రిఫరీ అంటే ఆటలో తటస్థంగా ఉండాలి. ప్రత్యర్థుల మధ్య సమాన దూరాన్ని పాటించాలి. నిష్పాక్షికంగా వ్యవహరించాలి. అప్పుడే అది ఆట అనిపించుకుంటుంది. రిఫరీపై ఏ మాత్రం సందేహాలు కలిగినా ఫలితంపై నమ్మకాలు సడలిపోతాయి. అప్పుడది ఆట కాదు, తొండాట అవుతుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం అచ్చంగా తొండాట ఆడుతున్నదనే ఆరోపణలు అంతకంతకూ మిన్నుముట్టుతున్నాయి. ఒకప్పుడు టి.ఎన్.శేషన్ వంటి నిప్పులాంటి నిర్భీత అధికారుల నాయకత్వంలో ఈసీ కీర్తిప్రతిష్ఠలు ఉగ్గడించాయి. ప్రభుత్వాలను, పార్టీలను ఆయన గడగడలాడించిన సందర్భాలను కథలుకథలుగా చెప్పుకొంటారు. కానీ, ప్రస్తుత పరిస్తితుల్లో ఆ కీర్తి మసకబారుతున్నదనడం నిజానికి చిన్నమాటే అవుతుంది. మరీ ముఖ్యంగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరు అనుమానాస్పదం అవుతున్నది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) లేదా ప్రత్యేక ఉధృత సవరింపుల పేరిట చేపట్టిన ఓటరు సర్వే దేశవ్యాప్తంగా దుమారమే సృష్టించింది. 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించడం, అందుకు సరైన కారణాలు చూపలేకపోవడం ఇందుకు కారణం. చివరికి సుప్రీంకోర్టు ముందు చేతులు కట్టుకుని, వివరణలు ఇచ్చుకునే స్థాయికి ఒక రాజ్యాంగ సంస్థ పరిస్థితి దిగజారడం ఏ మాత్రం అభిలషణీయం కాదు. ఇది దేశ ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నది. ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేస్తే స్పష్టత ఇవ్వాల్సిందిపోయి ఎన్నికల సంఘం పెద్దలు రాజకీయ సవాళ్లకు తెగబడటం మరీ విడ్డూరం.
సమస్య కేవలం బీహార్తోనే మొదలు కాలేదు. మహారాష్ట్రలో, అంతకుముందు హర్యానాలో జరిగిన ఎన్నికల అవకతవకలపై ఎందరికో అనుమానాలున్నాయి. ఏపీలో వైసీపీ కూడా ఈ వ్యవహారంపై ఆరోపణలు చేస్తున్నది. మహారాష్ట్రలో పార్లమెంటు ఎన్నికల్లో శివసేన కూటమికి ఎక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయి. ఆ తర్వాత కొద్దికాలానికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తారుమారై బీజేపీ కూటమి గెలిచింది. పోలైన ఓట్ల సంఖ్య విషయంలో ఈసీ కుప్పిగంతులపై చాలానే చర్చ నడిచింది. ఇక హర్యానాలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని సర్వేలు ఘోషించాయి. కానీ, ఆశ్చర్యకరమైన రీతిలో బీజేపీ గెలిచింది. ఈ అనుమానాలను నివృత్తి చేయడంలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైంది. ఈ ఘటనల క్రమం పాలక పక్షం చేతుల్లో ఎన్నికల సంఘం పావుగా మారిందనే విమర్శలకు తావిస్తున్నది. మోదీ సర్కారు హయాంలో జరిగిన రెండు ప్రధానమైన మార్పులు ఎంతో కీలకమైనవని చెప్పాలి. అందులో మొదటిది ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియను దెబ్బతీయడం. ఎంపిక కమిటీలో ప్రధాని, విపక్ష నేతతో పాటుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఆ సూచనను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం సీజేఐ స్థానంలో హోంమంత్రిని చేర్చింది. ఇది ఎంపిక ప్రక్రియను నీరుగార్చటం తప్ప మరోటి కాదు. ఇందుకు సవరణ చట్టం తేవడం గమనార్హం. రెండోది, అదే సవరణ చట్టంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లపై సివిల్, క్రిమినల్ విచారణలు జరుపకుండా రక్షణ కల్పించడం. అంటే ప్రభుత్వం తమకు ఇష్టమైన వ్యక్తులను నియమించుకోవచ్చు, వారు ఏం చేసినా కేసులు పెట్టొద్దని చెప్పడం ద్వారా ప్రభుత్వం ఏం సాధించింది? ఈ వివాదాస్పద సవరణపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించిన ఘనత మోదీ సర్కారుకే దక్కింది.
రాజకీయ పార్టీల సందేహాలను నివృత్తి చేయడంలో ఎన్నికల కమిషన్ దారుణంగా విఫలమవుతుండటం కనిపిస్తూనే ఉంది. ఫలితంగా సంస్థ విశ్వసనీయతను కోల్పోతున్నది. కేంద్రంలోని సర్కారుకు ఈసీ ‘జీ హుజూర్ జో హుకుం’ అన్నట్టుగా తయారైంది. కేంద్ర పాలకపక్షం అవసరాలకు అనుగుణంగా పలు దశల పోలింగ్ తేదీలు ప్రకటించడం నుంచి ఈవీఎంల వాడకంపై పట్టుబట్టడం దాకా ఈసీ వ్యవహార శైలి స్వతంత్ర ప్రతిపత్తిని సూచించేలా ఉండటం లేదు. ఈవీంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఎందరో సాంకేతిక నిపుణులు రుజువు చేసినా వాటిని వదులుకునేందుకు ఈసీ ససేమిరా అనడం తెలిసిందే. ఇటీవల హర్యానాలో సర్పంచ్ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలను సుప్రీంకోర్టు తెప్పించుకుని రిజిస్ట్రార్ ద్వారా ఓట్ల లెక్కింపు జరిపింది. గతంలో ఓడిన వ్యక్తి ఈ తనిఖీలో గెలిచినట్టు రుజువు కావడం ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నది. సూచనలైనా, ఫిర్యాదులైనా పాలక, విపక్షాల మధ్య వివక్ష పాటించడం ఈసీకి పరిపాటిగా మారింది. కారు గుర్తును పోలిన గుర్తులను అనుమతించవద్దని బీఆర్ఎస్ ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఈసీ తగిన రీతిలో స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనం. గుర్తుల పితలాటకంతో ఓట్లు అటుఇటు కావడం తెలిసిందే. ఫిర్యాదులు చేస్తే ఎలాంటి తప్పులూ జరగలేదని బుకాయించడం, ఆపై ఫిర్యాదు చేసినవారే తప్పులు రుజువు చేయాలని దబాయించడం, అఫిడవిట్లు సమర్పించాలని బెదిరించడం ఈసీకి అలవాటుగా మారింది. ఓటర్ల జాబితాను సంస్కరించాల్సిందే. ఎవరూ కాదనరు. కానీ, అంతకుముందు ఎన్నికల సంఘాన్ని సంస్కరించాల్సి ఉంది.