పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి మూడింట రెండొంతుల మెజారిటీ సమకూర్చుకోవడానికి అప్రజాస్వామిక రాజకీయ క్రీడ వేగంగా నడుస్తున్నది. లోక్‌సభలో బీజేపీకి సొంత మెజారిటీ లేకపోవడంతో జేడీయూ, తెలుగుదేశం వంటి భాగస్వామ్య పక్షాల బెదిరింపుల నుంచి తప్పించుకోవడానికి, రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్‌సభలో ఆమోదింపచేసుకోవడానికి మార్గం సుగమం చేసుకుంటున్నది. అందుకు ఇప్పుడు ప్రతిపక్ష ఎంపీలను తనవైపు తిప్పుకొనే ఆటను నిస్సిగ్గుగా బీజేపీ ఆడుతున్నది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలో బీజేపీ ప్రతిపక్ష ఎంపీలను ఎన్డీఏ వైపునకు ఫిరాయించేలా చేయడానికి మరో దఫా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఓటమి పాలైంది. 20 మంది టీఎంసీ ఎంపీలు అమిత్ షా ప్రోద్బలంతో త్రిపురకు చెందిన నమోదుకాని పార్టీ నేషనల్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాక ముందే మహారాష్ట్రలో నాలుగేండ్ల క్రితం శివసేన, ఎన్సీపీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటుకు దారితీసిన ఫిరాయింపులుచీలికల రాజకీయాన్ని బీజేపీ మరోసారి మొదలుపెట్టింది.
శివసేన స్థాపకుడు బాల్ ఠాక్రే కుమారుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన (యూబీటీ)కు చెందిన 9 మంది లోక్‌సభ సభ్యుల్లో ఆరుగురిని ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నాయకత్వంలోని శివసేనలో చేర్పించడానికి బీజేపీ నాయకత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు ‘ఆపరేషన్ టైగర్’ అనే పేరు పెట్టింది. ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు చెల్లించడానికి, రూ.25 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వడానికి ప్రతిపాదించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ మొదటి రెండు పదవీకాలాల్లో (20142024) ప్రతిపక్షాల సభ్యులను బీజేపీ, దాని మిత్రపక్షాల్లోకి ఫిరాయించిన అదే క్రీడను ఈ సారి రెట్టించిన అధికార, ధనబలంతో ఆడుతున్నది.
బీజేపీకి 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ (వరుసగా 282, 303 సీట్లు) లభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ 272 కాగా, కాషాయపక్షానికి 240 స్థానాలు మాత్రమే దక్కాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల బలం కూడా అంతంత మాత్రమే. మొత్తం 543 మంది సభ్యులున్న లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీకి 362 మంది సభ్యుల మద్దతు అవసరం. మహిళా రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయాక ఎలాగైనా లోక్‌సభలో ఎన్డీఏకు మూడింట రెండొంతుల మెజారిటీ సంపాదించాలనే పట్టుదలతో బీజేపీ పావులు కదుపుతున్నది.
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎన్డీఏలోకి ఫిరాయించిన తర్వాత పాలక కూటమి బలం 314 స్థానాలకు పెరుగుతుంది. ఆపరేషన్ టైగర్ సఫలమై ఆరుగురు శివసేన (యూబీటీ)కి చెందిన తొమ్మిది మంది ఎంపీలల్లో ఆరుగురు ఎన్డీఏలో చేరినా కూటమి బలం మూడింట రెండొంతుల మెజారిటీ మార్కుకు ఇంకా 40 సీట్ల దూరంలోనే ఉండిపోతుంది. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపడిన మహిళల రిజర్వేషన్ల చట్టం, ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగ సవరణకు కేంద్ర సర్కార్ ఆతృతతో ఉన్నది.
ఈ నేపథ్యంలో ధనబలంతో అడ్డగోలు ఫిరాయింపులను ప్రోత్సహించి, మెజారిటీ సమకూర్చుకోవడానికి పావులు కదుపుతున్నది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తర్వాత ఎక్కువ లోక్‌సభ సీట్లు (37) సాధించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన పాతిక మందికి పైగా ఎంపీలను బీజేపీలోకి ఫిరాయించేలా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయనే వార్తలు వస్తున్నాయి. ఎస్పీ ఎంపీలందరూ బీజేపీలోకి ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారని యూపీలో పాలక కూటమి భాగస్వామ్యపక్షమైన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నేత, రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఇటీవల వెల్లడించారు.
ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయాక దాని మిత్రపక్షం కాంగ్రెస్ వెంటనే టీవీకే నేత జోసెఫ్ విజయ్‌కి మద్దతు ప్రకటించింది. దీంతో ఆగ్రహించిన డీఎంకే నేత ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమితో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామాల ఫలితంగా లోక్‌సభలో 22 మంది సభ్యులున్న డీఎంకే త్వరలోనే ఎన్డీఏకు దగ్గరవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ర్టాల్లో ఇప్పుడున్న సీట్లను 50 శాతం చొప్పున పెంచేలా చట్టం తీసుకొస్తున్నట్టు డీఎంకేను దృష్టిలో పెట్టుకొని బీజేపీ చెప్తున్నది. నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్, తమిళనాడులో పాలకపక్షాలైన ప్రాంతీయపక్షాలు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే ఓడిపోయాక బీజేపీ కొత్త వ్యూహాలకు తెరతీసింది. ఎక్కువ మంది ఎంపీ సీట్లున్న మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ప్రతిపక్ష కూటమిలోని ప్రాంతీయపక్షాలను దెబ్బదీయడానికి ఎంపీల ఫిరాయింపులను ప్రోత్సహించే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయడానికి పావులు వేగంగా కదుపుతున్నది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలం 99 ఉన్న కారణంగా ఈ పార్టీని చీల్చడం ఇప్పట్లో సాధ్యం కాదు.
దాని తర్వాత రెండో పెద్ద విపక్షమైన ఎస్పీలోని మూడింట రెండు వంతుల మందిని బయటకు తీసుకురావడం తేలిక కాకపోయినా తాను ఆ ప్రయత్నం చేస్తున్నాననే భ్రమను బీజేపీ ప్రచారంలో పెడుతున్నది. 1991 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ 232 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సాధారణ మెజారిటీకి అవసరమైన 265 మంది సభ్యుల మద్దతు లేకున్నా నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు ప్రధానిగా ప్రమాణం చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్నే రెండేండ్లు నడిపిన తర్వాత జనతాదళ్ చీలిక పక్షం నేత అజిత్‌సింగ్ తదితర నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. జేఎంఎం, టీడీపీ వంటి చిన్న పార్టీల నుంచి ఫిరాయించిన ఎంపీలూ కాంగ్రెస్‌తో జట్టుకట్టారు.
దీంతో మైనారిటీ సర్కార్‌గా మొదలైన కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్లలోపే లోక్‌సభలో మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టింది. అప్పట్లో ఒక పార్టీకి చెందిన చట్టసభ సభ్యుల్లో మూడో వంతు మంది చీలి బయటకు వచ్చి, ఇతర పార్టీలతో విలీనం కావడానికి ఫిరాయింపు నిరోధక చట్టం వీలు కల్పించేది. తర్వాత ఈ చట్టాన్ని సవరించాక మూడింట రెండొంతుల మంది సభ్యులు బయటకు వచ్చి అసలు పార్టీగా గుర్తింపు పొంది, మరో పెద్ద పార్టీలో విలీనం కావడానికి అవకాశం ఇచ్చారు.
ఈ సవరణ తర్వాత ‘చీలిక’ ప్రస్తావన లేకుండా పోయింది. మళ్లీ పీవీ సర్కార్‌పై 1993లో సీపీఎం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయానికి వస్తే, జనతాదళ్ (అజిత్‌సింగ్) సభ్యులు ఏడుగురిని, జేఎంఎం సభ్యులు ముగ్గుర్ని ఫిరాయించేలా చేయడానికి కోట్లాది రూపాయలు చేతులు మారాయని మొదటిసారి వార్తలు వచ్చాయి. జేఎంఎం కేసు పేరుతో ఎంపీల కొనుగోలు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇలా లోక్‌సభలో సర్కార్‌కు అనుకూలంగా ఓటు చేయడానికి ఎంపీలకు డబ్బు ముట్టచెప్పడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మూడింటి రెండొంతుల సభ్యుల మద్దతు అవసరమయ్యేలా సవరించాక కూడా దేశంలో డబ్బుతో చట్టసభల సభ్యులను ఫిరాయించేలా చేసే ప్రక్రియను బీజేపీ అత్యుత్సాహంతో అమలు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అత్యంత హానికరం.
-నాంచారయ్య మెరుగుమాల