ఇప్పటిదాక మన ఇష్టం, అనుమతి లేకుండా మన తెలంగాణలో నీటి చౌర్యం, నిధుల అపహరణ, ఉద్యోగాల అక్రమాలు సాగించిన ఆంధ్ర రాజకీయ నాయకులు అసలు వారి దుస్థితిలో వాళ్ల రాష్ర్టాన్ని గాలికివదిలి, మనల్ని బలవంతంగా కలుపుకొన్నారని తెలుసుకున్నాం. వారి రాష్ట్రం వారికి వచ్చింది. మన ప్రాంతం రాష్ట్రంగా ఏర్పడకముందు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ తెలంగాణ పూర్వ చరిత్ర, సంస్కృతి, భాష, భావనలు గుర్తించటం అవసరం.
భారతదేశంలో కలవకముందు హైదరాబాద్ రాష్ట్రం అన్నపేరుతో దక్క న్ పీఠభూమికి మధ్య ప్రాంతంలో ఇది వేరే దేశంగా ఉండింది. తెలంగాణ వేరే దేశమన్న విషయం చాలామందికి తెలియదు. చరిత్ర ఈ విధంగా ఉన్నది. శాతవాహన రాజులు 230 బీసీ నుంచి, 220 ఏడీ దాక పరిపాలించిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలుగా 1083 ఏడీ దాక పరిపాలింపబడిందీ ప్రాంతం. 1083 నుంచి 1323 దాకా పటిష్ఠమైన రాజ్యంగా దక్షిణ భాగంలో కొంత తమిళనాడును పాండ్యులు, కర్ణాటక భాగాన్ని హొయసల రాజులు పరిపాలించగా, కాకతీయ సామ్రాజ్యం కొంత తమిళనాడును, ఇప్పటి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాన్ని, కొద్దిగా మహారాష్ట్ర, కొద్దిగా ఒడిషా రాష్ర్టాల భాగాలను కలుపుకొని దక్షిణ భారతంలో అతి బలమైన సామ్రాజ్యంగా సుమారు రెండున్నర శతాబ్దాలు విలసిల్లింది.
ముసునూరి నాయకులు సుమారు ఒకటిన్నర శతాబ్దాలు (1335-1368) పరిపాలించారు. ఆ తర్వాత ఢిల్లీలో మొఘలుల పాలనకు ముందు, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు దండెత్తి ఆక్రమించటంతో (1347-1512) సుమారు ఒకటిన్నర శతాబ్దాలు సుల్తానుల పాలన సాగింది.
గోల్కొండ సుల్తానుల పాలన సుమారు 175 ఏండ్లు, అసఫ్‌జాహీ వంశం (1724-1950) సుమారు 150 ఏండ్లు పాలన సాగించాయి. భారత్‌లో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్ర విలీనమైంది. అంటే సుమారుగా ఐదున్నర శతాబ్దాలు ఈ ప్రాంతం ముస్లింల పాలనలో ఉండగా, ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతం చాలాకాలం స్థానిక రాజుల పాలనలోనూ, 1857 నుంచి 90 ఏండ్లు బ్రిటిష్ పాలనలోనూ ఉండిపోయింది. నిజానికి భారత స్వాతంత్య్రోద్యమంతో తెలంగాణ ప్రాంతానికి ఏ సంబంధమూ లేదు. నెహ్రూ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకోవలసిన పని కూడా తెలంగాణ ప్రజలకు లేదు. 1948లో ఆపరేషన్ పోలో పేరు తో నిజాం రాజ్యం మీదికి సైన్యాన్ని పంపి ఆక్రమించడం కూడా చాలా నేరపూరిత చర్య. ఎందుకంటే వారు నిజాముకు చెప్పింది ఒకటి, చేసింది ఇంకొకటి. కేఎం మున్షీ అనే పెద్ద మనిషి ద్వారా నిజాంకు నెహ్రూ ఒక సందేశం పంపా డు. అదేమంటే, నిజాం తన దేశాన్ని ఒక రాష్ట్రం గా భారతదేశంలో కలపాలని, ఆ రాష్ర్టానికి నిజాం, ఆయన వారసులే రాజ ప్రముఖ్‌గా (ఇప్పటి గవర్నర్ హోదా) ఉంటారని, ఈ ప్రాం తం చరిత్ర, సంస్కృతిని భారతదేశం గౌరవిస్తూ పాలన చేస్తుందనీ, ఈ ప్రాంత ప్రజల జీవితం బాగుపడుతుందనీ! నెహ్రూ మున్షీకి రహస్యం గా ఇంకో మాట చెప్పాడు. నిజాముకు సందేశం అందించాక తెలంగాణ ప్రాంతంలో కనిపించకుండా ఎటైనా వెళ్లిపోవాలనీ! అదెందుకంటే సర్దార్ పటేల్ తన భారత సైన్యంతో ఆపరేషన్ పోలోలోని చీకటి చర్యని ఆచరించటానికి సిద్ధంగా తెలంగాణ ప్రాంతం బయట ఉన్నాడు.
