e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home ఎడిట్‌ పేజీ మహాదేవి.. నారీ అభివ్యక్తి

మహాదేవి.. నారీ అభివ్యక్తి

వైవిధ్యం, భాషా బాహుళ్యం ఉన్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో వెలువడే సాహిత్యంలో సారూప్యం గోచరిస్తుంది. అందుకే పలు భాషల్లో రాసిన సాహిత్యమంతా ఒక్కటేనని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చెప్పారు. ఈ సారూప్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు సర్వ సాహిత్యాలు ఆత్మీయంగానే అగుపిస్తాయి.

పీవీ నరసింహారావు

- Advertisement -

హిందీ, వంగ సాహిత్యాలలో తప్ప మరే యితర భారతీయ భాషా సాహిత్యాలలో ‘ఛాయవాద’ మనే విశిష్ట వాద ప్రక్రియ ప్రచారంలోకి రాలేదు. అందువల్లనే హిందీ సాహిత్యంతో సంబంధం లేనివారికి, లేదా ఏదో కొద్దో గొప్పో హిందీ సాహిత్యాధ్యయనం చేసేవారికి ఛాయావాదులుగా పేర్కొన్న కవుల రచనలను సమీక్షించడంలో అనేక విధాలైన సమస్యలు ఎదురవుతాయి. అట్టి ఛాయావాదానికి సంబంధించిన కవుల వాదాలను సిద్ధాంతరూపంగా అంగీకరించలేము. ఇలాంటి స్థితిలో విమర్శకుడు నిజంగా చిక్కుల్లో పడతాడు.

ఉదాహరణకు, ఈ వ్యాసంలో మహాదేవి వర్మ రచనలు సమీక్షకు స్వీకరించబడ్డాయి. ఈ రచనలకు ఛాయావాదమనో లేక రహస్యవాదమనో పేరు పెట్టకుండా ఉన్నైట్లెతే సమీక్షకుడి పని తేలిక అయ్యేది. కానీ మహాదేవివర్మ కవితలు ఆమె మనోగతానికి వ్యతిరేకంగా నానా విధాలయిన ‘బంధనోంకీ స్వామినీ’ (బంధనాలకు రాణిని) అని అనుకున్నప్పటికీ, మనం పాఠకులం ఆమెను కావ్య మార్గదృష్టితో కేవలం బందీగానే పరిగణిస్తున్నాం. అయినా వాదాల బంధాలకు అతీతంగా, సామాన్య సాహిత్య రసికుడి దృష్టిలో మహాదేవీ వర్మ రచనలలోని కొన్ని వైశిష్ట్యాలను వివరించే ప్రయత్నం చేస్తాను.

