క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉన్నది. జీవన విధాన సమస్యలు, కాలుష్యం వంటివి క్యాన్సర్లు పెరగడానికి కారణమనేది తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. 2022 నాటికి క్యాన్సర్ కేసులు 2 కోట్లకు చేరుకున్నాయి. క్యాన్సర్ మరణాలు కోటికి కొద్ది దిగువన 97 లక్షలుగా నమోదయ్యాయి. కొత్తకొత్త చికిత్సలు వచ్చి క్యాన్సర్ బారి నుంచి బయటపడి సుదీర్ఘకాలం మనుగడ సాగించేవారి సంఖ్య పెరుగుతున్న మాట నిజమే. అయినప్పటికీ ఈ అసాంక్రమిక మహమ్మారి వల్ల తలెత్తే ఆర్థిక, సామాజిక, కుటుంబ సమస్యలు తక్కువేం కాదు. క్యాన్సర్ చికిత్స సంక్లిష్టమైనదే కాకుండా ఖరీదుతో కూడుకుని ఉంటుంది. ఒక్కో పేషంటుపై సాధారణ వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చు కన్నా క్యాన్సర్ చికిత్స ఖర్చు నాలుగు రెట్లు ఎక్కువ. ఇవన్నీ పరిగణిస్తే చికిత్స కన్నా నివారణే మేలని అనిపించక మానదు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ టీకాను రష్యా కనిపెట్టిందనే వార్త సహజంగానే అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నది.
రష్యాలో క్లినికల్ పరీక్షలు తుదిదశకు చేరుకున్న వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ రకానికి చెందినది. సంప్రదాయ వ్యాక్సిన్ విధానంలో రోగకారక క్రిమిని నిర్వీర్యం చేసి శరీరంలోకి ఎక్కిస్తారు. దానివల్ల శరీరంలో యాంటీబాడీలు తయారై సదరు రోగం నుంచి రక్షణ కలుగుతుంది. కానీ కరోనా కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఎంఆర్ఎన్ఏ విధానం ఇందుకు భిన్నమైంది. ఇక్కడ ఆర్ఎన్ఏ ద్వారా శరీరానికి రోగనిరోధకత సమకూరుస్తారు. ఇప్పుడు రష్యా రూపొందించిన టీకా కూడా ఈ కోవలోదే కావడం విశేషం. అయితే నివారణ కోసం ముందస్తుగా ఇచ్చే టీకా కాదిది. క్యాన్సర్ వచ్చిన వారికి కణుతులను వెదికి, ధ్వంసం చేసేలా రోగనిరోధక వ్యవస్థను ఇది సమాయత్తం చేస్తుంది. రోగి ప్రత్యేక శారీరక స్థితిగతులను బట్టి దీనిలో మార్పుచేర్పులు చేసి ఇవ్వడం వల్ల ఇది అత్యంత సమర్థతతో పనిచేస్తుంది. నిజానికి టీకా అనే మాట సరైనది కాదు. ఎందుకంటే ఇది నివారణ కోసం ఇచ్చేది కాదు. రోగి శరీరంలో క్యాన్సర్‌ను గుర్తించిన తర్వాతే దీనిని ఇవ్వాల్సి ఉంటుంది.ఈ తరహా టీకా లేదా టీకా చికిత్సను రష్యా మాత్రమే రూపొందించడం లేదు.
ప్రపంచంలో ఈ దిశగా పరిశోధనలు జోరుగానే సాగుతున్నాయి. బ్రిటన్, అమెరికాలో ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే అవి ఇంకా కీలక దశకు చేరుకోలేదు. పైగా అవన్నీ వాణిజ్యపరమైన లాభార్జన దృష్టితో జరుగుతున్నవే. ఈ ఏడాదే కొత్త క్యాన్సర్ టీకాను అందుబాటులోకి తెస్తామని రష్యా అంటున్నది. ఆ టీకాను వాణిజ్యపరంగా సొమ్ము చేసుకోవడానికి ఉపయోగించబోమని, ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందుబాటులోకి తెస్తామని రష్యా ప్రకటించడం ప్రశంసనీయం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా దీనివల్ల ఏకకాలంలో క్యాన్సర్ మహమ్మారి నుంచి విముక్తి, ఆర్థిక భారం తొలగిపోవడం అనే జంట ప్రయోజనాలు సమకూరుతాయని చెప్పవచ్చు. అయితే క్యాన్సర్‌కు టీకా వచ్చిందని జీవన విధాన సమస్యల పట్ల నిర్లక్ష్యం ఏమాత్రం తగదని చెప్పక తప్పదు.