ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదానీకి అగ్రరాజ్యమైన అమెరికా అరెస్టు వారంట్ జారీచేయడంతో ఇండియాలో రాజకీయ దుమారం చెలరేగింది. భారతదేశంలో విద్యుత్తు ప్రాజెక్టుల కోసం రాజకీయ పెద్దలకు ముడుపులు ఇచ్చారనీ, పెట్టుబడుల సేకరణ సందర్భంగా నిజాలు దాచిపెట్టారనేవి అదానీపై ప్రధానమైన ఆరోపణలు. ఇవి అమెరికా చట్టాల ప్రకారం నేరాలనీ, వీటి ఉల్లంఘన ఎక్కడ జరిగినా తమ న్యాయవ్యవస్థ వదిలిపెట్టదనీ అమెరికా అంటున్నది. భారత కుబేరుడిని ప్రపంచ పెద్దన్న అమెరికా జైలుకు పంపేందుకు సిద్ధమైందన్న వార్త మన దేశంలో సహజంగానే ప్రకంపనలు సృష్టించింది. స్టాక్‌మార్కెట్ కుప్పకూలింది.
ముఖ్యంగా అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఒక్కరోజులోనే కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అదానీ విషయమై పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు హంగామా చేస్తున్నాయి. ఇది టీ కప్పులో తుఫానులా సమసిపోతుందా? లేక పైకప్పులు ఎగరగొట్టే వాయుగుండమవుతుందా? అనేది ఇదమిద్ధంగా చెప్పలేం. మోదీ ప్రాపకంలోనే వివాదాస్పద పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ కుబేరుడయ్యారన్న సంగతి మరువరాదు. ఏది ఎలా ఉన్నప్పటికీ అదానీ గ్రూప్ సంస్థలకు హిండెన్‌బర్గ్ ఉదంతాన్ని మించిన నష్టాన్ని అమెరికా అరెస్టు వారంటు కలిగించిందని చెప్పక తప్పదు.
అదానీ ప్రతిధ్వనులు మన రాష్ట్రంలోనూ వినిపించాయి. అదానీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో నిప్పులు చెరుగుతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే అదానీకి ఎర్రతివాచీ పరచి స్వాగతిస్తుండటం విస్మయం కలిగించింది. ఇప్పుడు అమెరికా వారంటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదానీతో జరిపిన సయ్యాటలపైకి అందరి దృష్టి మరోమారు మళ్లింది. వివాదాస్పద పారిశ్రామికవేత్త రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఇదివరకూ ప్రయత్నాలు జరుపకపోలేదు. రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ కోసం అదానీ గ్రూప్ వస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించడం తెలిసిందే. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అధిష్ఠానం వైఖరికి భిన్నంగా అదానీపై ప్రత్యేకాభిమానం ప్రదర్శించడం విడ్డూరం.
ప్రస్తుత వివాదాలు ముసురుకున్న వేళ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మసమర్థనలో పడింది. అందులో భాగంగానే అదానీ ఇచ్చిన విరాళంపై యూటర్న్ తీసుకున్నది. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హడావుడిగా ప్రకటించారు. అదానీతో సహా ఏ సంస్థ నుంచీ తెలంగాణ సర్కారు విరాళాలు తీసుకోలేదని మీడియా సాక్షిగా వివరణ ఇచ్చుకున్నారు. అధిష్ఠానం అల్టిమేటంతోనే ఆయన అందుకు సిద్ధమయ్యారనేది తెలుస్తూనే ఉంది. అంతటి ఇరకాటంలోనూ విపక్ష పార్టీపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నాలు ఆపలేదు. కేంద్ర ప్రాజెక్టులను బీఆర్ఎస్ ఖాతాలో వేసేందుకు విఫలయత్నం చేసి అభాసుపాలయ్యారు. దావోస్‌లో అదానీ గ్రూప్‌తో అట్టహాసంగా కుదుర్చుకున్న వేల కోట్ల రూపాయల ఒప్పందాలను రద్దు చేసుకుంటారా? దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ వివరణ ఇచ్చుకోవాల్సి ఉన్నది.