నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’కి యాభై ఏండ్లు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారతదేశంలో ప్రజల స్వేచ్ఛను, హక్కులను హరించి అరాచక పాలనకు తెరలేపిన విషాద ఘట్టం అది. ఆ జ్ఞాపకాలను దేశం ఇంకా మరిచిపోలేదు. నేడు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేరుతో కాంగ్రెస్ నడిపిస్తున్న దుర్మార్గపూరిత పాలన కూడా నాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకుతెస్తున్నది.
అలహాబాద్ హైకోర్టు తన ఎన్నికను రద్దు చేసిన నేపథ్యంలో అంతర్గత భద్రత సాకుతో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. 21 నెలల పాటు పౌరుల స్వేచ్ఛ స్వాతంత్య్రాలు, హక్కులన్నీ హరించివేయబడ్డాయి. నాటి ప్రతిపక్ష నాయకులు జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజపేయి వంటి ఎందరో నాయకులను ‘మెయింటనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్’ (మీసా) కింద జైలుపాలు చేసింది. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలిరోజు నుంచి అక్రమ కేసులు, కమిషన్లు, విచారణలు, అరెస్టుల పేరుతో ప్రతిపక్ష నేతలను జైలుపాలు చేసే అప్రజాస్వామిక కార్యాచరణను మొదలుపెట్టింది.
‘ఆనాటి రోజులు మళ్లీ తెస్తాడు’ అంటూ రేవంత్ పేరుతో ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడినట్టే కనిపిస్తుంది. 50 ఏండ్ల క్రితం దేశ ప్రజల మనసులో తీరని గాయం చేసిన ఎమర్జెన్సీని తెలంగాణలో మళ్లీ తీసుకువచ్చింది.
పత్రికా స్వేచ్ఛ విషయంలో ఆనాటి ఎమర్జెన్సీ కంటే అన్యాయమైన పరిస్థితులు నేడు తెలంగాణలో దాపురించాయి. స్వయంగా ముఖ్యమంత్రి సొంత గ్రామంలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడే అందుకు ఉదాహరణ. చివరికి సామాజిక మాధ్యమాల్లోనూ తమ వాక్ స్వాతంత్య్రాన్ని హరించివేసే తీరుగా వేలమందిపై కేసులు పెడుతూ నియంతృత్వ పోకడను అవలంబిస్తున్నది. ఎమర్జెన్సీలో మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీస్ కస్టడీ హింసలు సాధారణంగా కనిపించాయి. నేడు తెలంగాణలోనూ తమ భూములు గుంజుకోవద్దని నిరసన తెలిపిన లగచర్ల గిరిజన రైతన్నల చేతులకు బేడీలు వేసి జైళ్లలో బంధించింది.
తాజాగా మరో అడుగు ముందుకువేసి భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో పోడు భూముల కోసం నిరసన
తెలిపిన ఆడబిడ్డల బట్టలు చింపిన దుశ్శాసన పర్వం తెలంగాణలో ఉన్న ఎమర్జెన్సీని కండ్లకు కడుతున్నది. నాడు ఇందిరా గాంధీ ప్రోద్బలంతో పేట్రేగిపోయిన ప్రభుత్వ అధికారుల మాదిరే నేడు పోలీసు అధికారులు చేస్తున్నారనిపిస్తున్నది.
దేశ పౌరులు తమ హక్కుల పట్ల జాగ్రత్తగా లేకుంటే ఎమర్జెన్సీ వంటి దుర్మార్గపు పరిస్థితులు వస్తాయి. కలసికట్టుగా పోరాడితే నియంతల నియంతృత్వ పాలనకు అంతం పలుకవచ్చన్న ఒక గొప్ప పాఠాన్ని నాటి ఎమర్జెన్సీ నేర్పింది. యాభై ఏండ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తన డీఎన్ఏలో ఉన్న ఎమర్జెన్సీ లక్షణాన్ని వదులుకోలేకపోతున్నది. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం పేరుతో తెలంగాణలో నేడు కొనసాగిస్తున్న ఎమర్జెన్సీ రోజులను తెలంగాణ సమాజం ముమ్మాటికీ గుర్తుంచుకుంటుంది. రైతుల చేతులకు బేడీలు వేయడాన్ని, పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపడాన్ని, జర్నలిస్టుల గొంతు నొక్కడాన్ని, పేట్రేగిపోతున్న ప్రభుత్వ అరాచకాలు, ఎనుముల వారి కుటుంబ పాలన, అవినీతి స్కాంలను తెలంగాణ తన చరిత్రలో లిఖించుకుంటుంది. అయితే 21 నెలల ఎమర్జెన్సీ తర్వాత ప్రజా పోరాటాల వల్ల ఇందిరాగాంధీ లాంటి నియంత పాలనకు చరమగీతం పాడినట్టుగానే తెలంగాణ ప్రజలూ కాంగ్రెస్ సర్కారు అరాచకాలను, అణచివేతలను అడుగడుగునా ప్రశ్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కచ్చితంగా బొందపెడుతారు.
– డా.మాణిక్య మహేష్
ముదిరాజ్