ఈ మధ్య యశోద దవాఖానలో పరీక్షలు చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను పలకరించడానికి పోయిన. అక్కడ మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు ఉన్నరు. దాదాపు ఇరవై నిముషాలు వారితో కూర్చున్న. యూరియా కోసం తెలంగాణవ్యాప్తంగా రైతుల ఆందోళన వార్తలు పేపర్లలో వచ్చినయి అంతకుముందు రోజు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘కేంద్రం ఇస్తే, మేము ఇస్తాం’ అని వాళ్ల పార్టీ గుర్తు ఎత్తేసిన అంశం; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న గోదావరి-కృష్ణా నీళ్ల దోపిడీ; రేవంత్‌రెడ్డి అసమర్థత చర్చకు వచ్చినయి.
కేసీఆర్‌కు పనే విశ్రాంతి. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యలపై మీటింగ్ పెట్టిన వార్తలు మనందరం చూసినం కదా! గతం గుర్తు తెచ్చుకుంటూ ఇట్లా అన్నరు ఆయన:“ఇక్కడ మన ప్రభుత్వం ఉన్న సమయంలోనే మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉండింది. యూరియా కోసం అక్కడ కాల్పులు జరిగినయి. మన దగ్గర సమస్య రావొద్దని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ గారికి ఫోన్ చేసిన. ‘మీకు ఎంత కావాలో అంత ఇస్తం, రైల్వే ర్యాక్‌ల సమస్య రాకుండా చూసుకోండి’ అని అన్నరాయన. ర్యాక్‌ల కేటాయింపు చూసేది మన కోదాడకు చెందిన ఒక అధికారి అని తెలుసుకుని, పిలిపించిన. ఆయనకు ఎదురేగి ఆహ్వానించి, భోజనం పెట్టించి, మన ఎరువుల అవసరం గురించి చెప్పిన. ‘మీకు ఎన్ని ర్యాక్‌లు కావాలంటే అన్ని ఇస్తం సార్’ అని అన్నడు ఆ అధికారి. అన్నట్లే, సంపూర్ణ సహకారం అందించిండు. మనకు ఎరువులు తక్కువ పడ్డ సందర్భం లేదు. ఇపుడు చూడండి పరిస్థితి” అన్నరు కేసీఆర్.
‘బీజేపీ నాయకుడైన కేంద్ర మంత్రి అనంతకుమార్ మధ్యప్రదేశ్‌లో తమ సొంత పార్టీ ప్రభుత్వానికి ఎందుకు సహకరించలేదో?’ అనడిగిన నేను. ‘రాష్ర్టాల ముఖ్యమంత్రులు, అధికారులు ముందుచూపుతో ప్రజల అవసరాల ప్రాతిపదికగా పనులు చేస్తే, ప్రణాళికలు వేస్తే, సమయానికి ఇండెంట్స్ పెడితే, ఆ ఇండెంట్ ఉంటే, ఎవరైనా దిగివస్తరు. రాష్ట్రంలో అంతా చేతులు ఎత్తేస్తే, కేంద్రానికి ఏమి పట్టింది?’ అన్నరు కేసీఆర్ గంభీరంగా!
అనంతరం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి, బనకచర్ల ఆంధ్రా అఘాయిత్యం-రేవంత్ దాసోహం గురించి చర్చకు వచ్చింది. ఏయే ప్రాజెక్టు ఎన్ని టీఎంసీలు, ఎంత ఆయకట్టు, ఎంత ధాన్యరాశి, ఎన్ని నిధులు, ఎంత పని, ఎక్కడ ఆగినయి.. అన్నీ ఆయనకు కరతలామలకం! తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి యేరు పరిచయం ఆయనకు, నోళ్లు తెరిచిన అన్ని బీళ్లు ఆయన గుండెలో ముళ్లు! అలాంటి పాలకుడు కదా కావాలి మనకు! గల్లీలోనూ, ఢిల్లీలోనూ తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాటలు, వ్యూహాలు, లాబీయింగ్, కార్యాచరణ నిండుగా, మెండుగా ఉన్నవారు కదా సీఎంగా ఉండాలి. మరి ఇప్పటి పాలకుడు? నల్లమల ఏ రాష్ట్రమో తెల్వదు; బనకచర్ల పేరూ సరిగ్గా పలకలేడు; దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఎరుకలేదు. ప్రజలంటే అసహనం, వారి పక్షాన నిలబడ్డవారంటే మంట, కెమెరా ఉన్నా లేకపోయినా ఒకే రకపు వాచాలత, గల్లీ అయినా, ఢిల్లీ అయినా ఒకటే తీరు వ్యక్తిత్వం!
చంద్రబాబును చూస్తే చాలు రేవంత్‌కు నిలువెల్లా వణుకు. ఆయన మాటలో, చేతలో, నడకలో, నడతలో బాబు పట్ల వీరవిధేయత! మొన్న ఢిల్లీలో చూసినం కదా ‘సార్ సార్ ప్లీజ్ ప్లీజ్’ అంటూ ప్రాధేయపడటం. వంగి రమ్మంటే, పాకుతూ వచ్చే వారిపట్ల ఎవరికైనా ఎలాంటి భావముంటది? అందుకే రేవంత్‌ను బాబు దిలాసాగా ఆడిస్తున్నరు, కులాసాగా తమ పనులు చక్కబెట్టుకుంటున్నరు!