స్త్రీ సహజ కోమలత్వం – స్త్రీ కావడమే మహాదేవి మొట్టమొదటి విశేషం. ఇది ఆమె కావ్యం చదివేటప్పుడు క్షణక్షణం స్ఫురిస్తుంది. అడుగడుగునా సహృదయ నారీ సహజమైన అభివ్యక్తులే గోచరిస్తాయి. ఇది ఇతరులకు అసాధ్యమనే చెప్పవచ్చు. శృంగార సాహిత్యమే కాదు – సుదీర్ఘ కావ్య చరిత్రలో నాయికకు ఆపాదించబడిన విశిష్టతలు ఈ నాయికలో లభించవు. శృంగార సాహిత్య ప్రపంచంలో మూడు నాలిగింటిలోనే స్త్రీ మనోభావాలు విశదంగా వర్ణించబడ్డాయి. అవి ఇతరులకు అసాధ్యమనే అనిపిస్తాయి. ఆమె వేదనాస్థాయి ఎంత తీవ్రమైనదంటే – సృష్టిలోని అత్యంత సుందరమైన వస్తువులో కూడా భయంకర బీభత్సమే గోచరిస్తుంది. దీనికి విరుద్ధంగా ఆమె విలాస విభ్రమ కటాక్షం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆమె ఆనందంలో మునిగితేలేటప్పుడు రోమ రూపంలో నందన వనం పులకిస్తుంది. పురుషునిలో ఇలాంటి మమైక్య భావం ఎలా గోచరిస్తుంది? పురుష సహజమైన వీరరసోత్కర్షలో కూడా స్త్రీ ప్రసంగం అత్యంత ప్రభావశీలంగానే ఉంటుంది. ఇతర రసాల సంగతి వదిలేయండి, శృంగార రసం నాయకాశ్రయమైనదానికంటే నాయికాశ్రయమైతేనే ఎక్కువ శోభస్కరంగా ఉంటుంది. ఇది లక్షణ గ్రంథాలలో చెప్పబడిందనే కాదు, వ్యావహారికంగా కూడా యథార్థం. పురుషుల మనోభావ తీవ్రస్థాయి కారణంగా కావ్యంలోని సారస్యం ఛిన్నాభిన్నమవుతుంది. ఆ కారణంగానే వాస్తవిక ప్రపంచంలో పురుషుడికి అధికారం లభించినా కావ్యరంగంలో మాత్రం అతనికేమాత్రం ఆధిపత్యం లభించలేదు. విశ్వాసం, సరళత, అమాయకత్వం, క్షమ, ప్రేమ, తల్లీనత- ఇవన్నీ స్త్రీకి సహజ ఆభూషణాలు. మహాదేవీ వర్మ కవితల్లో స్త్రీలో సహజంగా ఉండే గుణాలన్నీ సుస్పష్టంగా కనపడతాయి. ఆమె నారీత్వమే ఆమె ప్రథమ విశిష్టత అని చెప్పడానికిదే కారణం.

కృష్ణభక్తి సంబంధమైన కవితల పరిశీలనలో ఈ విషయం మరింత స్పష్టమవుతున్నది. హిందీ సాహిత్యంతో రాధాకృష్ణులు శృంగార రస భాండాగారాలని చెప్పవచ్చు. వ్రజకన్యలు కూడా మరువరానివారు. ఏ కవియైనా లీలాకృష్ణుని మనోభావాలను విశదంగా వర్ణించే ప్రయత్నం చేసాడా? అన్నది ఆలోచించాల్సిన విషయం. సమాధానం ‘లేదు’. ఎక్కడ చూసినా గోపికల కోలాహలమే, గోపికల వ్యాకులత్వమే, గోపికల ఆనందోత్సాహమే, గోపికల విరహజన్మ దుఃఖమే, గోపికల సంభాషణలే. కన్నయ్య అన్నింటా ఆలంబమయ్యాడే గానీ ఎక్కడా ఆశ్రయం కాలేదు.

దార్శనికత, దుఃఖవాదాలను కొద్దిసేపు ప్రక్కకి పెట్టివేస్తే మహాదేవీ వర్మ ఆధునిక హిందీ సాహిత్యంలో మీరాబాయి వంటిది అని చెప్పవచ్చు. ఇద్దరిలోనూ ప్రేమ ప్రదర్శనలో ఎంతో సామ్యం కనపడుతుంది. ఒక వంక ఊహించలేని గంభీరత, మరోవంక భక్తి పారవశ్యంలోనే లభ్యం కాగల సరళత- ఈ విధమైన విచిత్ర సమ్మేళనం మహాదేవీ కావ్యంలో కాక మరెక్కడా లభించలేదు. మీరా, మహదేవీలను గురించి తులనాత్మక అధ్యయనం ఒక పరిధిలో మాత్రమే చేయగలమని చెప్పడం అవసరమే. ఎందుకంటే, ఆ పరిధి దాటిన తర్వాత వారి మార్గాలు వేరైనాయి. కానీ మా ఆశయం ఏమంటే – ఈ సామ్యసీమ (సమాన పరిధి) భక్తి మాత్రమే కాదు. ప్రియారాధన మాత్రమే కాదు, ఆది – ఆ పరిధి – సహృదయ నారీత్వం. ఈ పరిధిలో ఇద్దరి రసస్ఫూర్తితో కూడిన వాక్కులు ఒకేలా ఉంటాయి. భారతీయ ప్రపంచానికి చిరపరిచితమవడం వల్ల మీరా వాక్కులు సుస్పష్టంగా అగుపడటమే ఇద్దరిలో భేదం. సారాంశం ఇదే.

