరంపరకు తెరతీశారు. తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రాన్నే మార్చేశారు. నెర్రెలు వారిన బీడు నేలల దాహార్తి తీర్చేందుకు కాళేశ్వరం వంటి కార్యక్రమాలతో అపర భగీరథాన్ని ఆవిష్కరించారు. ఉచిత కరెంటుతో ఊతమిచ్చారు. అప్పుల తిప్పలు తప్పించేందుకు రైతుబంధు తెచ్చారు. రైతుబీమాతో కుటుంబాలకు భరోసా కల్పించారు. ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అందజేశారు. పుష్కలంగా ఎరువులు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేశారు. సాగులో సమన్వయానికి రైతువేదికలు నిర్మించారు. చివరాఖరి ఎకరానికి నీరందించడమే కాకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తూ నమ్మకం పెంచారు. ఈ చర్యలన్నింటి ఫలితంగా సాగు తెప్పరిల్లింది. తెలంగాణ ఘనకీర్తి తేజరిల్లింది. అరకొర సాగుతో అలమటించిన రాష్ట్రం అన్నపూర్ణగా అలరారింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఎదిగింది. 2018-19 నుంచి 2023-24 మధ్యకాలంలో మన వ్యవసాయరంగం 16.42 శాతం వృద్ధిరేటు సాధించడమే ఇందుకు తార్కాణం. కేంద్ర వ్యవసాయశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చిన గణాంకాలివి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్రెడ్డి, ఆయన మంత్రివర్గ సభ్యులు చేస్తున్న దుష్ప్రచారాలను తుత్తునియలు చేసే సమాచారమిది. కేసీఆర్ అనుసరించిన విధానాలే ఈ అపూర్వ ముందంజకు తోడ్పడ్డాయని చెప్పడం చర్విత చర్వణమే అవుతుంది.
అంతటి స్వర్ణయుగం చూసిన తెలంగాణలో ఇప్పుడు రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలైనట్టుగా తయారైంది పరిస్థితి. రైతుబంధు కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తున్నది. పెంచి ఇస్తామన్న సాగు సాయానికి భరోసా లేకుండాపోయింది. కక్షపూరిత రాజకీయాల ఫలితంగా ప్రాజెక్టులను ఆగమాగం చేయడంతో సాగునీళ్లకు గోస వచ్చిపడింది. కాంగ్రెస్ ప్రభు త్వం గప్పాలు కొట్టుకుని టాంటాం వేసుకున్న రుణమాఫీ రైతులను దారుణంగా వంచించింది. ఇవన్నీ అలా ఉంచితే రైతుల పట్ల కనీస మర్యాద కూడా కరువైపోయింది, అడుగడుగునా అన్నదాతలకు అవమానాలు ఎదురవుతున్నాయి. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని ఓ మంత్రి నోరుపారేసుకున్నారు. రుణమాఫీ కోసం రోడ్డెక్కితే గయ్యిమని లేస్తున్నారు. నిన్నటికి నిన్న సాక్షాత్తు వ్యవసాయ మంత్రి రైతుల మీద చిందులు తొక్కడం సర్కారు అసహన ధోరణికి పరాకాష్ఠ.
మాయమాటలు నమ్మి మోసపోయిన రైతులు ఇప్పటికైనా తనవారెవరో, పరులెవరో గ్రహించాలి. కడుపులో పెట్టుకొని చూసుకున్నదెవరు? కండ్లల్ల నిప్పులు పోసుకున్నదెవరు? అనేది పరకాయించాలి. బీఆర్ఎస్ పాలనలో సగర్వంగా తలలెగరేసిన రోజులు పోయి తలదించుకునే పరిస్థితి తెచ్చిపెట్టింది కాంగ్రెస్. మాటకారి, మాయదారి హామీలతో అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తే ఓటును చేజార్చుకున్న ఫలితమిది. మోసపోయి గోసపడుతున్న దైన్యమిది. కల్లబొల్లి కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పేందుకు సమయం ఆసన్నమైందని రైతులు గుర్తించాలి. అందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే సరైన అదును.