Congress-BJP | 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సామాజిక మాధ్యమాలలో ఆ ఫలితాల మీద చర్చలు నడుస్తున్న తీరును చూస్తుంటే నిర్వేదం వస్తోంది. నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలియని పరిస్థితి! 2023లో తెలంగాణలో ఏర్పడిన పరిస్థితే 2024 శాసనసభ ఎన్నికల తర్వాత ఏపీలో కూడా ఏర్పడింది. ఇక రాజకీయ విశ్లేషకులు, జ్యోతిష్యులు (ఇద్దరికీ పెద్ద తేడా లేదు లెండి!) తమ తమ అద్భుత ప్రసంగాలతో అలరించేస్తున్నారు.
వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్ పార్టీ కంటే, అనేక కేసుల్లో ఇరుక్కొని జైల్లో ఉన్న చంద్రబాబు (కూటమి)కు ఇంకా 14 సీట్లు ఎక్కువ ఎలా వచ్చాయి? ఇప్పుడు జగన్ ఏమి చేయాలి? ఏం చేస్తాడు? సీట్లు ఎక్కువ ఎందుకు రావు? పగలు పడ్డ ఓట్ల కంటే రాత్రంతా కూర్చుని 140 నియోజకవర్గాలలో ఈవీఎంలలో 100 శాతం ఓటింగ్ జరిగేటట్టు చేస్తే ఎవరైనా గెలుస్తారు! ఈ లెక్కన 140 + 11 = 151 నియోజకవర్గాలలో జగన్ గెలిచి ఉంటాడు. లేకపోతే గెలిచిన నాయకుల పోస్టర్లను ప్రజలు ఎందుకు చింపుతున్నారు? పేడ కొడుతున్నారు? ఆలోచించండి.
ఇక కేంద్ర పరిస్థితి! తను బీజేపీ తరపున 250 సీట్లు తెచ్చుకుంటే ఇంకొక 150 అయోధ్యలో తను చెయ్యి పట్టుకొని తీసుకెళ్లిన బాలరాముడు తెచ్చిపెడతాడు, 400 గెలుస్తామని అహంకరించిన నరేంద్ర మోదీ మెజారిటీ కూడా సాధించలేకపోవటం ఎందు కు? ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? మోదీ ఉంటా డా? ఊడతాడా? చంద్రబాబు అమరావతిని ఇంకో పదేండ్లలో కట్టేస్తాడా? ఎన్నికల మర్నాడే అక్కడ ఎకరం 50 లక్షలైందని ఆంధ్రజ్యోతి రాసేస్తే నమ్మేద్దామా? ఇవేనా ఈ మేధావులు మాట్లాడవలసిన మాటలు?
నిజానికి తెలుగు రాష్ర్టాల ఎన్నికలు, కేంద్ర ప్రభు త్వం ఏర్పడటానికి జరిగిన ఎన్నికలు ఏం సూచిస్తున్నాయి? ఈ విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా? మోదీ మొహం మాడిపోయింది, అహంకారం ఇంకైనా తగ్గుతుందా? అని గంటలు గంటలు విశ్లేషణ ఎవరికి ఉపయోగం? జరిగిన కార్యం గురించి కాకుండా, కారణం గురించిన వివరాలు మాట్లాడటం లేదు. ఎన్నికలయ్యాక ప్రజలతో పనైపోయిందా? అసలు ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజల నాడిని పసిగట్టడానికి ఎలా ఆలోచించాలి? వారేమనుకుంటున్నారు? ఇవి కదా ముఖ్యమైన అంశాలు. 303 సీట్లు వచ్చిన మోదీ 240 దగ్గర ఎందుకు ఆగాడు? ప్రజల మనసుల్లో ఏముం ది? ఎందుకు ఆగాడంటే, మోదీకి, బీజేపీకి మూడింది! ప్రజాభిమానం, మతపిచ్చి పోయాయి. మరి 52 వచ్చి న కాంగ్రెస్ 99 తెచ్చుకుంది. అంటే ప్రజాభిమానం ఆ పార్టీకి పెరిగిందా? నిజానికి అభిమానం పెరిగి కాదు, ప్రజలు వేరే దిక్కు లేక ఈ పార్టీ వద్దు అని ఆ పార్టీకి వేశారు. నిజంగా ప్రజాభిమానం ఉంటే కనీసం 200 సీట్లు గెలవాలి కదా! అంటే బీజేపీకి తగ్గిన 63 సీట్లయినా కాంగ్రెస్‌కు రావాలి కదా! లేదు ఆ రెండు జాతీ యపార్టీలకు కాలం చెల్లింది. ఎక్సైరీ తేదీ వచ్చింది, మరిప్పుడు ఏం చేయాలి?