కరుణ: ఇప్పుడు మనం మహాదేవి కావ్యంలోని రెండో వైశిష్ట్యాన్ని గురించి ప్రస్తావిద్దాం. అది ఆమె అన్ని కవితలలోనూ గోచరిస్తుంది. కరుణ రసాభివ్యంజనలో ఛాయావాద కవుల వలె మహాదేవి కూడా ఆ పంథానే అనుసరించింది. అయినప్పటికీ మహాదేవీ రచనల్లో అంతటా అనిర్వచనీయమైన వేదనా స్వరం వినబడుతుంది. ఈ వ్యక్త వేదనాస్వరాన్ని ఒకవైపు కరుణ నుంచి, మరోవైపు దుఃఖవాదం నుంచి వేరుగా చూడాలి. ఎందుకంటే – ఆ అభివ్యంజన ఒకసారి కరుణలో, ఒకసారి దుఃఖంలో విలీనమైనట్లు తోస్తుంది. కరుణ, దుఃఖ వాదం మహాదేవి రాతలో అలవోకగా వ్యక్తమవుతాయి. దాంట్లో కవయిత్రి ఇచ్ఛాశక్తి కారుణ్యరూపంలో కనబడుతుంది. కానీ ఏ అస్ఫుటస్వరం ఉదాహరిస్తున్నానో, అది బహుశా ఇచ్ఛ, అనిచ్ఛలపై ఆధారపడి లేదు.

భావపక్షం: మహాదేవి కవితలలోని భావపక్షాన్ని గురించి పరిశీలిద్దాము. ఈ సందర్భంలో ముందుగా, ముఖ్యంగా పాఠకుల దృష్టిని ఆకర్షించేది, మహాదేవి యొక్క ‘అహంభావం’.

ఇక్కడ అహంభావమంటే గర్వం, పొగరుబోతుతనమనే అర్థంలో కాదు, దాన్ని ఒక విశిష్ట అర్థంతో ప్రయోగిస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలచుకున్నది మహాదేవి కవితలు ఎక్కువగా శక్తి ప్రధానమైనవే కాని వస్తు ప్రధానమైనవి కాదు. తులనాత్మక దృష్టితో చూస్తే ఇతర కవుల కవితల కన్నా మహాదేవి కవితలలో ఆ భావం (ఇగో) ఎక్కువ ఉన్నదన్న విషయం స్పష్టమవుతుంది. వాస్తవానికి బహుకొద్ది కవితలు మాత్రమే మొదటి నుంచి చివరివరకు వ్యక్తి నిరపేక్ష దృష్టి కలిగి ఉన్నాయి. పూర్తిగా తటస్థభావం కలిగి ఉండి, వస్తు ప్రాధాన్యత ప్రదర్శించిన కవితలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని పంక్తులు ముందుకు సాగిన వెంటనే ఒక్కసారిగా ‘నేను’ అన్నది కొట్టవచ్చినట్లు వ్యక్తమవుతుంది. ఈ ఆకస్మిక భావపరిణామం అక్కడక్కడ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

భాషలోని మాధుర్యం: వేదనాస్వరంతో పాటుగా మహాదేవి కోమలత్వంతో కూడా దగ్గర సంబంధం ఉంది. ఛాయావాదంలో ‘ఖడీభోలీ’ ఎలా కలిసిపోయిందో అన్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ ఛాయావాద కవులలో మహాదేవి విశిష్టత స్పష్టంగా కనపడుతుంది. వాస్తవానికి ఆమె ఖడీభోలీని కోమలత్వానికి, మాధుర్యానికి ఆలవాలంగా చేసింది. ఆమె గీతాల నాద మాధుర్యం, మనస్సుకు హత్తుకునే వ్యంజనాశైలి నిస్సందేహంగా మనోహరమైనది. అన్నింటికి మించి ఆమె తత్సమ శబ్ధ ప్రయోగం కావ్యోపయుక్తము, సరళతకు పోషకంగా ఉంటుంది. ఆమె వాడిన ఛందస్సు ముక్తకాలకు, సంగీతానికి సాన్నిహిత్యాన్ని కలిగించింది. ‘దీపశిఖ’లోని కొన్ని గీతాలు కేవలం ‘ఖ్యాల్‌’ గాయకుల కోసం వ్రాసినవేననిపిస్తాయి.

