డిస్కంల అప్పులు భారంగా పరిణమిస్తున్నాయని భావిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఉచిత విద్యుత్తును పొందుతున్న 28,90,686 వ్యవసాయ కనెక్షన్లు, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి తదితర ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన 429 కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయి, సెవరేజ్ బోర్డు 60 కనెక్షన్లు, మిషన్ భగీరథ 276 కనెక్షన్లు, మొత్తం 28,91,451 కనెక్షన్లను కలుపుకొని మూడో డిస్కం దిశగా అడుగులు ముందుకువేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న దక్షిణ, ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థలను బలోపేతం చేసేందుకే కాకుండా, వాటికి ఆర్థిక పరిపుష్ఠిని కల్పించడం కోసమేఈ మూడో డిస్కం నిర్ణయం తీసుకున్నట్టు కూడా పేర్కొంటున్నది.
1956 కంపెనీల యాక్ట్ ప్రకారం లైసెన్స్ అనుమతి పొందడానికి సంబంధిత కంపెనీ ఆదాయ, వ్యయాల అంచనాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఉచిత విద్యుత్ పొందుతున్న వ్యవసాయ వినియోగదారులు, ప్రభుత్వ ఆధీనంలోని ఎత్తిపోతల పథకాల, హైదరాబాద్ తాగునీటి సరఫరా కనెక్షన్లతో కూడుకొని ఎలాంటి ఆదాయ వనరుల్లేని మూడో డిస్కం లైసెన్స్ జారీ విషయంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. డిస్కంల లోటును క్రాస్ సబ్సిడీ ద్వారా పూడ్చుకోవడానికి వెసులుబాటు కల్పించే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు లేని నూతన డిస్కం కేవలం ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులైనటువంటి గ్రాంట్లు, రుణాల మీద ఆధారపడి మాత్రమే మనుగడ సాగించాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్తు సవరణ బిల్లు-2025’పై ముసాయిదా విడుదల చేసింది. అందుకుగాను దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు సంస్థలను, ఇతర భాగస్వామ్య పక్షాలను తమకున్న అభ్యంతరాలను తెలపవలసిందిగా అక్టోబర్ 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నవంబర్ 30వ తేదీనే గడువు కూడా ముగిసింది. ఆ నోటిఫికేషన్లో బహుళ కంపెనీలకు లైసెన్స్‌లు జారీచేసే విధానంతో పాటు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వరంగ విద్యుత్తు సంస్థల నెట్‌వర్క్‌ను వాడుకోవడానికి అనుమతించింది. విద్యుత్తు చట్టంలోని సెక్షన్లు 14, 42 (1)లను సవరణ చేయడం కూడా ఆ నోటిఫికేషన్లో ప్రధానమైన అంశం. ఇవేకాకుండా మరో ఏడెనిమిది సవరణలను ఆ చట్టంలో పొందుపరిచారు. క్రాస్ సబ్సిడీలను తొలగించనుండటం మరొక ప్రధాన విషయం. బహుళ లైసెన్సింగ్ విధానం, క్రాస్ సబ్సిడీ తొలగింపు పట్ల తెలంగాణ విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న వేలమంది ఉద్యోగులు, వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిస్కంలను బలోపేతం చేసేందుకు అవసరమయ్యే ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపట్టడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాకపోతే దేశంలో ఎక్కడాలేని విధంగా ఏరియాతో సంబంధం లేకుండా కేవలం క్యాటగిరీ ఆఫ్ కనెక్షన్స్ ఆధారంగా డిస్కంను ఏర్పాటుచేయడమే అసలు సమస్య. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనే విషయంలో పలువురి నుంచి పలురకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత రంగాలతో కొనసాగుతున్న వ్యవసాయ కనెక్షన్లతో పాటు సాగు, తాగునీరుకు సంబంధించిన కనెక్షన్లను మాత్రమే కలిగి ఉండే కొత్త డిస్కం మనుగడ ఎలా సాధ్యమవుతుందన్నదే ప్రధాన ప్రశ్న. అంతేకాదు, ఒకే ప్రాంతంలో ఉన్న భిన్న డిస్కంలకు సంబంధించిన వినియోగదారుల సేవలు ఎలా సాధ్యపడుతాయి? వాటి నిర్వహణకు, వినియోగదారులకు సేవలందించడానికి, నూతనంగా దరఖాస్తు చేసుకునే వ్యవసాయ వినియోగదారులకు కనెక్షన్ ఇవ్వడానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, లైన్లు వేయడం, నిర్వహించడం ఎలా సమన్వయం చేయగలరో అంతుచిక్కడం లేదు. అంతేకాదు, ఇప్పుడున్న వ్యవస్థకు తోడుగా సమాంతరంగా ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు కూడా. ఎలాంటి ఆదాయ వనరులుండని మూడో డిస్కం వినియోగదారులకు ఎలా సేవలందిస్తుంది?ఇక ఉద్యోగుల జీతభత్యాలను ఎవరు భరిస్తారు?
