రెండేండ్ల పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో ప్రణాళిక రచించింది. ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త జిమ్మిక్కుకు తెరతీసింది. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల కార్యాచరణను ప్రకటించింది. ఈ కార్యక్రమం జూన్ 12 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. పాత పథకాలు రద్దు చేసి, కొత్త పథకాల కోసం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన హస్తం నేతలు.. కొత్తగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. కాంగ్రెస్ అధ్వాన పాలనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంటే, అది పట్టించుకోకుండా, కలెక్టర్లపై కస్సుబుస్సుమంటూ సీఎం రేవంత్‌రెడ్డి చిందులు తొక్కడం విడ్డూరం.
ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేని కాంగ్రెస్ పాలక పెద్దలు ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కార్యక్రమం సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో అధికారులను ప్రజల్లోకి పంపించేందుకు ప్లాన్స్ రూపొందించారు. జరుగుతున్న కసరత్తుపై పలు ప్రశ్నలు వ్యక్త మవుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాం శంగా మారాయి.
కలెక్టర్లే ప్రభుత్వానికి కండ్లు, చెవులు అని, వారు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజల కష్టాలు అర్థం కావని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలేమీ సక్రమంగా అమలు చేయకుండా కలెక్టర్లను ఆడిపోసుకోవడం ఏంటో అర్థం కావడంలేదు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు, రేషన్ కార్డుల మంజూరు వంటి విషయాల్లో రాజకీయ జోక్యం పరాకాష్టకు చేరుతున్నది. కలెక్టర్ల వద్ద వేలాది ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతుంటే, ప్రభుత్వం చెప్పే ‘ప్రజా పాలన’ ఎవరి కోసం? అనేది సామాన్యుడి ప్రశ్న. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం జరుగుతున్నది. కలెక్టర్ల వద్ద కుప్పలుగా ఫిర్యాదులు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే ఇండ్లు కేటాయిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పెద్ద స్కామ్‌లా మారింది. నిజమైన పేదలు శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. వారు దరఖాస్తు పట్టుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదే సందర్భంలో రాజకీయ పలుకుబడి ఉన్నవారు, పక్కా ఇండ్లు ఉన్నవారు మళ్లీ లబ్ధిదారులుగా ఎంపికవుతున్నారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకపోతే, ఈ 99 రోజుల ప్రణాళిక కేవలం అనర్హులకు పట్టాభిషేకం చేసినట్టవుతుంది.
రేవంత్ సర్కార్ ప్రకటించిన 99 రోజుల ప్రణాళికను ‘సినిమా డ్రామా’ అని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హరీశ్‌రావు కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా చేయలేని పనిని కేవలం 99 రోజుల్లో ఎలా పూర్తిచేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆగ్రహాన్ని హరీశ్ వ్యాఖ్యలు ప్రతిబింబించాయి.
ధరణి సమస్యలు, భూసేకరణ, ఇసుక మాఫియా వంటి జఠిలమైన సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించడం సాధ్యమేనా? ఒకవైపు ఖజానా ఖాళీగా ఉన్నదని చెప్తూ, మరోవైపు ఇన్ని పథకాలకు నిధులు ఎలా సమకూరుస్తారు? ప్రతిపక్షాల విమర్శలను కేవలం రాజకీయంగా చూడకుండా, ప్రణాళికల్లోని లోపాలను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడారు. ‘ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు’ అంటూ కోప్పడ్డారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందితే, అది ప్రభుత్వ పెద్దల వైఫల్యం అని కూడా ముఖ్యమంత్రి గుర్తించాలి. ఆ నష్టం కేవలం ప్రభుత్వానికే కాదు, యావత్తు రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది. ప్రజా సేవకులుగా కాకుండా, అధికార పార్టీ కార్యకర్తలుగా అధికారులు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది.
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అక్కడ మధ్యాహ్న భోజనం నాణ్యత అధ్వానంగా మారింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అధికారులు పట్టించుకోవడంలేదు. నిరంతర నిఘా, అవినీతిరహిత పాలన ఉన్నప్పుడే మార్పు సాధ్యం. ఔట్సోర్సింగ్ నియామకాల్లో జరిగే అక్రమాలు, రేషన్ కార్డుల ఏరివేతలో జరిగే రాజకీయ వివక్ష సామాన్యుడిని నిరాశకు గురిచేస్తున్నాయి. పేదవాడికి కావాల్సింది అద్భుతమైన ప్రకటనలు కాదు, ఆకలి తీర్చే రేషన్ కార్డు, తలదాచుకోవడానికి ఒక ఇల్లు, పిల్లల చదువుకు భరోసా. కానీ, క్షేత్రస్థాయిలో ఈ విజ్ఞప్తులు అధికారుల చెవికి చేరడం లేదు.
99 రోజుల ప్రణాళిక కేవలం ఎన్నికల ముందు ఇచ్చే ఒక ‘బూస్ట్’ లా కాకుండా, పరిపాలనలో శాశ్వత సంస్కరణలకు నాంది కావాలి. కలెక్టర్లు కేవలం అధికార పార్టీకి మొగ్గు చూపడం ఆపి, రాజ్యాంగం పట్ల, ప్రజల పట్ల జవాబుదారీగా ఉండాలి. లేకపోతే విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ఇది మరో విఫల ప్రయోగంగా, కాలయాపన తంతుగా మిగిలిపోతుంది.
ధరణి సమస్యలు, భూసేకరణ, ఇసుక మాఫియా వంటి జఠిలమైన సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించడం సాధ్యమేనా? ఒకవైపు ఖజానా ఖాళీగా ఉన్నదని చెప్తూ, ఇన్ని పథకాలకు నిధులు ఎలా సమకూరుస్తారు? ప్రతిపక్షాల విమర్శలను కేవలం రాజకీయంగా చూడకుండా, ప్రణాళికల్లోని లోపాలను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
-వెంకగారి భూమయ్య ,98485 59863