మహాదేవి భావపక్షంలో ప్రముఖమైన విషయం శృంగారం. ఈ శృంగారం ఆధ్యాత్మిక తత్తానికి సంబంధించినదే అయినా సరసంగా కూడా ఉంది. ఆమె కవితల్లో స్త్రీ సహజమైన కోమలత్వం ఎంతగానో ఉందని చెప్పుకొన్నాం. ఆమె వర్ణించిన ప్రేమ భావం కూడా ఉచ్ఛృంఖలం, ఉన్ముక్తం కాకుండా సంయమితం, సూచనా ప్రధానమైనది. ఆమె చిరంతనం, అలౌకికం అయిన తత్తాన్ని తన ప్రేమకు ఆలంబనగా చేసుకొని, విశుద్ధ అనురాగానికి సంబంధించిన అనేక మార్మికోక్తులను వ్యక్తీకరించింది.నిజానికి మహాదేవి వర్మ ప్రేమభావం ప్రౌఢత్వ స్థాయిని దాటిపోయినట్లు అనిపిస్తుంది. దాంతో వాటిలో హృదయం అంటే మస్తిష్కపక్షమే ఎక్కువ అనిపిస్తుంది. బహుశా ఈ విధమైన చింతన ప్రధానమైన ప్రేమ సరసత్వ దృష్టితో అంతగా సముచితం అనిపించదు.

శశికే దర్పణ్‌ మే దేఖ్‌ దేఖ్‌,
మైనే సులఝాయా తిమిర్‌ కేశ్‌,
గూంథే చున్‌ తారక్‌ పారిజాత,
అవగుంఠన్‌ కర్‌ కిరణేం అశేష్‌,
క్యోం ఆజ్‌ రిఝా పాయా ఉస్‌కో,
మేరా అభినవ్‌ శృంగార్‌ నహీ?

ఈ పంక్తుల్లో వర్ణించిన దృశ్యాల అలౌకికత్వాది గుణాల పరిశీలనను ఒక క్షణకాలం వదిలివేసి, ఈ ప్రపంచంలోని ఒక సామాన్య నాయిక నోటి నుంచి వ్యక్తమయ్యే మాటలు విందాం. ఆమె వర్ణించిన శృంగారం సామాన్యమైంది కాదు. అది ‘అభినవం’. దీనివలన ‘క్యోం’ (ఎందుకు?) అని మొదలుపెట్టి అడిగిన ప్రశ్నలో వితర్కితమైన మనస్థితి ప్రతిబింబిస్తున్నదని స్పష్టమవుతున్నది. తన అభినవ శృంగారం ప్రియుణ్ణి ప్రసన్నం చేయలేకపోతోందని ఆమెకు తెలిసినా, బాధంతా తాను ఎందుకు అతణ్ణి లాలించలేకపోతున్నానన్నదే! ఆమె తన భవిష్యత్తును పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటున్నదని అనిపిస్తుంది. ఇంతటి దూరదృష్టి, ఇంతటి పరిశీలన, ఇంతటి తర్కవితర్కాలు ఏ శృంగార నాయికకు శోభనియ్యవని రసజ్ఞులైన వారెవ్వరైనా సరే అంటారు. మహాదేవికి సలహా ఇవ్వగల అధికారం ఎవరికీ లేదు కానీ పైన చెప్పిన ప్రశ్నను ‘క్యోం’కు బదులు ‘క్యా’తో మొదలు పెట్టినట్లయితే, చదవగానే ‘ముగ్ధ’ ‘విస్మిత’ నాయిక మన కళ్ళముందు సాక్షాత్కరించేది అని మాత్రం తప్పకుండా చెప్పవచ్చు.

