2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యా విధానం (తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ-2026)ను అమల్లోకి తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిత్యం గొప్పలు చెప్తున్నా ఆచరణలో అనుసరిస్తున్న తీరుపై మాత్రం కోటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గ ఉపసంఘంతో కలిపి ఇప్పటికే మూడు కమిటీలను ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసినా.. ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యహారిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావునిస్తున్నది.
విద్యా కమిషన్ నివేదికపై ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మీడియా, సోషల్ మీడియా వేదికలుగా సర్కార్ తీరును నిపుణులు ఎండగడుతున్నారు. దీంతో నివేదికలోని అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆందోళన చెందవద్దని, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కమిటీ ఛైర్మన్ కే కేశవరావు మీడియా ముందు చెప్పారు. నివేదికలో లోపాలను పరోక్షంగా ఆయన అంగీకరించారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వం అనుసరిస్తున్న భిన్న ధోరణులు, విభిన్న మాటలు, సమయానుసారం అందని నివేదికలను లోతుగా, నిశితంగా పరిశీలిస్తే నూతన విద్యావిధానం రూపకల్పన పేరుతో జరుగుతున్న ఆర్భాటపు ప్రచారంలో డొల్లతనం అర్థమవుతున్నది.
జాతీయ విద్యావిధానం (ఎన్ఇపీ- 2020) ఆధారంగా కొత్త విద్యా విధానాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. ఇందులో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం బోధన, 12వ తరగతి వరకు పాఠశాల విద్య, డిజిటల్ లెర్నింగ్ హబ్స్, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత వంటి అనేక అంశాలతో సంస్కరణలను తెచ్చి, వాటిని వచ్చే విద్యాసంవత్సరం (2026-27) నుంచి అమలు చేస్తామని ప్రకటనలు చేస్తున్నది. ఇందులో భాగంగా 2024 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో విద్యా వ్యవస్థ సంస్కరణలు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
ఈ కమిటీ అధికారులతో ఓ సారి సమావేశమైంది. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం ఏయే అంశాలను రాష్ట్రంలో అమలు చేయవచ్చో చెప్పాలని అదేశించింది. ఆ తర్వాత మళ్లీ ఉపసంఘం సమావేశాలు, సమీక్షలు నిర్వహించలేదు. 2024 సెప్టెంబర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని విద్యా కమిషన్ ఛైర్మన్‌గా సర్కార్ నియమించింది. ఈ కమిటీ ఇటీవల ఓ నివేదిక ఇవ్వగా దానిపై రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే. 2025 ఆగస్టులో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ-2026 పేరుతో కే కేశవరావు అధ్యక్షతన ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేసింది. 2025 అక్టోబర్ 30లోపు నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కానీ ఇప్పటికీ నివేదిక సమర్పించలేదు.
ఇలా మూడు కమిటీలు ఎక్కడ కూడా సమన్వయంతో పనిచేసినట్టుగా కనిపించడం లేదు. ఇటీవల ఆకునూరి మురళి నివేదికకు సీఎం రేవంత్‌రెడ్డి వత్తాసు పలికారు. నివేదికలోని అనేక అంశాలు అసంబద్ధంగా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మేధావి వర్గం, ప్రతిపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెట్టాయి.
విద్యాకమిషన్ నివేదికపై అభ్యంతరాలు వస్తున్నాయని, ఆ సిఫారులపై తనకు కూడా సందేహాలున్నాయని కేశవరావు వ్యాఖ్యానించారు. ఇదేం తుది నివేదిక కాదని, తన వద్ద ఉన్న 11 సబ్ కమిటీలలో అది ఒకటి అని, అభ్యంతరకరమైనవి తొలగిస్తామని చెప్పుకొచ్చారు. అంటే ఆకునూరి మురిళి ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అనే విషయంపై ప్రస్తుతం విద్యా రంగంలో వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి.
ప్రభుత్వం విద్యా కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండానే మొన్నటి బడ్జెట్లో పబ్లిక్ సూళ్ల పేరిట పద్దులు కేటాయించింది. ఇలా ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరిస్తూ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో గందరగోళం సృష్టిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం అసలు ఏ విధానం అమలులో ఉంటుందో, పల్లె బడులు ఉంటాయా? మూసేస్తారా? ఉపాధ్యాయుల జీతాలు తగ్గుతాయా? పాఠశాల, ఇంటర్ విద్య విలీనమవుతాయా? బోర్డు పరీక్షలు రద్దు అవుతాయా? ఉపాధ్యాయ శిక్షణా కోర్సులు ఏర్పాటు చేయాలా? వద్దా? మధ్యాహ్న భోజన కార్మికులను కొనసాగిస్తారా? పిల్లలను ఎప్‌సెట్‌కు పంపాలా? వద్దా? ఇలాంటి అనేక సంశయాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన ప్రభుత్వం మాత్రం మూడు కమిటీలతో బంతాట ఆడుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పష్టమైన వైఖరిని సమాజం ముందు పెట్టాలి. ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సుదీర్ఘ చర్చలు జరపాలి. నిజానికి వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన పాలసీని అమల్లోకి తెస్తామని ప్రభుత్వం చెప్తున్నది. మరో రెండునెలల్లో కొత్త విద్యాసంత్సరం ఆరంభం కాబోతున్నది. మరి కొత్త విధానం, సిలబస్ తయారీ, ఉపాధ్యాయులకు శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, తల్లిదండ్రులకు అవగాహన ఎప్పుడు పూర్తి చేస్తారు? పాలసీ తయారు కాలేదు. ప్రభుత్వం పంతానికి పోయి అడ్డగోలు పాలసీని విద్యార్థులపై రుద్దితే అందులోని లోపాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తాయి.
– ప్రకాశ్‌రావు 80966 77022