హైదరాబాద్లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరగడం, అందుకోసం మైనారిటీ వర్గీయులు తమ మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదా వేసుకోవడం గంగా జమునా తెహజీబ్కు నిదర్శనంగా నిలుస్తున్నది. మహా నగరంలో లక్షలాది మంది పాల్గొన్న బృహత్ నిమజ్జన కార్యక్రమం చిన్నపాటి అవాంఛనీయ ఘటన కూడా లేకుండా పూర్తికావడం ఇక్కడి ప్రజల సంస్కారం, సౌశీల్యతకు, అంతకు మించి సామరస్యానికి అద్దం పడుతున్నది. ఇక్కడి పాలకుల స్థితప్రజ్ఞతకు దివిటీలు పడుతున్నది. దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిలో రోజురోజుకూ మత సామరస్యం దిగజారిపోతున్నది. మతోన్మాదం జడలు విచ్చి వెర్రితలలు వేస్తున్నది. మూక మనస్తత్వం వేళ్లూనుకొని పౌరుల మనుగడకే ముప్పు వాటిల్లుతున్నది. 2014లో కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ ఏర్పడిన నాటినుంచి అమలుచేస్తున్న రహస్య ఎజెండా అంతకంతకూ బాహాటంగా బయటికి వస్తున్నది. జాతి నర నరానా విద్వేష విషం ఎక్కించే ప్రయత్నం సామాజిక మాధ్యమాల ద్వారా, ఇటీవలి కాలంలో సినిమాల ద్వారా కూడా జరుగుతున్నది. దాని దుష్ఫలితాలను దేశం ఈసరికే చవిచూస్తున్నది. డబుల్ ఇంజిన్ సర్కార్ల పర్యవేక్షణలో మైనారిటీలు అభద్రతకు లోనై జీవిస్తుండటం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి శోభించే విషయం కాదు.
ముస్లింల నమాజు కోసం బస్సు ఆపారని హిందూ డ్రైవర్, కండక్టర్లను సస్పెండ్ చేయడం ఏమి సంస్కారం? ఓ పిల్లవాడిని క్లాస్ టీచరు కేవలం మతం పేరు మీద ఎత్తిచూపి మరో మతానికి చెందిన పిల్లల చేత అతడిని కొట్టించడం ఏ మహత్తర సంస్కృతికి ప్రతిబింబం? వినాయకుని మండపంలో నుంచి ఓ అరటి పండు తీసుకున్న పాపానికి ఓ యువకుడు హతమయ్యాడు. ఈ తరహా ఘటనలు చూసి ప్రజాస్వామ్యవాదులు బిత్తరపోతున్నారు. దేశం ఎటు పోతున్నదని కలత చెందుతున్నారు. ఇవి చాలవన్నట్టుగా జరిగిన మరోఘటన దేశాన్ని కుదిపేసింది.
ప్రజాస్వామ్యానికి ఆలయం వంటి పార్లమెంటులో ఓ బీజేపీ ఎంపీ మరో పార్టీకి చెందిన మైనారిటీ ఎంపీపై విన శక్యం కాని బూతులతో విరుచుకుపడటం ఈ ధోరణికి పరాకాష్ఠ! కొత్త పార్లమెంటులో సరికొత్త సంప్రదాయానికి బీజేపీ పాలకులు తెరతీస్తున్నారని అనుకోవాలా? బీజేపీ ఎంపీ వాడిన బూతుల అర్థాలు తెలుసుకునేందుకు చాలామంది నిఘంటువులను వెతికే పనిలో పడ్డారు. బాధిత ఎంపీ కన్నీళ్లు పెట్టుకుంటూ సభ నుంచి వెళ్లిపోవడం ఏ మహోన్నత సంప్రదాయ ఫలితం? తప్పుచేసిన బీజేపీ ఎంపీని సభా నియమాల ప్రకారం ఎప్పుడు శిక్షిస్తారో తెల్వదు. శిక్షిస్తారో, లేదో కూడా తెల్వదు. కానీ, పాలకపక్షం శభాష్ అని భుజం తట్టినట్టు అతడికి మరో పదవి కట్టబెట్టి సత్కరించడం దేశం గమనిస్తున్నది. ఆయన తిట్లు ప్రయోగిస్తుంటే సభలోని బీజేపీ నేతలు ముసిముసి నవ్వులు నవ్వారని వార్తలు వచ్చాయి. వాటిని తర్వాత వారు ఖండించారనేది వేరే విషయం.
ఇంత జరిగినా దేశ ప్రధాని మణిపూర్ తరహాలో ‘మౌనమే నా భాష’ అంటున్నారు. ఆయన స్పందిస్తారని ఆశించే రోజులూ అయిపోయాయి. దేశాన్ని దుష్పరిపాలనతో కునారిల్లజేస్తున్న ప్రధాని మతం పేరు మీద, మత విద్వేషం తేరు మీద ఊరేగాలని చూస్తున్నారు. తమిళమంత్రి సనాతనధర్మం మీద చేసిన విమర్శపై స్పందిస్తారు. కానీ దేశాన్ని విద్వేషభరిత దుష్పరిపాలనతో పతనం అంచుకు చేర్చినవారు తమ నేతలు చేసే పనుల గురించి మాట్లాడరు. విద్వేష పరిభాష సృష్టించినవాళ్లే దాన్ని ఆపుతారని ఎలా అనుకోగలం? ఏతావాతా వివాదం ముదిరితే కంటితుడుపుగా, మణిపూర్ తరహాలో ఓ ప్రకటన పారేసి చేతులు దులిపేసుకుంటారేమో! తెలంగాణ ఆవిర్భావం గురించి పదేపదే అవాకులు చెవాకులు పేలే ప్రధానికి దేశంలో మత విద్వేషంపై నాలుగు మంచి మాటలు మాట్లాడేంత సమయం, తీరిక లేదా? దురదృష్టకరం!