బాబు అడగకముందే మన నీళ్లను రేవంత్ ధారాదత్తం చేసిండు. మీకు గుర్తుంది కదా! ‘మాకు ఎన్వోసీ ఇచ్చి మీకు కావాల్సినవి తీసుకుపోండి’ అన్నడు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశపు అజెండాలో మొదటి అంశమే బనకచర్ల అన్నది ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. రేవంత్, ఆయన బ్యాచ్ ఎంతగా దాయాలని చూస్తున్నా.. ప్రముఖ పత్రికల ఆంధ్ర ఎడిషన్లు, ఆలిండియా రేడియో, ఆంధ్ర మంత్రి బనకచర్లపై కమిటీ వేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేసిన్రు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు చేష్టలుడిగి చూస్తున్నరు. బనకచర్ల వల్ల మనకు నష్టం లేదంటూ తీర్పు ఇస్తున్నరు. బనకచర్లకు పర్యావరణ అనుమతులను కేంద్రం నిరాకరించినా, బీజేపీ ఎంపీలకు పట్టదు. అంటే, ఏపీ-తెలంగాణ చదరంగంలో రెండువైపులా కూర్చొని ఆడుతున్న చంద్రబాబు చేతిలో కాంగ్రెస్-బీజేపీ పావులుగా మారినయన్నది గోడపైన రాత అంత స్పష్టం!
ఇప్పుడు బాబుకు, కేసీఆర్‌కు తేడా చూడండి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు నీళ్లు ఇద్దామన్నరు కేసీఆర్. బేసిన్లు, భేషజాలు లేవు అన్నరు. ఆ మాటలు అలవోకగా అనలేదాయన. తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు, మరెందరివో సలహాలు, సూచనలు విన్నరు. డేటా, స్టాటిస్టిక్స్, క్షేత్ర పరిజ్ఞానం, అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ అంటే ప్రాణం పెట్టేవారితో కూర్చున్నరు. ఆయనకు స్పష్టమైన విజన్ ఉంది, మిషన్ ఉంది. కాబట్టే, గోదావరి మిగులు జలాలను కృష్ణాలో లోటు భర్తీ చేయడానికి; ఎత్తిపోసిన గోదావరి నీళ్లతో తెలంగాణ బీళ్లను తడపడానికి, నదీమార్గం గుండా రాయలసీమకూ ఇవ్వడానికి స్థిరచిత్తంతో 2016 మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ప్రతిపాదించిన్రు. ఇంత లోతైన విషయాలు అర్థంకాని రేవంత్‌రెడ్డి ఒకవైపు ఆంధ్ర నీళ్ల దోపిడీకి ఆద్యుడు కేసీఆర్ అంటూ పైపై విమర్శలు చేస్తూ, లోపల దోపిడీకి తెరదీసిండు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేసీఆర్ ఆలోచిస్తరని ఆయన శత్రువులు కూడా నమ్మరు!
తెలంగాణ బిడ్డ, విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్, కృష్ణా-గోదావరి జలాల విషయంలో అథారిటీ అనదగ్గ శ్రీధర్‌రావు దేశ్‌పాండే.. కేసీఆర్ ప్రతిపాదిత ‘తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుస్తూ రాయలసీమకు నీళ్లు’ అంశాన్ని ఇట్లా విడమరిచి చెప్పిన్రు.
విజ్ఞులారా! రెండు రాష్ర్టాలు గోదావరి అదనపు జలాలను తమకు ప్రయోజనకరమైన రీతిలో వినియోగించుకునే అవకాశం ఉండగా, అట్లా ససేమిరా వద్దని, తెలంగాణ నోట్లో మట్టికొట్టి బనకచర్ల ద్వారా నీటిని మొత్తం కొల్లగొట్టే చంద్రబాబు దుస్తంత్రానికి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్-బీజేపీ వంతపాడటం అత్యంత విషాదకరం. మనం మేలుకోకపోతే నిండా మునుగుతం.
నీళ్లు-నిధులు-నియామకాలు అంటూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను; వాటితో సంబంధం లేని ప్రాంత ద్రోహుల, ప్రాంతేతర దోపిడీదారుల చేతిలో నాశనం కానివ్వొద్దు. గల్లీలో డాంబికాలు పోతూ ఢిల్లీలో పిల్లిలా మారి మోదీ-చంద్రబాబుకు దాసోహమైన రేవంత్‌కు బుద్ధి చెప్పాల్సిందే. ఇంకో మార్గం లేదు! తెలంగాణ ఆజన్మ శత్రువులైన కాంగ్రెస్-బీజేపీ-టీడీపీల ముప్పేట దాడిని అడ్డుకోవాల్సిందే. అప్పుడే మనం మనగలిగేది.
జై తెలంగాణ!
– శ్రీశైల్‌రెడ్డి పంజుగుల 90309 97371