పశ్చిమ చాళుక్యులు తెలంగాణలో అనేక ప్రాంతాలను పరిపాలించి రాజ్యాధికారాన్ని విస్తరించారు. చక్రేశ్వర విక్రమాదిత్యదేవుని కాలంలో వేయించిన శాసనం యాదాద్రి భువనగిరి జిల్లా చాడ గ్రామంలో లభించింది. శాసనకాలం చా.వి. 6, దుర్మతి సంవత్సరం, పుష్యబహుళ షష్ఠి. క్రీ.శ.1081 ఉత్తరాయణ పుణ్య సంక్రాంతి.
క్రమాదిత్యదేవుని పాలెగాడు అయిన దుర్జయ వంశానికి చెందిన కామభూపాలుడు ఉత్కళ, కేరళ, కుంజర మృగాధిపుడు (కళింగ), ద్రావిడ, మగధ రాజులతో అనేక యుద్ధాలలో పోరాడినాడు. ఇతడు చేసిన ఈ సాహసమైన యుద్ధాలకు ప్రతిఫలంగా రాజైన విక్రమాదిత్యదేవుని నుంచి కొల్లిపాక-7000 సామంతాధిపత్యం పొం దిన విషయం రాగిరేకుల ద్వారా ఈ శాసనం వల్ల తెలుస్తుంది.
మహామండలేశ్వర కుమార కామరసు మానుగల్లు గ్రామాన్ని ఉత్తరాయణ సంక్రాం తి పర్వదినాన్ని పురస్కరించుకొని త్రిభోగాభ్యంతరసిద్ధి, సర్వనమస్యంగా చిడెయ మల్లేశర దేవుని ఖండస్ఫుటిత, (మరమ్మతులకు) నవసుధాకర్మ, (సున్నం వేయించడానికి) అంగ, రంగభోగాలకు, తపోధనులకు విద్యా ర్థులకు భోజనాదులకు ధారాపూర్వకంగా సమర్పించాడు. ఈ గ్రామానికి తూర్పున పల్లేరు, దక్షిణాన వేముల, పశ్చిమాన మొగలిపాక, ఉత్తరాన నేత్రకల్లు గ్రామాలు చతుస్సీమలుగా చెప్పబడినవి.
శాసనంలో కుమార కామరసు ‘మహామండలేశ్వరుడు, కొల్లిపాక పురవరేశ్వరుడు, దుర్జయకుల కులజుడు, మల్లికావల్లభుడు, జయాంగనా వల్లభుడు, భీమనసింగం, సాహసోత్తుంగ కంఠరాభరణం, శ్రీమత్త్రిభువనమల్ల దేవ పాదారవిందుడు’ వంటి నామాది ప్రశస్తుడిగా పేర్కొనబడినాడు.
శాసనం పాటించినవారికి అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందని, దాన్ని అతిక్రమించినవారు వారణాసిలో గోవులను చంపిన పాపం, శ్రీపర్వతంలో తపోధనులకు హాని కలిగించిన పాపం పొందుతారని శాపోక్తులు చెప్పబడినవి. ఈ శాసనం చివరలో చెప్పబడినది విశేషమైంది.
‘న విషం విషమిత్యాహు
ద్దేవవస్వం విషముచ్యతే
విషమేకాకినం హంతి
దేవస్వం పుత్రపౌత్రికం॥’
విషం స్వీకరించిన వ్యక్తిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది, వ్యక్తి చనిపోతాడు. కానీ దేవుని మాన్యం దానంగా ఇవ్వబడితే దాన్ని దేవాలయ నిర్వహణ కోసం వినియోగించకపోతే విషంతో సమానంగానే చెప్పబడింది. దేవమాన్యాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటే అది వంశపారంపర్యంగా పుత్రపౌత్రికంగా హతం చేస్తుందని చెప్పబడింది.
ఇటువంటి శాపోక్తులు అరుదుగా కనిపిస్తాయి. ఇందులో శాపం మాత్రమే కాదు నీతిబోధ అంశాలున్నాయి. ఒకరికి దానం ఇచ్చిన దాన్ని ఎవరూ అనాలోచితంగా కాజేయాలని చూడకూడదని ఈ శాసనాల వల్ల స్పష్టమవుతుంది.
–భిన్నూరి మనోహరి