బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ దుస్సాహసానికి పాల్పడింది. లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో దేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చేందుకు యత్నించి, పరాభవం ఎదుర్కొన్నది. సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల బలం లేకపోయినా బిల్లును ప్రవేశపెట్టింది. ఓ వైపు తమిళనాడు, బెంగాల్ వంటి కీలక రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, సభలో బలం లేకుండానే నాటకీయ పరిణామాల మధ్య రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం మోదీ ప్రభుత్వ అతి విశ్వాసమనే చెప్పాలి.
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం తీవ్రమైన ఓటమి ఎదురైంది. బీజేపీ నేతలు, కేంద్రం పెద్దలు రాజకీయ చతురత ప్రదర్శించామని భావిస్తున్నారు కానీ, చతికిలపడ్డారు. లోక్‌సభలో పరాభవంతో కమలం నేతలకు కంటిమీద కునుకు కరువైంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రతిపక్షాలను ప్రధాని నరేంద్రమోదీ ఇరుకున పెట్టారని బీజేపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పునర్విభజన ద్వారా లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కి పెంచి, మహిళలకు 33% శాతం రిజర్వేషన్లు కల్పిస్తామటే విపక్షాలు అడ్డుకున్నాయని ఎదురుదాడికి దిగుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉన్నది. మహిళా రిజర్వేషన్లకు, పునర్విభజన బిల్లుకు సంబంధమేంటో, వాటిని కలిపి ఎందుకు ప్రవేశపెట్టారో కేంద్రానికే స్పష్టతలేదు.
దేశంలోని ప్రజల ఆలోచనలు పసిగట్టగలిగే తెలివి తమకే ఉన్నదని గొప్పలు చెప్పుకొనే బీజేపీ గుంపు.. మహిళా రిజర్వేషన్ల వంటి భావోద్వేగంతో కూడిన వ్యవహారంపై ఎందుకు రెచ్చగొట్టినట్టు? చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న దశాబ్దాల డిమాండ్‌తో చెలగాటం ఆడటం ఎంత వరకు సబబు? అనేది అంతుపట్టని వ్యవహారం. అయితే చట్ట సభలను దిగజార్చడం గురించి బీజేపీ కోటరీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. బీజేపీ బృందం, ఆ భావజాలంతో కూడిన గ్రూపు మేధావి వర్గాన్ని ద్వేషిస్తాయి. కానీ ఇప్పుడు ఆ మేధావి వర్గం తొలుతగా ప్రస్తావించిన అంశం తోకనే పట్టుకొని పోవడం వింతల్లోకెల్లా వింత. శుక్రవారం సభలో పాలకపక్షం రెండు విలువైన ప్రాబల్య అంశాలను కోల్పోయింది. ఒకటి చర్చను నడిపించడంలో ప్రధాని విఫలమయ్యారు. విముఖంగా ఉన్నవాళ్లను తమవైపు తిప్పుకొలేకపోయారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకురాలేని ఏకపక్ష నాయకుడిగా మిగిలిపోయారు. దేశంలో భిన్నాభిప్రాయాలతో నిలువుగా చీలిపోయిన వారిని కూడగట్టే ‘గురువు’ కాలేకపోయారు. సభలో ఒక పార్టీకి చెందిన నాయకుడిగా ప్రవర్తించినట్టుగానే స్పష్టమవుతున్నది. అత్యంత కీలకమైన అంశాలపై తన మాటలకు విశ్వసనీయతను ఉన్నట్టు నిరూపించుకోలేకపోయారు. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని సంబంధం లేని పునర్విభజన వ్యవహారంతో ముడిపెట్టి, గంభీరమైన హామీలు ఇస్తే ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు.
పార్లమెంట్ వెలుపల సభల్లో అతిశయోక్తితో కూడిన ప్రసంగాలు చేసే ప్రధాని మోదీ, సభలో సభ్యుల నమ్మకాన్ని కూడగట్టడం అంత సులభం కాదని గుర్తించాలి. ఎన్నికల సభలో అత్యంత కఠినంగా కొంతమంది తరఫున పక్షపాత వైఖరితో మాట్లాడటానికి, లోక్‌సభలో దేశం గొంతుకగా వ్యవహరించడానికి తేడా ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు మాత్రమే కాకుండా మొత్తం ఎన్డీఏ కూటమి పాలకులే అబద్ధపు బృందం అని తిరస్కరణకు గురైనట్టు ముద్ర వేసుకున్నది. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కూడా ప్రశ్నార్థకంగానే మారింది. ఎందుకంటే నారీ శక్తి వందన అధినియం బిల్లు 2023 సెప్టెంబర్‌లో ఆమోదం పొందింది. కానీ ఆ బిల్లుపై కేంద్రం మీనామేషాలు లెక్కిస్తూ కూర్చున్నది. ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకొచ్చే ముందు రోజు రాత్రి అంటే గురువారం రాత్రి 9:55 గంటలకు గెజిట్‌లో నోటిఫై చేసింది. ఇది ఎంతటి దారుణమైన విషయం, కీలక బిల్లుపై ఇలాంటి నిర్లక్ష్య ధోరణి అనుసరించి, ప్రజల్లో విశ్వసనీయత ఎలా సాధిస్తారు? అలాంటి వారిని ఎవరైనా ఎలా నమ్ముతారు?
మరో విషయం ఏంటంటే మహిళా బిల్లు విషయంలో ఎన్డీఏయేతర పార్టీల మద్దతు కూడగట్టడంలో కేంద్రం విఫలమైంది. ఇంతటి ముఖ్యమైన విషయంలో కలుపుకొనిపోకపోవడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామం అని భావించవచ్చు. ప్రతిపక్ష పార్టీలు తమ ఓట్లను కాపాడుకున్నాయి. ఇప్పుడు మోదీ అంటే ఓటమి ఎరుగని నాయకుడు అని బీజేపీ వర్గాలు ఎప్పుడూ ప్రచారం చేస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ ప్రచారం అంతా ఉత్తదేనని స్పష్టమవుతున్నది. శుక్రవారం లోక్‌సభలో జరిగిన పరిణామాలు బీజేపీ, కూటమి పార్టీలకు ప్రతికూలమైనవి.
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో న్యాయవ్యవస్థ మరింత ప్రభావవంతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత నెలకొన్నది. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను మరింత అప్రమత్తంగా నిర్వర్తించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. దశాబ్దకాలంగా చూసుకుంటే పాలన, న్యాయవ్యవస్థల మధ్య సమతూకం దెబ్బతిన్నదనే విమర్శలు ఉన్నాయి. పరిపాలన ఆధిపత్యం విస్తరిస్తూపోవడం, అధికార పార్టీ రాజకీయ తప్పిదాలను న్యాయవ్యవస్థ ఉపేక్షించడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందనే అభిప్రాయం ఉన్నది. ఫలితంగా అధికారపక్షం వారి అహంకారం, మితిమీరిన ఆత్మసంతృప్తి రాజ్యాంగ విలువలను ఎగతాళి చేశాయి. దేశ రాజకీయాల్లో రానున్న కొన్ని వారాలు అత్యంత కీలకం. లోక్‌సభలో ఎదురుదెబ్బ తిన్న అధికారపక్షం తమిళనాడు, బెంగాల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ తమదే గెలుపు కావాలని అలవాటు పడినవారు పరాభవాన్ని ఇష్టపడరు. పోలింగ్ జరిగే వరకు కూడా ఎలాంటి ఎత్తుగడలైనా వేసి గెలవడానికి యత్నిస్తారు. ఇందుకోసం అన్ని రకాల ప్రయోగాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం మోదీ సర్కార్ పట్ల అనుకూల ధోరణి చూపుతున్న నేపథ్యంలో న్యాయవ్యవస్థ అప్రమత్తత కీలకం. అలాగే ఓట్ల లెక్కింపు రోజు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.
ఇక 2026 ఏప్రిల్ 17.. దేశ చరిత్రలో ఒక సుదినం అని భావించవచ్చు. రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని చూసే శక్తుల పరిమితులను గుర్తుచేసిన రోజు అది. పాలక పక్షాల ఏకపక్ష వైఖరులను అడ్డుకొని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌కు శుక్రవారం జరిగిన ఓటింగ్ మూడు రోజులు ఆలస్యంగా అర్పించిన జయంతి నివాళి అనుకోవచ్చు. మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన బిల్లులను అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు విజయం సాధించాయి. మోదీ నేతృత్వంలోని పాలక పక్షాన్ని ఓడించాయి. దేశ రాజకీయాల్లో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మోదీ సర్కార్ ఇప్పటికైనా రాజ్యాంగ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకోవాలి.
(వ్యాసకర్త: సీనియర్ ఎడిటర్; ‘ది వైర్’ సౌజన్యంతో)
– హరీశ్ ఖరే