ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న నూతన పింఛన్ పథకం (ఎన్పీస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పింఛన్ పథకాన్ని (యూపీఎస్) ప్రవేశపెట్టింది. పాతకొత్తల మేలు కలయిక లాంటి ఈ కొత్త పథకంలో ఉద్యోగుల డిమాండ్లు, ద్రవ్య పొదుపు సూత్రాల మధ్య సమతూకం పాటిస్తూ మధ్యేమార్గం అనుసరించిందని చెప్పాలి. పదవీ విరమణకు ముందరి 12 మాసాల వేతన సగటులో 50 శాతం పింఛన్‌కు యూపీఎస్ హామీ ఇస్తున్నది. అదేవిధంగా కనీసం పదేండ్లు పనిచేసిన వారికి రూ.10 వేల కనీస పింఛన్ లభిస్తుంది. ఎన్పీఎస్ పథకంలో 14 శాతంగా ఉన్న కేంద్రం వాటా యూపీఎస్‌లో 18.5 శాతానికి పెరుగుతుంది. 2004 జనవరి 1 తర్వాత ఉద్యోగాల్లో చేరినవారికి ప్రభుత్వం ఇదివరకు ఎన్పీఎస్ ప్రవేశపెట్టింది. ఉద్యోగులకు సంబంధించినంతవరకు అదొక విభజనరేఖలా తయారైంది. ఆ తేదీకి ముందు చేరినవారికి పూర్తి పింఛన్ వస్తుంది. అంటే, వారి చివరి జీతంలో సగం మొత్తం అన్నమాట. దీన్నే పాత పింఛన్ పథకం (ఓపీఎస్) అని పిలుస్తున్నారు. తర్వాత చేరినవారికి ఎన్పీఎస్ కింద వారి నెలజీతం నుంచి మినహాయించుకున్న మొత్తం మేరకే పింఛన్ వస్తుంది. అది ఓపీఎస్ కన్నా చాలా తక్కువ మొత్తం అవుతుంది.
సహజంగానే ఉద్యోగుల్లో ఎన్పీఎస్ పథకం పట్ల మొదటినుంచీ వ్యతిరేకత మొదలైంది. పాత పింఛన్ పునరుద్ధరించాలనేది వారి ప్రధాన డిమాండ్లలో ఒకటిగా మారింది. తమ వాటా అంటూ ఏమీ లేకుండా పూర్తిగా ప్రభుత్వమే భరోసాగా ఉండే పాత విధానమే తమకు కావాలనేది వారి వైఖరి. 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. అది కూడా వారు ఎంచుకుంటేనే. ఒకసారి యూపీఎస్‌ను ఎంచుకుంటే ఇక వెనుకకు వెళ్లేందుకు వీలుండదు. రాష్ర్టాలు కూడా తమ ఉద్యోగుల ఎంపిక మేరకు అమలు చేయొచ్చని కేంద్రం అంటున్నది. ఓపీఎస్‌లో చివరి జీతాన్ని బట్టి పింఛన్ నిర్ణయిస్తే యూపీఎస్‌లో చివరి 12 నెలల వేతన సగటును బట్టి నిర్ణయిస్తారనేది గమనించాల్సిన విషయం. 50 శాతం ఉమ్మడి అంశమే అయినప్పటికీ, ఉద్యోగుల 10 శాతం చెల్లింపు కొనసాగుతుంది. అంటే ఓపీఎస్, ఎన్‌పీఎస్‌ల మేళవింపుగా కొత్త యూపీఎస్ ఉంటుంది. తమ వాటా చెల్లింపునే ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు ఉందని వారంటున్నారు.
మనదేశంలో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2023-24 సంవత్సరంలో చెల్లించిన పింఛన్ రూ.5,22,105 కోట్లు. ఇది ఆయా రాష్ర్టాల ఆదాయంలో 6-21 శాతం మధ్యలో ఉంటుంది. ఇది మోయరాని భారమని కేంద్రం అంటున్నది. కానీ ఉద్యోగులు దీన్ని అంగీకరించడం లేదు. పింఛన్ అనేది తమకు ఆలస్యంగా చెల్లిస్తున్న వేతనమేననేది వారి వాదన. పింఛన్ అనేది ఉద్యోగి హక్కు అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేయడం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. కేంద్రం ప్రతిపాదించిన యూపీఎస్‌ను విపక్షాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తుండటం గమనార్హం. ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. విస్తృతస్థాయి రాజకీయ ఏకాభిప్రాయంతో, ఉద్యోగుల సానుకూల స్పందనతో మాత్రమే పింఛన్ మార్పులను అమలు చేయగలమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.