Telangana | చరిత్రలో మన ప్రాంతాన్ని చూసినప్పుడు కలిగే సంబురం మామూలుగా ఉండదు. అప్పట్లోనే ఇంత ఘనమైన చరిత్ర మనదని తెలిసినప్పుడు, మన సంస్కృతి మహోన్నతమైనదన్నప్పుడు కలిగే ఆత్మగౌరవ భావన అనిర్వచనీయం. చరిత్ర అధ్యయనం బలమైన భవిష్యత్తును నిర్మిస్తుంది. మన సమీప గతంలో రెండు వందల ఏండ్ల కిందట ఒక మహనీయుడు మన ప్రాంతాన్ని సందర్శించి తాను పొందిన అనుభవాలను తెలుసుకోవడం, అప్పటి చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక, భాషా విషయాలను పరిశీలించడం నేటి తరానికి అవసరం.
కృష్ణా తీరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే పెంటపల్లిలో తొలి మజిలీ. శంషాబాద్ దాటాక చిన్న, చిన్న చెరువులు చాలా చూశాను. హైదరాబాద్ నగర గోడకు ఆనుకొని ‘మూసి’ (స్థానికులు ‘ముచుకుంద నది’గా పిలుచుకునే) నది పారుతుంది. గతేడాది ఈ నదికి వరదలొచ్చాయి. ఆ వరదల్లో ఢిల్లీ దర్వాజా దగ్గర ఇంగ్లీష్‌వారు కట్టిన వంతెన పగిలిపోయింది. దీంతో బేగంబజార్ సహా కొన్ని వీధులు ముంపునకు గురయ్యాయి.
హైదరాబాద్‌కు, లష్కర్‌కు మధ్య హుస్సేన్‌సాగర్ అనే గొప్ప మంచినీటి చెరువుంది. హుస్సేన్‌సాగర్ కట్ట మీద ఇంగ్లీష్ వారు గుర్రపు బండ్లు వెళ్లేందుకు అనుకూలంగా రోడ్డు వేసుకొని కట్టను చాలా ముచ్చటగా అలంకరించారు. ఇతర వాహనాలు, మనుషులు ఆ రోడ్డును పాడు చేయకుండా రోడ్డుకు ఇరువైపులా పహారా కాసేవారు. యూరోపియన్లు తప్ప ఇతరులకు ఆ కట్ట మీద అనుమతి లేకుండా నడవనివ్యరు.
ప్రతి ఊరికి ముందు పెద్ద, చిన్న వాగులను దాటుకుంటూ వెళ్లాలి. ముఖ్యంగా మేడ్చల్ మొదలుకొని ఆదిలాబాద్ వరకు ఎక్కువ వాగులను దాటాలి. శ్రీశైలం తర్వాత కృష్ణా నదిని, హైదరాబాద్‌లో మూసి నదిని, దూదుగాము దగ్గర గోదావరి నదిని, విచ్చోడ దగ్గర కడెం నదిని, ధనోరా దగ్గర పెన్‌గంగా నదిని, వోణి దగ్గర వశిష్ట నదిని దాటాము. ఆయా నదుల పరిమాణాన్ని, నీటి ప్రవాహాన్ని బట్టి నది దాటడానికి వసతులున్నాయి. తెలంగాణలో పెద్ద వర్తకులు, ధనవంతులు ఉండే ప్రాంతాల్లో దొంగలు దాడి చేసేవారు. వారు నిర్భయంగా సాయంత్రాల్లో గుంపులుగా ప్రవేశించి కనపడ్డ వారినల్లా చంపి ధనవంతుల ఇండ్లల్లో, అంగళ్లలో చొరబడి యజమానులను చంపి, ధనాన్ని దోచుకొని అర గడియలో మాయమైపోయేవారు.