అసలు భారతదేశ స్వరూపానికి, ప్రకృతికి ఈ జాతీయపార్టీల కేంద్రీకృత పరిపాలన సరిపడదు. ప్రాంతీయతను, ప్రజల అవసరాలను అర్థం చేసుకొని పరిపాలించే స్థానిక పార్టీలు మాత్రమే వైవిధ్యభరితమైన ఈ దేశానికి అత్యవసరం. ప్రజల పట్ల అభిమానం, వారికి కావలసిన అవసరాలు, ప్రాంత వనరుల సంరక్షణ వాటిని సరిగ్గా ఉపయోగించటం, ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచటం వంటివి గత తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరిగాయి. ముఖ్యమంత్రి ఒక కుటుంబ పెద్దగా, తండ్రి వలె పరిపాలించటం స్వాతంత్య్రానంతరం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే తొమ్మిదేండ్లు జరిగింది. కానీ అమాయకత్వం, అజ్ఞానం, కాంగ్రెస్ అబద్ధాల హామీల జోరులో రాష్ట్రం నష్టపోయి ఆ పార్టీని గెలిపించింది. ఖర్మ ఏమిటంటే తెలుగు రాష్ర్టాలు రెండూ ఓటుకు నోటు దొంగల పాలయ్యాయి. మరిప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేయాలి? బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారింది దేశం కోసమేనని అందరికీ తెలుసు!
ప్రతి రాష్ట్రంలో స్థానిక పార్టీలు బలపడాలి. కనీసం వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు జాతీయపార్టీలను రంగంలో లేకుండా చేసి రాష్ర్టాలన్నింటిలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ అభిమానం ఉన్న నాయకులు గెలవాలి. అటువంటి వారు ఇప్పుడు కొందరున్నారు. కేసీఆర్, నవీన్ పట్నాయక్, నితీశ్‌కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి మేధ, ప్రజ్ఞ, పరిపాలనాదక్షత కలిగిన నాయకులు ఇప్పుడు ముందుకురావాలి.
అధికారం కోసం జాతీయపార్టీలతో కలవకుండా ఆ పార్టీలను విసర్జించి ప్రజల్లో ప్రాపకం పెంచుకొని ఎన్నికలు గెలవాలి. కేంద్రంలో ఈ పార్టీలన్నీ కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడపాలి. కొద్ది గా స్వార్థం వదులుకొని దేశమంతా ఒక్కటన్న భావనతో ఒకరి రాష్ర్టానికి మరొకరు సహాయంగా నిలవాలి. అటువంటి ఫెడరల్ ప్రభుత్వమే ఈ దేశాన్ని ఉద్ధరిస్తుంది. ఇకనైనా ప్రాంతీయపార్టీల నేతలు ఆలోచించాలి.
జాతీయపార్టీలు రెండూ ప్రజాభిమానాన్ని కోల్పోయాయి. ఇక దేశానికి ఈ నాయకులే దిక్కు. దయచేసి మీ మీ పార్టీలను బలోపేతం చేసుకుని దేశం కోసం, ప్రజల కోసం ఆలోచించండి, నాయకుల కోసం కాదు. దేశం బాగు పడాలంటే ప్రజలు బాగుపడాలి, నాయకులు కాదు!
– కనకదుర్గ దంటు
89772 43484