తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకొనే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు విశిష్టమైనవి. బాలికలు, మహిళలకు ఎంతో ఊరటను,ఉత్సాహాన్ని కలిగించే ఈ రెండు పండుగలూ సారవంతమైన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడతాయి. ఇవి మట్టి, పూలతో సంబంధం ఉన్న ప్రకృతి పండుగలు.
భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పున్నమి అంటారు. ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుంచి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకొంటారు. ఇది ముఖ్యంగా బాలికలకు సంబంధించినది. అయితే ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే బొడ్డెమ్మను వేస్తారు. చుట్టుపక్కల బాలికలంతా బొడ్డె మ్మ ఆటపాటల్లో పాల్గొంటారు. ఆచారం ఉన్న కుటుంబాల్లో బాలికలతో దీన్నొక నోముగా పట్టిస్తారు. బాలికకు మూడు లేదా ఐదేండ్లప్పుడు ఈ నోమును పట్టించి యుక్తవయసు వచ్చేవరకు కొనసాగిస్తారు. అమ్మాయికి పెళ్లి కావాలని, భావి జీవితం బాగుండాలని గౌరీదేవిని అర్చించే నోము ఇది. ‘బొట్టె’, ‘బొడ్డె’ అంటే ‘చిన్న’ అని; ‘బొడ్డెమ్మ’ అంటే ‘చిన్న పిల్ల’అనే అర్థంతో ఈ పండుగ జరుపుకొంటారు. కొన్ని కుటుంబాల్లో ఆ పాప అమ్మమ్మ ఇంటివారు అందుకు కావల్సినవన్నీ సమకూర్చి ఈ నోము పట్టిస్తారు.
బొడ్డెమ్మను వేసేవారు చెరువు దగ్గరకు పోయి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక పీటపై చతురస్రాకారంలో అమర్చి దానికి తొమ్మిది గుంటలు చేస్తారు. వాటిల్లో బియ్యం పోసి పైన పసుపు గౌరమ్మనుంచి పసుపు కుంకుమలు, పూలతో ఇంటి బాలికతో పూజ చేయిస్తారు. ఆ 9 గుంటలను నవ దుర్గలుగా భావిస్తా రు. 9 రోజులు ఆ పీఠాన్ని ఎర్రమట్టితో అలికి ముగ్గు లు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. పూజలో రోజుకొక రకం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం పూట ఆ ఇంటి ఆవరణలో బొడ్డెమ్మను పెట్టే స్థలాన్ని శుభ్రం చేసి అమ్మాయిలు, మహిళలు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడుతూ చుట్లు తిరుగుతారు. సంధ్యా సమయంలో దేవతలు ఇంట ప్రవేశిస్తారనే విశ్వాసంతో ఈ ఆట ఆడతారు.
‘చిన్న చిన్న గుళ్ళు చిత్తారి గుళ్ళు- చూస్తూ చూస్తూ మా తాత సున్నమేయించాడు- నవ్వుతూ మా నాన్న నంది తెప్పించాడు’ అని, ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్ బిడ్డాలెందారే కోల్ – నా బిడ్డలేడుగురు కోల్ నీళ్ళల్లో పడ్డారూ కోల్’ అంటూ పాడుకుంటారు. ఆట ముగిశాక అందరూ చుట్టూ కూర్చొని.. ‘నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు- నిన్నుగన్న తల్లికీ నిండునూరేండ్లు..’ అంటూ అన్ని రకాల పూల పేర్లు వచ్చే పాటలు పాడుతారు.
పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లతో బొడ్డెమ్మను తయారుచేస్తారు. రూపమేదైనా భావం అమ్మవారనే. ఈ 9 రోజుల ఉత్సవంలో చివరిరోజు ఉదయం గుంటల్లో పోసిన బియ్యంతో 9 కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యం పెట్టి నోము నోచిన అమ్మాయితో తినిపిస్తారు. రోజూ గౌరమ్మను పూజించిన పూలను కూడా భద్రపరిచి చివరిరోజు ఆ అమ్మాయి ముఖానికి పూస్తారు. ఆ రోజు కొత్త గౌరమ్మను చేసి పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలతో పూజించి మేళతాళాలతో చెరువు దగ్గరికి పోయి ‘పోయిరా బొడ్డెమ్మ పోయిరావమ్మా’ అంటూ నిమజ్జనం చేయడంతో బొడ్డెమ్మ పండుగ పూర్తవుతుంది.
డాక్టర్ కొమ్ర రాజు రామలక్ష్మి
(వ్యాసకర్త: రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక, హనుమకొండ)