తెలంగాణ అన్ని దారులు మట్టివే. ఆయా ప్రాంతాల్లో రకరకాల భూములున్నాయి. కొన్ని బాటలు గులకరాళ్లతో, ఇసుకతో నిండి ఉన్నాయి. ఇంకొన్ని నల్లరేగడి భూములతో వానాకాలం చిత్తడిగా, ఎండకాలం నెర్రెలు చాచి ముళ్లలా గుచ్చుకుంటూ ఉండేది. బాటలన్ని దాదాపు అడవులు, గుట్టలు, కొండలు, వాగులు, వంకలు, డొంకలు, ఎత్తులు, వంపులు, నదులు, పర్వతాల గుండా ఉన్నవి. అడవి దారుల్లో క్రూర మృగాల బెడద ఎక్కువగా ఉంది. మేడ్చల్ నుంచి ఆదిలాబాద్ వైపుకు వెళ్లే బాటలో దొంగలు, పులుల భయం ఉండేది. నిర్మల్ దాటిన తర్వాత దారి వెంట ఈగలు చాలా బాధపెట్టాయి. హైదరాబాద్‌లో కాకులు ఎక్కువగా లేవు. అక్కడి ప్రజలు డేగలు పెంచడమే అందుకు కారణం.
కుంఫిణీవారు తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలకు వెళ్లడానికి కొన్ని రహదారులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఆ రోడ్లలో వచ్చే ఊర్ల గురించి ఇంగ్లీషు అధికారులు రాసిన వివరాలలో తప్పులున్నాయి. ఆ ప్రకారం పేర్లు అడిగితే అటువంటి ఊరు దారిలో లేదని స్థానికులు చెప్తారు.
హైదరాబాద్ సంప్రదాయంలో ఒకటైన మొహర్రం పండుగ జరిగే పుణ్య సమయానికి అక్కడ ఉన్నందుకు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవం జరిగేది. కంచికి గరుడ సేవలా, హైదరాబాదుకు మొహర్రం అత్యంత ప్రముఖమైన పండుగ. కంచిలో కూడా అన్ని మతాలవారు ఐక్యతతో కూడి గరుడ సేవ చేస్తారని ప్రతీతి. మొహర్రం పండగ కుతుబ్‌షాహీల కాలంలో అప్పటి అధికారి మీర్ మోమిన్ అస్తరబాది చొరవతో హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది.
తెలంగాణలో ఎక్కువగా అన్నమే తింటారు. ఆయా గ్రామాల్లో బియ్యంతో పాటు తియ్యగా ఉండే గోధుమల పిండి విసిరి అమ్ముతున్నారు. ఊరికే అన్నమే తినడం వల్ల దేహానికి బలం ఉండదనే పుకారు ఉన్నందున రాత్రిపూట రొట్టె తినేవాడిని. తెలంగాణ ప్రాంతంలో ఉన్నంతకాలం రొట్టెతో పాటు అన్నం కూడా తిన్నాను. అది కూడా ఆరోగ్యంగానే ఉంది.
కూరగాయలు మా ప్రాంతంలో కంటే ఇక్కడ ఎక్కువ రుచిగా ఉన్నాయి. హైదరాబాద్ దాటిన తర్వాత పాలు, పెరుగు ఊరూరిలో సమృద్ధిగా దొరికాయి. ఇందలవాయిలో తమలపాకులు మిగతా ప్రాంతాల కన్నా చాలా బాగున్నాయి. తెలంగాణలో వక్కలు ముడివక్కలు. పగలగొట్టి నోటిలో వేసుకొంటే మా ప్రాంతపు వక్కల కన్నా బాగా రుచిగా ఉన్నాయి. ఇక్కడి పేద ప్రజలు తాంబూలం కన్నా వక్కలే ఎక్కువగా నములుతారు. చుట్ట అలవాటు కూడా ఇక్కడి వారికి ఉంది.
(1830-31 సంవత్సరాల్లో ఏనుగుల వీరాస్వామయ్య అనే ఓ మహనీయుడు చెన్నై నుంచి కాశీకి యాత్ర జరిపారు. అందులో భాగంగా తెలంగాణలోనూ తిరిగారు. ఈ సందర్భంగా ఆయన అనుభవాలను పైవిధంగా చెప్పుకొచ్చారు. వీరాస్వామయ్య రాసిన కాశీయాత్ర చరిత్ర వ్యవహారిక భాషోద్యమానికి చాలా ఉపయోగపడింది. అంత గొప్ప గ్రంథంలోని మన తెలంగాణకు సంబంధించిన భాగాల సేకరణ…)
-డాక్టర్ మల్లెగోడ గంగా ప్రసాద్