రాష్ట్రంలో దాదాపు ఇరువై లక్షల ఎకరాల మేర ఆయిల్ పామ్ సాగుచేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్రం కూడా తోడ్పాటును ప్రకటించడం హర్షణీయం. వ్యాపారం మాదిరిగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఈ పంట నాలుగేండ్లకు చేతికి వస్తుంది కనుక, రైతులకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరాకు మూడేండ్లలో రూ.36,000 ఆర్థికసాయాన్ని అందించనున్నట్టు గతనెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులను కూడా మానసికంగా సిద్ధం చేస్తున్నది. ఇప్పుడు కేంద్రం చేపట్టిన వంటనూనెలు, ఆయిల్‌పామ్ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వ కృషికి ఉపయుక్తంగా ఉంటుంది.
పామాయిల్ తోటల సాగుకు రాష్ట్రప్రభుత్వం గణనీయమైన ప్రోత్సాహం ఇవ్వటం వెనుక కూడా దీర్ఘకాలిక ఆలోచన ఉన్నది. మనదేశంలో వంటనూనెల కొరత ముఖ్యంగా పామాయిల్ కొరత తీవ్రంగా ఉంది. ఏటా రూ.70 వేల కోట్ల విలువైన 1.5 కోట్ల టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఆయిల్‌పామ్ వంటి నూనెగింజల సాగుకు భారీ డిమాండ్ ఉంది. అయిల్ప్రామ్ ప్రాసెసింగ్‌కు 25 జిల్లాల్లో 14 కంపెనీలను ప్రభుత్వం అనుమతించింది. ఆయిల్‌పామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో బ్రౌన్ విప్లవం రాబోతున్నదని, దేశానికే ఆయిల్‌హబ్‌గా తెలంగాణ మారబోతున్నదని ప్రశంసలు కూడా వినబడుతున్నాయి. ఈ పంట వల్ల రైతులకు లాభం ఒనగూడటమే కాకుండా, దేశానికి వంటనూనెలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఉండదు.
వ్యవసాయ రంగాన్ని పండుగగా మార్చే మహాయజ్ఞం ఇంకా కొనసాగుతూనే ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తూనే ఉన్నది. నీరు, కరెంటు, విత్తనాలు, ఎరువుల వంటి సవాలక్ష సమస్యలను ఇప్పటికే తీర్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. నూనెగింజలు, పప్పు దినుసులు, కూరగాయలు, పత్తి వైపు రైతులను మళ్లించటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యామ్నాయ పంటలపై, మార్కెట్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు మార్కెటింగ్ ఎనాలిసిస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. రెండేండ్లుగా కంది, పెసర, శనగ, వేరుశనగ పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. గతంలో తెలంగాణలో కంది 8 లక్షల ఎకరాల్లో సాగుకాగా, ఈ సీజన్లో 11 లక్షల ఎకరాలకు పెరిగింది. దీనిని 20 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించింది. రైతులు కూడా మార్కెట్‌ను, ప్రత్యామ్నాయ పంటలను అధ్యయనం చేయటం అలవాటు చేసుకోవాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటం అలవర్చుకోవాలి.