నిజాం విలీనానికి సమ్మతి పత్రం మీద సంతకం చేయగానే, పటేల్ (అప్పటి హోంమంత్రి) తన అపార సైన్యంతో తెలంగాణ లోపలికి చొరపడి ఎదిరించినవారిని లొంగదీసుకుని, లేకపోతే కాల్చేసి, ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించాడు. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రం అనే పెంక మీంచి, భారతదేశం అనే పొయ్యిలో పడింది. ఇది ఎందుకు చేశారంటే నిజాము భారతదేశ స్వతంత్రం సిద్ధించగానే తన దేశ పరిస్థితి గురించి ఐరాసకు ఉత్తరం రాశాడు. అప్పుడు ఆ సంస్థ నిజాం స్వతంత్ర దేశంగా ఉండవచ్చునని చెప్పింది. నిజాం భారతదేశంతో కలవద్దని కొందరు, ముఖ్యంగా ముస్లింలు కోరగా, తన స్వతంత్రత నిలబెడుతాడన్న నెహ్రూ మాటలు నమ్మి నిజాము విలీనానికి ఒప్పుకున్నాడు. అయితే ఇంకొక పెద్ద సంస్థానమైన కశ్మీరుకు ఎన్నో రక్షణలు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన నెహ్రూ, అంతకంటే పెద్దదయిన హైదరాబాద్ సంస్థానానికి ఏ రక్షణలు లేకుండా సైన్యాన్ని ఉపయోగించి బలవంతంగా పటేల్ పథకం ప్రకారం లొంగదీసుకున్నాడు. అది నిజానికి సరైన చర్య కాదు. ఇంక 17 సెప్టెంబర్ 1948 నుంచి, ఈ ప్రాంతంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేదాకా అంటే 1952 మార్చి 6 దాకా ఈ ప్రాంత ప్రజల మీద జరిగిన అత్యాచారాలు, దాష్టీకాలు, సైన్యం చేసిన అరాచకాలు తెలుసుకోవలసిన అవసరం ఈ తరానికి, తెలియనివాళ్లకు వివరంగా చెప్పాల్సి ఉంది. ఆ చరిత్ర తెలంగాణకు చాలా అవసరం.
1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనం కాకముందు, హైదరాబాద్ రాష్ట్రం నిజాం రాజ్యంగా ఉండేది. భూమికి 1250 ఉంచి 2500 అడుగుల ఎత్తులో కృష్ణా, గోదావరి, వాటి ఉప నదులతో సస్యశ్యామల దేశం అది. వైశాల్యంలో మద్రాస్ ప్రెసిడెన్సీ అంత పెద్దగా (తమిళనాడు, ఆంధ్ర కలిపి), ఉత్తరంలో సెంట్రల్ ప్రావిన్సులు, వాయువ్యంలో బొంబాయికి చెందిన ఖండేష్ జిల్లా, పశ్చిమంలో అహ్మద్‌నగర్ మొదలైన జిల్లాలు, తూర్పున వార్ధా, దక్షిణంలో కృష్ణా, తుంగభద్ర నదులతో ఒక అత్యంత సంపన్నదేశంగా ఉంది. 1853 దాకా పూర్తి రాచరికపు పాలన ఉన్నా, సాలార్జంగ్ ప్రధానమంత్రి అయ్యాక పాలనలో చాలా మార్పులు తెచ్చాడు. వ్యవసాయరంగం, విద్యారంగం, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, తనకు సహాయంగా కొందరు ఉప మంత్రుల నియామకం వంటి మార్పులతో అన్నిరంగాలను పటిష్ఠం చేసి పాలనను చాలా అభివృద్ధి చేసి ప్రజాదరణ పొందాడు.
పర్షియన్ అధికార భాష అయినా, తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ భాషలు మాతృభాషలుగా ఉన్నవారు సమాన నిష్పత్తిలో ఉండేవారు. అనేక కులాలు ఉన్నా, ఎవరి వృత్తులు వారు చేసుకుంటూ కలిసి మెలిసి ఉండేవారు. పరస్పర గౌరవం ఆదరం చూపుకుని అన్ని మతాల పండుగలు అందరు కలిసి చేసుకునేవా రు. పీర్ల పండుగలో హిందువులు పాలు పంచుకుంటే, వినాయక చవితి, దసరాకు ముస్లింలు అందమైన పూల దండలు కట్టి వీరికి పూజకు తెచ్చేవారు. వారి మధ్య మత విద్వేషాలు, కులాల కుంపట్లు లేవు. అన్ని మతాల, భాషల, కులాలవారు పరస్పర గౌరవంతో, మనుష్యుల మీద అభిమానంతో, తమ సమాజం పట్ల అత్యంత గౌరవంగా, బాధ్యతగా మెలిగేవారు.
1947 -1948 మధ్య నిజాం రాష్ట్ర భారతదేశ విలీనాన్ని వ్యతిరేకిస్తూ రజాకారు మూవ్మెంట్ మొదలైంది. వారు నిజాం ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని ఒత్తిడి చేశారు. అయితే ఆంధ్ర చరిత్రకారులు రాసినట్టు ఈ పేరు పెట్టుకొని పల్లెటూర్లలో ప్రజల మీద పెత్తనం చేసి దోచుకున్నది కేవలం ముస్లింలే కాదు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, ఇతర అగ్రకులాల వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద అధికారం ఉన్నవాళ్ళలో చాలామంది సామాన్య ప్రజలను పీడించారు, ఎదిరించినవారిని చంపారు.
