2009, డిసెంబర్ 9- తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన రోజు. దశాబ్దాల ఆశ, ఆవేదన, ఆకాంక్షలు ఉద్విగ్న భరితంగా మారిన ఈ రోజు, ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టిన సుదినంగా తెలంగాణ సమూహ స్మృతిలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 2009 నవంబర్ 29న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించిన ఆమరణ దీక్షను కేంద్రం ఇంకా నిర్లక్ష్యం చేయలేని స్థితికి చేర్చిన కేసీఆర్ దీక్షను, విజయ్ దివస్‌ను మనం మరోసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
కేసీఆర్ దీక్ష, ప్రజా భావోద్వేగాల ప్రవాహం, రాజకీయ పరిణామాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల స్పందనలు.. ఇవన్నీ కలగలిసి డిసెంబర్ 9 ప్రకటన ఒక తప్పనిసరి నిర్ణయంగా ఢిల్లీ పాలకుల ముందుకువచ్చింది. ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సంసిద్ధత ప్రకటించిన వెంటనే తెలంగాణ అంతటా అలజడి మొదలైంది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నవంబర్ 26వ తేదీ సాయంత్రం కరీంనగర్ తీగల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయనకు వేలాది మంది కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు తిలకాలు దిద్దారు.
దీక్షను అడ్డుకోవాలన్న ప్రభుత్వ సంకల్పం కరీంనగర్‌ను పోలీసు కంచుకోటగా మార్చింది. 144 సెక్షన్ అమలు చేసి, భవన్‌ను పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ చేపట్టే దీక్షను అడ్డుకుంటారా? మార్గమధ్యంలోనే ఆయనను అరెస్టు చేస్తారా? అన్న అనుమానం యావత్ తెలంగాణలో ఉద్రిక్తతను పెంచింది. 28వ తేదీ రాత్రి కరీంనగర్ అంతటా ఉత్కంఠ నెలకొన్నది. కేసీఆర్ బసచేసిన భవన్ వద్ద భారీ పోలీసు బందోబస్తు, కార్యకర్తల నిరంతర నినాదాలు, ఘర్షణల నేపథ్యంలో దీక్షా పోరాటం ఏ దిశకు వెళ్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
నవంబర్ 29న ఉదయం తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీక్షను అడ్డుకునేందుకు ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులపై విమర్శలు ఎక్కుపెట్టారు. అనంతరం ఉదయం 7.30 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్, నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావులతో కలిసి సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లికి కేసీఆర్ బయలుదేరారు. కానీ, పోలీసులు ఆ సమయం కోసమే కాచుకొని కూర్చున్నారు. అల్గునూర్ బ్రిడ్జి వద్ద కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల వాహనాలను నిలిపివేసి కాన్వాయ్‌ని విడగొట్టారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అల్గునూరు చౌరస్తాలో కాన్వాయ్‌ను అడ్టుకొని కేసీఆర్‌ను అరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా కేసీఆర్ రోడ్డుపై కూర్చుని ఆందోళన చేయగా, కార్యకర్తలు వాహనాల టైర్లలో గాలి తీసివేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆయనను హుజూరాబాద్-వరంగల్ మీదుగా ఖమ్మంకు తీసుకెళ్లారు. అక్కడి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో ఖమ్మం జైలులోనే కేసీఆర్ ఆమరణ దీక్ష కొనసాగించారు. తెలంగాణ ప్రజల్లో జ్వాలలు రాజుకున్న క్షణం ఇదే.
ఖమ్మం జైలులో కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను నిమ్స్‌కు తరలించారు. వైద్యుల సూచనలు, ప్రభుత్వ ఒత్తిళ్లు, కేంద్రం ఆదేశాలు.. దేన్నీ లెక్కచేయకుండా కేసీఆర్ నిరాహార దీక్షను కొనసాగించారు. కేంద్రం అధికారికంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తేనే దీక్ష విరమిస్తానని ఆయన స్పష్టం చేశారు. వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు నిమ్స్‌కు చేరుకొని కేసీఆర్ దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
ఉస్మానియా, కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆందోళనలు మిన్నంటాయి. అయితే, పోలీసులు భాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు, లాఠీలతో దాడులు చేసినప్పటికీ తెలంగాణ భావోద్వేగాన్ని అడ్డుకోలేకపోయారు. బంద్‌లు, ర్యాలీలతో తెలంగాణ ఒక్కసారిగా అగ్నిగోళంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం నిర్వహించగా, సీపీఎం తప్ప మిగిలిన అన్ని పార్టీలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపాయి. ఢిల్లీకి పంపిన నివేదికలో కూడా ఇదే స్పష్టం చేశాయి.
రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడి మధ్యనే కేసీఆర్ దీక్ష 11వ రోజుకు చేరింది. వేళ డిసెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి నాటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేశారు. పార్టీల ఏకాభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తక్షణం ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనతో తెలంగాణ సంబురాల్లో మునిగిపోయింది. దశాబ్దాల కల సాకారమవుతుందన్న ఆనందంతో హృదయాలు ఉప్పొంగాయి. కానీ, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో కేంద్రం తడబడింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేసింది. దీంతో తెలంగాణలో మళ్లీ అగ్గిరాజుకుంది. ఈసారి పోరాటం మరింత ఉధృతమై అన్ని వర్గాల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు సకలజనుల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి కేంద్రం మెడలు వంచకతప్పలేదు.
తదనంతరం దశలవారీగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, వేల పేజీల నివేదికలు, ప్రజాభిప్రాయ సంగ్రహాలు, అనేక రాజకీయ దౌత్యాలు, పార్లమెంట్లో మలుపులు, రాజ్యంగపరమైన నిర్ణయాల మధ్య 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ దీర్ఘ పోరాటానికి అఖండ విజయం లభించింది. డిసెంబర్ 9 ప్రకటన ఈ మహత్తర సాధనలో తొలి అధికారిక ముద్రగా నిలిచింది. కేసీఆర్ దీక్ష, వేలాది త్యాగాలు, కన్నీళ్లు, ఆశలు, ఉద్యమ జ్వాలలకు న్యాయం చేసిన చారిత్రక పునాది ఈ రోజే పడింది.
– రామకిష్టయ్య సంగనభట్ల 94405 95494