నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ముదిగొండ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల అన్నం తినలేక వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి కేజీబీవీ విద్యార్థినులు రోడ్డెక్కారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులంలో అభంశుభం తెలియని పదేండ్ల చిన్నారి విగతజీవిగా మారింది. ఏ పేపర్ తిరగేసినా, ఏ న్యూస్ చానల్ పెట్టినా రాష్ట్రంలో ఇలాంటి వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు లేకుండా పొద్దు పొడవడం లేదు, విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు వినపడనిదే పొద్దుగూకడం లేదు.
కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఆగమైపోతున్నది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి ఏలుబడిలో తెలంగాణ విద్యారంగం భ్రష్టుపట్టిపోతున్నది. విద్యాశాఖను తన వద్దనే అట్టిపెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి దాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ హయాంలో గురుకులాలంటే ఒక బ్రాండ్. గురుకులాల్లో సీట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో పిల్లల తల్లిదండ్రులు సిఫారసులు చేయించినా అప్పట్లో సీటు దొరకని పరిస్థితి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. కాంగ్రెస్ సర్కారు రాకతో గురుకులాల తలరాత తలకిందులైంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫుడ్ పాయిజన్ జరగని గురుకులం లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతేడాది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ కారణంగా శైలజ అనే విద్యార్థిని చనిపోవడం ఇంకా మన కండ్లముందు కదలాడుతూనే ఉన్నది. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకులంలో పాముకాటు కారణంగా విద్యార్థి మృతిచెందిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఆ పాత గాయాలు పచ్చిగా ఉండగానే మళ్లీ విద్యార్థుల మరణాలు కొనసాగుతుండటం విచారకరం. 20 నెలల కాంగ్రెస్ పాలనలో 93 మంది విద్యార్థులు మరణించడం పరిస్థితికి అద్దం పడుతున్నది.
విద్యార్థులు చనిపోతున్నా రేవంత్ రెడ్డి సర్కారుకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం అందుకు నిదర్శనం. కేసీఆర్ హయాంలో గురుకులాలు ఓ వెలుగు వెలిగాయి. విద్యారంగానికి, ప్రత్యేకించి గురుకులాలకు కేసీఆర్ సర్కారు బడ్జెట్లో కేటాయించిన నిధులే అందుకు ప్రధాన కారణం. 2022-23లో కేసీఆర్ ప్రభుత్వం గురుకుల సమాఖ్యలకు రూ.3,000 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నింటికీ సమప్రాధాన్యం ఇచ్చింది. కానీ, ప్రస్తుత రేవంత్‌రెడ్డి సర్కారు గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా బడ్జెట్ కేటాయింపులు చేయకపోగా, ఇంకా తగ్గించడం శోచనీయం. కొన్ని గురుకుల సొసైటీలకు ఇప్పటివరకు పూర్తిస్థాయి నిధులను విడుదల చేయడం లేదు. కమీషన్ పాలన, విధాన వైఫల్యాలు విద్యార్థుల పాలిట శాపాలుగా మారుతున్నాయి.
తెలంగాణ మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను నీతి ఆయోగ్, కేంద్ర విద్యాశాఖతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కొనియాడాయి. ఉత్తమ విద్యా పద్ధతిగా ప్రశంసించాయి. ప్రత్యేకించి తెలంగాణలో అమలవుతున్న ఇంగ్లీష్ మీడియం గురుకులాల విధానాన్ని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలని, అన్ని రాష్ర్టాలు అనుసరించాలని సూచించాయి. అంతేకాదు అవార్డులు, రివార్డులతో సత్కరించాయి. వేనోళ్ల కొనియాడిన తెలంగాణ ఆదర్శ మోడల్‌ను కాంగ్రెస్ సర్కారు ఆగం పట్టిస్తున్నది.
టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సరిపడా లేకపోవడంతో బోధన కుంటుపడింది. రాష్ట్రవ్యాప్తంగా 40,000కు పైగా టీచర్లు, వార్డెన్లు, ఏఎన్ఎంలు, కిచెన్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల మూలంగా మహబూబాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లోని కొన్ని గురుకులాల్లో 15-20 శాతం డ్రాపౌట్లు నమోదయ్యాయి. గురుకులంలో భయానక పరిస్థితులను చవిచూసిన ఈ పిల్లలు మళ్లీ చదువుకునే అవకాశమే ఉండదు. ఇది వారి భవిష్యత్తును చిదిమేయడమే.
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్‌గాంధీ ఆశయ సాధన దిశగా తమ ప్రభుత్వం సాగుతున్నదని రేవంత్‌రెడ్డి పదే పదే చెప్తుంటారు. కానీ, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం నిర్బంధ విద్యను అమలు చేయాలి. కానీ, గురుకులాల్లో దుర్భర పరిస్థితులు కల్పించి ఈ హక్కును ఉల్లంఘిస్తున్నారు.
ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం భద్రత, భోజనం, ఆరోగ్య పరిరక్షణ కల్పించాలి. కానీ, అవేవీ అమలు కావడం లేదు. దళిత, గిరిజిన విద్యార్థుల విద్య పట్ల వివక్ష కొనసాగుతున్నది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఇది నేరం. ఆర్పీడబ్ల్యూడీ చట్టం-2016 ప్రకారం దివ్యాంగ పిల్లలకు పలు నిబంధనలు అమలు చేయాల్సి ఉండగా, కనీసం పట్టించుకోవడం లేదు. ఇది ముమ్మాటికీ సర్కారు నిర్లక్ష్యమే.
కేసీఆర్ హయాంలో వెలుగులు విరజిమ్మిన గురుకులాలపై ఇప్పుడు చీకట్లు కమ్ముకున్నాయి. విద్యాలయాలు కోలుకోలేని విధంగా ధ్వంసమయ్యాయి. కేసీఆర్ హయాంలో నమోదైన విజయగాథల్ని చూసి గురుకులాల్లో తమ పిల్లల్ని చేర్పించిన తల్లిదండ్రులు నేడు రేవంత్ పాలనలో కన్నీటి పర్యంతమవుతున్నారు.
‘మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా భ్రష్టు పట్టించిన గురుకులాలను బాగు చేయకుండా.. యంగ్ ఇండియా స్కూల్ పేరిట రేవంత్ ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్నది. ఒక్కో స్కూల్‌ను రూ.200 కోట్లతో నిర్మిస్తామని ఊదరగొడుతున్నది. ఆ రూ.200 కోట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకుల కమీషన్ల కోసమేనన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ విధానంలోనే లోపాలున్నప్పుడు, మంచి చేయాలనే సంకల్పం లేనప్పుడు, చిత్తశుద్ధి కరువైనప్పుడు ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఏం లాభం?
– వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్