మన రాష్ట్రంలో వ్యవసాయ ఫీడర్ల విభజన జరుగలేదు. గృహ, వ్యవసాయ వినియోగదారులకు సంయుక్త లైన్లు, సబ్స్టేషన్లు, టాన్స్ఫార్మర్లున్న ప్రస్తుత క్లిష పరిస్థితుల్లో ఉద్యోగుల మధ్యన పని విభజన ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి ఎన్నో క్లిష్టమైన సందేహాలను పరికించి చూస్తే మూడో డిస్కం ఆచరణలో సాధ్యపడదనే విషయం అవగతమవుతున్నది.
ఇక మూడో డిస్కం ఆలోచన వెనుక ఉన్న ప్రధా న కారణం అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంల ఆర్థిక పరిస్థితి అని. ఈ అప్పుల్లో ఉన్న నిజా నిజాలను ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యుత్ రంగంలోని జెన్కోకు రూ.31,528 కోట్లు, ట్రాన్స్‌కోకు రూ.8,429 కోట్లు, దక్షిణ డిస్కంకు రూ.38,092 కోట్లు, ఉత్తర డిస్కంకు రూ.22,131 కోట్లు వెరసి మొత్తం అప్పు లు 1,00,180 కోట్లుగా పేర్కొంటున్నారు. 2023 నాటికి రూ.80 వేల కోట్లుగా ఉన్న అప్పులు జూలై 2025 నాటికి లక్ష కోట్లు దాటినట్టుగా చెప్తున్నారు.
గత దశాబ్దకాలంలో జెన్కో తన ఆధీనంలో 4000 మెగావాట్ల యాదాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను, 800 మెగావాట్ల కేటీపీఎస్ ఏడో దశ యూనిట్‌ను, 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్లాంట్లను నిర్మించింది. యాదాద్రిలో ఈ నెల 10వ తేదీన మూడో యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానించి నాలుగు యూనిట్లను పూర్తిచేసినట్టయింది. 5వ యూనిట్ ఒకట్రెండు నెలల్లో అందుబాటులోకి రావచ్చు. కేటీపీఎస్ 7వ యూనిట్‌ను కేవలం 48 నెలల రికార్డు కాలంలో పూర్తిచేసిన ఘనత జెన్కోది. పై పవర్ ప్లాంట్లను పూర్తిచేయడానికి సుమారు రూ.60 వేల కోట్లపైనే వెచ్చించింది.