రహస్యభేదం: మహాదేవి మార్మికోక్తులను అనేక ఉపభేదాలుగా వింగడించవచ్చు. అన్నింటికన్నా ముందు ఒక అజ్ఞాత – నిస్సీమ తత్తంలో ఏకమవ్వాలనే కోర్కె కనబడుతుంది. తన ఈ కోర్కెను అనేక పర్యాయాలు వ్యక్తీకరించడంతో పాటు, ఆమె భవిష్యత్‌ – కాల్పనిక సంయోగ సందర్భాన్ని గురించిన అంచనాలను, చిత్రమయమైన వర్ణనలు కూడా చేసింది. కాల్పనికమయిన సంయోగం విశిష్టంగాను కొంచెం విలక్షణంగానూ ఉంది. సంయోగ వియోగాల మధ్య అతిపెద్ద తేడాను కూడా అంగీకరించాలని ఆమె అనుకోవడం లేదని కూడా తెలుస్తుంది.

విసర్జన భావం: దుఃఖవాద పరిణామమనండి, లేదా రహస్యవాదమనండి. మహాదేవి కవితల్లో విసర్జన, సంపూర్ణ ఆత్మ సమర్పణ భావం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆమెలోని స్త్రీ సహజ కోమలత్వం ఆత్మ సమర్పణ భావాన్ని ఎక్కువ ప్రభావ పూర్ణం చేసింది. అక్కడక్కడ ఆమె విసర్జన భావంలో ‘నియతివాద’ ధోరణి కూడా కొద్దిగా మిళితమైనట్లు గోచరిస్తుంది. ఆమె ‘అహం’ (నేను) విసర్జన భావానికి ఏ మాత్రం అడ్డు రాకపోగా, ఆ భావాన్ని మరింత స్పష్టంగా నిరూపించింది.

ఛాయావాదం చాలాకాలం వరకు సాహిత్యరంగంలో మనజాలదు. తిరోగమనం అప్పుడే ఆరంభమైంది. అయినప్పటికీ ఛా యావాద శైలిలోనే కొన్ని పద్ధతులు హిందీ కావ్యోన్నతికి సహాయ పడగలవు. సూక్ష్మత యొక్క వైశిష్ట్యాలు లుప్తమైపోవచ్చుగానీ సూక్ష్మానుభూతి యొక్క అప్పీల్‌ మాత్రం ఏనాటికీ లుప్తమవ్వదు. సమకాలీన జీవిత సమస్యల, వాస్తవిక జీవనం పట్ల ఆసక్తిలేని కవుల కలల వలన కావ్య ప్రపంచం విసుగుదలకు గురికావచ్చునేమో గానీ వస్తువు యొక్క మార్మికతను సంవేదన రూపంలో దర్శించగలిగే భావుక కళాకారులకు ఎల్లప్పటికీ ఆదరణ లభిస్తుంది. భారతదేశంలో ఇలాంటి మహా కళాకారులలో మహాదేవి సమున్నత స్థానానికి యోగ్యురాలని నా ప్రగాఢ విశ్వాసం. స్ఫూర్తిదాయకమైన ఆమె రచనలు కావ్యపథంలో పథికులకు ఎల్లప్పుడూ నిత్యనవీనంగా, అడుగడుగునా ఉత్సాహం కలిగిస్తూనే ఉంటాయి. కవి మన స్సు దానికి సాక్షి, రసికుని మనస్సే దానికి హామీ.
(మహాదేవి వర్మ షష్టిపూర్తి సందర్భంగా ప్రచురించిన అభినందన సంచికలో పీవీ నరసింహారావు హిందీలో రాసిన వ్యాసానికి డాక్టర్‌ శ్రీమతి బి.వాణి చేసిన తెలుగు అనువాద సంక్షిప్తరూపం)
మూలం: తెలుగు అకాడమీ ప్రచురించిన పీవీ నరసింహారావు మోనోగ్రాఫ్‌,
(రచయిత డా. సంగనభట్ల నర్సయ్య)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana