రాష్ట్రంలో పరిపాలన కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. మంత్రుల అంతర్గత కుమ్ములాటలతో యంత్రాంగం స్తంభించిపోయింది. పట్టులేని ముఖ్యమంత్రి, కట్టుతప్పిన మంత్రులు ప్రజా సమస్యలు గాలికివదిలేసి జుట్టు జుట్టు పట్టుకుంటున్నారు. మూటలు, వాటాల కుమ్ములాటలు శృతి మించి పాకాన పడుతున్నాయి. క్యాబినెట్ సమావేశాల్లోనే మంత్రులు సీఎంకు తాఖీదులిస్తున్నారు. తన అనుకూల మీడియా ద్వారా సీఎం మంత్రులకు తలంటు పోస్తున్నారు. సమష్టి బాధ్యతతో వ్యవహరించాల్సిన అమాత్యులు బాధ్యత మరిచి ముఠా తగాదాలతో తలో దారిగా విడిపోతున్నారు. మంత్రులు, మంత్రులతో కుస్తీలు పడుతున్నారు.
మంత్రుల్లో రెడ్డి వర్సెస్ బీసీ, బీసీ వర్సెస్ దళిత ఘర్షణలు శృతిమించుతున్నాయి. మంత్రుల మాట అధికారులు వినడం లేదు. అధికారుల గోడు మంత్రులకు పట్టడం లేదు. పాలసీ గైడెన్స్ లేదంటూ అధికారులు పనిచేయడం లేదు. పని చేసేవారిని వీఆర్ఎస్ తీసుకోవాలని, కేసులు, కమిషన్లు, విచారణలంటూ వేధిస్తున్నారు. వాటాల పంచాయితీతో విసిగిపోయి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ కోరడం ప్రస్తుత యంత్రాంగ పరిస్థితికి అద్దం పడుతున్నది. తన శాఖలో, అలాగే ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు ఓ మంత్రి ఆర్టీఐ దరఖాస్తు చేయడం వింతల్లోకెల్లా వింత. అయోమయం, గందరగోళం మధ్య రాష్ట్రంలో పరిపాలన అటకెక్కింది. అరాచకం వీరంగం వేస్తున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ చేవ లేని, చేతకాని పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని అసలుకే ఎసరు తెస్తుంటే అధిష్ఠానం కలవరపాటుకు గురవుతున్నది. మూటలు మోయించడం కాంగ్రెస్కు మొదటినుంచీ పరిపాటే. ఇప్పుడా మూటలకు ఎక్కడ ముప్పు వస్తుందోనని తంటాలు పడుతున్నది. మొన్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం పదవిలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి తప్పు చేశామని వాపోతే, నిన్న పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సీఎంగా రేవంత్ ఫెయిల్ అని తేల్చేశారు. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముందు సీఎం కూర్చున్న తీరు తెలంగాణ ఆత్మగౌరవం ఎలా గాయపడిందో మీడియాలో సందడి చేస్తున్నది. చరిత్రలో అత్యంత విఫల సీఎంగా రేవంత్ మిగిలిపోతారనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు సీఎంలను మార్చడంలో చేయి తిరిగిన అధిష్ఠానం చాలాకాలం తర్వాత మళ్లీ అదే బాట పడుతుందా? కుర్చీలాటకు తెరతీస్తుందా?
కేసీఆర్ సమర్థ పాలనలో సుమారు దశాబ్దకాలం పాటు అభ్యున్నతిని సాధించి కళకళలాడిన తెలంగాణ రెండేండ్ల కాంగ్రెస్ అసమర్థ పాలనలో మూలకు పడే రోజులు వచ్చాయి. ఈ దుస్థితికి ఎవరు బాధ్యులనేది అసలు ప్రశ్న. ఇప్పుడు అధిష్ఠానం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందనేది పక్కనపెడితే కాంగ్రెస్కు రాష్ట్రంలో శాశ్వతంగా నూకలు చెల్లిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సర్కార్ పెద్దల అవినీతి, బంధుప్రీతి, మూటలు, వాటాల కొట్లాటలతో ప్రజలకు విసుగు వస్తున్నది. ప్రజలు మరో మూడేండ్లు ఈ పాలన భరించక తప్పదా? అని నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. అవకాశం దొరికితే ఓటుతో వేటు వేయాలని ఎదురుచూస్తున్నారు. అందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాంది పలుకుతుందని చెప్పవచ్చు.