ఇక ట్రాన్స్‌కో అప్పులను రూ.8,429 కోట్లుగా చెప్తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మంచిర్యాల సమీపంలో ఈహెచ్‌టీ టవర్ ఒకటి కూలిపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వారం రోజులకు పైగా చీకట్లో మగ్గింది. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేని దుర్భరకాలంలో తెలంగాణ మొత్తంగా కేవలం ఆరు 400 కేవీ సబ్స్టేషన్లు ఉంటే ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నవి 30. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి 220 కేవీ సబ్స్టేషన్లు 52, 132 కేవీ సబ్స్టేషన్లు 75 నిర్మించుకున్నాం. అంతేకాకుండా ఈహెచ్‌టీ లైన్లను 16,378 కిలో మీటర్ల నుంచి 28,131 కిలోమీటర్లకు, టాన్స్ఫర్మేషన్ సామర్థాన్ని 14,973 ఎంవీఏ నుంచి 38,941 ఎంవీఏకు పెంచుకున్నాం. ఎక్కడికక్కడ రింగ్‌మేన్ సిస్టం ద్వారా కరెంట్ పోకుండా ఉండటానికి ట్రాన్స్మిషన్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నాం. అందుకుగాను రూ.50 వేల కోట్లకు పైనే ఖర్చుచేసుకున్నాం.
ఇక డిస్కంల విషయానికి వస్తే… రైతులకు 7 గంటల కరెంటు అని చెప్పుకొనే పగలు 3 గంటలు, అర్ధరాత్రి తర్వాత వచ్చే మరో 3 గంటల కరెంటు నుంచి 28,90,686 వ్యవసాయ కనెక్షన్లకు నిరంతరాయ కరెంట్‌ను ఇచ్చే స్థితికి చేరుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంత రం 33/11 కేవీ సబ్స్టేషన్లు 1070.. పవర్ ట్రాన్స్ఫార్మర్లు 3,98,302… అదనంగా విద్యుదీ కరణ జరిగింది. అడిగిందే తడవుగా నెల రోజుల్లోపే రైతులకు కనెక్షన్ ఇచ్చే పరిస్థితికి చేరుకు న్నాం. రూ.30 వేల కోట్లకు పైగా వెచ్చించి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను సుస్థిరపరచడం ఒక ఎత్తయి తే, ఉచితంగా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వ డం మరొక ఎత్తు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రమూ సాధించని ప్రగతి ఇది.
డిస్కం అప్పులు రూ.60,224 కోట్లుగా చెప్తున్నారు. డిస్కంలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలు రూ.45,398 కోట్లు. అందులో ఎత్తిపోతల పథకాల ద్వారా 22,926 కోట్లు, మెట్రో వాటర్ సైప్లె అండ్ సీవరేజీ బోర్డు రూ.7084 కోట్లు, మిషన్ భగీరథ నుంచి రూ.5,972 కోట్లు రావాల్సి ఉన్నది. మున్సిపాలిటీ బకాయిలు రూ.2,383 కోట్లు, కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి రూ.909 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.5,665 కోట్లు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రూ.459 కోట్లు బకాయి పడ్డట్టు అంచనా. ఈ బకాయిలను ప్రభుత్వ శాఖల చెల్లించినట్టయితే డిస్కంల అప్పులు చాలావరకు తీరిపోతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి దేశంలో తెలంగాణ తలసరి ఆదాయం అగ్రగామిగా ఉండటానికి, జీడీపీ పెరుగుదల రేటు గణనీయంగా పెరడానికి విద్యుత్తు రంగం పోషించిన పాత్ర అద్వితీయమైనదిగా చెప్పవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్తు సవరణ బిల్లు-2025’ను తీసుకువస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మూడో డిస్కం ప్రతిపాదన చేస్తున్నది. అంటే.. రాష్ట్ర విద్యుత్తు సంస్థలను, ప్రత్యేకించి పంపిణీ సంస్థల (డిస్కం)ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు వేస్తున్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైన మనం చర్చించుకున్న అభివృద్ధి కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ సంస్థల ద్వారా మాత్రమే సాధ్యమైందనే విషయాన్ని గుర్తించాలి. ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదనే చారిత్రక వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా అత్యంత సమర్థవంతమైన విద్యుత్తు సంస్థలుగా గుర్తింపు పొందిన జెన్కో, ట్రాన్స్‌కో డిస్కంలకు ప్రభుత్వరంగంలోనే చేయూతనివ్వాలి. వాటిని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై కచ్చితంగా ఉన్నది.
(వ్యాసకర్త: విద్యుత్‌రంగ విశ్లేషకులు)
-తుల్జారాంసింగ్ ఠాకూర్
7893005313