కానీ, 1948 సెప్టెంబర్ నుంచి ఎన్నికలు జరిగి బూర్గుల ప్రభుత్వం ఏర్పడిన 1952 మార్చిదాకా తెలంగాణ ప్రజల కష్టాలు ఇంకా దారుణంగా ఉండేవి. రజాకార్ల సమయంలో వారు చంపినది 3000 మంది అయితే, పటేల్ సైన్యం, తర్వాత 1952 దాకా అధికారంలో ఉన్నవారు హైదరాబాద్ రాష్ట్రంలో చంపినవా రు 30,000 నుంచి 40,000 మంది. అక్షరాలా పది రెట్లు ఈ భారతదేశ రజాకార్ల హత్యలున్నా యి. ఈ ప్రాంతం స్వాధీనం కాగానే సుమారు యాభై వేల మంది భారతీయ సైనికులు తెలంగాణ అంతటా ఊళ్లమీద పడ్డారు. అప్పటికే 1921 నుంచి ఇక్కడ సాయుధ పోరాటానికి సహాయం చేశారనుకున్నవాళ్ళని, కమ్యూనిస్టులు అని అనుమానం వచ్చినవాళ్ళని వేల మందిని కాల్చి చంపారు, మిగతావారిని చిత్రహింసలు పెట్టారు. వేలాదిమంది మహిళలను, బాలికలను మానభంగాలు చేశారు. సుమారు మూడు వేల గ్రామాలలో ఇటువంటి దురాగతాలు 1948 నుంచి 1952 దాకా జరిగాయి.
పోలీస్ చర్య అనబడే మిలిటరీ చర్య, ఆక్రమణ జరిగాక అది నిర్వహించిన జనరల్ చౌధురీ మిలిటరీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. బయట దేశాలనీ, ముఖ్యంగా ఐరాస ను మోసం చేస్తూ ఏ అధికారాలు లేని నిజాంకు రాజ్‌ప్రముఖ్ అన్న ఒక పేరు పెట్టి, అధికారిక పత్రాలన్నీ ఆయన సంతకంతోనే పంపేవారు. అయితే ఈ మిలిటరీ చర్య వేరే దేశం మీద చేయటం ఐరాస నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి అఖండమైన తెలివితేటలు గల అప్పటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి సూచనతో హైదరాబాద్ రాష్ట్రం మీద జరిగిన దాడి ‘పోలీస్ చర్య’గా అధికార పత్రాల్లో పేరు మార్చారు. అయితే అబద్ధపు దుప్పటి కప్పినా నిప్పులాంటి నిజం నుంచి వెలువడే పొగలు కప్పలేరు కదా! అందుకని ఈ విషయాన్ని అంతం చెయ్యటానికి ఖాదీ అబ్దుల్ గఫార్, యూనస్ సలీం సభ్యులుగా పండిట్ సుందర్ లాల్ కమిషన్‌ను నియమించాడు నెహ్రూ. అది అధికార కమిటీ కాకుండా ముస్లిం వ్యతిరేకి, సర్దార్ పటేల్ అడ్డుపడగలిగాడు.
అప్పటి ప్రముఖ జర్నలిస్టు అయిన యూనస్ సలీం భారతీయ సైనికుల దురాగతాలను నెహ్రూకి వివరించగా వాటిని అణచిపెట్టడానికి మాత్రమే ఈ కమిటీని ఉపయోగించాడు నెహ్రూ. అయితే మిలిటరీ చర్య సందర్భంగా వేలాది ముస్లింల హత్యలు, ఆడవారి మీద అత్యాచారాలు, ఇతర దురాగతాలు వివరంగా కమిటీలోపొందుపరిచాడు సుందర్‌లాల్. నలభై వేల మంది ముస్లింలను ఊచకోత కోశారని, లూటీలు, గృహ దహనాలు, ఆస్తుల విధ్వంసం, మానభంగాలు-సైనికులు చెయ్యని దుష్కార్యం లేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే దేశంలో ప్రధానమంత్రి పదవి, విదేశాలలో ప్రతిష్ఠ తనకు ఎక్కువ అనుకున్న నెహ్రూ ఈ నివేదికను జాగ్రత్తగా తన లైబ్రరీలోనే దాచిపెట్టాడు. 2013లో దాదాపు 65 ఏండ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది ఈ నివేదిక. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవలసిన సత్యాలు ఏమిటంటే నెహ్రూ కాలం నుంచీ వేరే దిక్కు లేక తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసే దాకా కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నాయి. ఒక అన్యాయపు చర్యతోనే భారతదేశంలో కలపబడిన తెలంగాణ తర్వాత దశాబ్దాల పాటు ఇటువంటి అన్యాయాలు ఎదుర్కొంటూనే ఉంది.