కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వరంగంలో ఉన్న ఉద్యోగాలూ ఊడిపోతున్నాయి. ఉపాధి లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నది. కేంద్రం వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ప్రజలు ఉద్యమించక మానరు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల వ్యవసాయ, పారిశ్రామికరంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వ్యవసాయ భూములను కార్పొరేట్ల స్వాధీనం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. పంటలకు సరైన ధరలు ప్రకటించకపోవడం, ఎరువుల ధరల నిర్ణయాన్ని పరిశ్రమలకు అప్పగించడం, సేద్యపు ఖర్చులు పెరిగే విధానాలను అమలుచేయడం, సేద్యాన్ని నష్టదాయకంగా మార్చి సాగు నుంచి రైతులను వైదొలగేలా చేయడం, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయడం వంటి చర్యలను కేంద్రం చేపట్టింది. దీంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కుదించుకుపో యి నిరుద్యోగం పెరుగుతూ వస్తున్నది. అత్యధిక మం దికి ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయంలో అవసరం లేని, మితిమీరిన యాంత్రీకరణ వల్ల ఉపాధి తగ్గుతున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను కూడా కేంద్రం 150 నుంచి 80 రోజులకు తగ్గించింది. ప్రభుత్వరంగ పరిశ్రమల మూసివేత, అమ్మకం వల్ల లక్షల మంది పట్టణ కార్మికులు నిరుద్యోగులుగా మారిపోతున్నారు.
దేశ జనాభాలో 90 కోట్ల మంది పనిచేసే వయ స్సు గలవారే. వారిలో యువత శాతం అత్యధికం. వీరందరికీ ఉపాధి కల్పిస్తే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. కేంద్రంలోని బీజేపీ నాయకులకు ఉపాధి కల్పనపై స్పష్టమైన విధానం లేకపోవడం వల్ల యువశక్తి నిర్వీర్యమై దేశాభివృద్ధి తిరోగమనంలో సాగుతున్నది. ఉద్యోగాలు, ఉపాధి లేకపోవడం వల్ల కొందరు యువతీయువకులు నిరాశ, నిస్పృహకు లోనై చెడు మార్గంలో పయనిస్తున్నారు. ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో ఎన్డీయే కూటమి వాగ్దానం చేసింది. నిరుద్యోగులు ఆ వాగ్దానాన్ని నమ్మి ఎన్డీయేను గెలిపించారు. కానీ ఆ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వా త ఉద్యోగాలు కల్పించకపోగా, ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్నది.
గడిచిన 6 నెలల కాలంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కానీ గత ఆరు నెలల్లో దేశ వ్యాప్తంగా వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండటం వల్ల నిరుద్యోగం తగ్గినట్లు కనిపించింది. కానీ ఈ పనులు ముగియగానే నిరుద్యోగం పెరిగిందన్న సంగతి కేంద్రం గుర్తించకపోవడం శోచనీయం.
నాలుగేండ్లుగా పెరుగుతున్న నిరుద్యోగం మోదీ ప్రభుత్వ ప్రగతి ప్రచారంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. సుమారు 1.86 కోట్ల మంది భారతీయులు నిరుద్యోగులుగా ఉన్నారు. మరో 3.93 కోట్ల మంది చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకీడుస్తున్నారు. బిజినెస్ టుడే నివేదిక, నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధి సర్వే ప్రకారం… దేశంలో 2016-17 లో సాధారణ నిరుద్యోగ స్థితి శాతం 6.1 శాతంగా ఉన్నది. ఇదే సమయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో పురుష నిరుద్యోగ యువత శాతం 17.4 శాతం నుంచి 18.7 శాతానికి పెరిగింది. 2019-20లో జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నివేదికలో 2021 జనవరి-మార్చి త్త్రెమాసికంలో పట్టణ నిరుద్యోగం 9.3 శాతంగా ఉన్నది. పార్లమెంటులో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2018-20 మధ్య కాలంలో నిరుద్యోగం, అప్పుల కారణంగా దేశంలో 25 వేల మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు. 2020లో కరోనా సంక్షోభం కారణం గా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని ప్రభుత్వం తెలిపింది.
గడిచిన 6 నెలల కాలంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కానీ గత ఆరు నెలల్లో దేశ వ్యాప్తంగా వ్యవసాయ పను లు ఎక్కువగా ఉండటం వల్ల నిరుద్యోగం తగ్గినట్లు కనిపించింది. కానీ ఈ పనులు ముగియగానే నిరుద్యోగం పెరిగిందన్న సంగతి కేంద్రం గుర్తించకపోవడం శోచనీయం. నిరుద్యోగం పెరగడానికి ప్రధాని మోదీ చెప్పిన కారణం కూడా చాలా విచిత్రంగా ఉన్నది. యువత చదువు కోవడం వల్ల; పిల్లలను, వృద్ధులను చూసుకోవడం కోసం వలస కార్మికులు పనులు మానేయడం వల్లే నిరుద్యోగం పెరిగిందని ఆయన చెప్పడం హాస్యాస్పదం. ఇది సమస్యను పక్కదారి పట్టించడమే. సామ్రాజ్యవాద, బూర్జువా, భూస్వామ్య వర్గ ప్రయోజనాలు కాపాడే మోదీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య ను పరిష్కరించదు, పరిష్కరించలేదు. భూ సంస్కరణల ద్వారా భూ పంపిణీ చేయకుండా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించలేరు. దేశీయ పారిశ్రామిక విధానాలు అమలు చేయకుండా, ప్రజల అవసరాలు తీర్చే పరిశ్రమలతో పాటు, వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి లభించదు. దీన్ని కేం ద్ర ప్రభుత్వం గమనించి దిద్దుబాటు చర్య లు చేపట్టాలి. కేంద్రం ఈ పని చేయకపోతే గ్రామాలు, పట్టణాలకు చెందిన నిరుద్యోగు లు ఉపాధి కోసం ఉద్యమించాలి.
(వ్యాసకర్త: రైతు కూలీ సంఘం కార్యవర్గ సభ్యుడు, ఏపీ)
బొల్లిముంత సాంబశివరావు
98859 83526