గవర్నర్ గండం గడిచింది. బిల్లు ఇల్లు చేరింది. ఆర్టీసీ కార్మికుల సంతోషం ఆకాశాన్ని తాకింది. తమను తాము ప్రభుత్వ ఉద్యోగులుగా చూసుకోవాలన్న కల ఫలించింది. ఎప్పుడో రైలు ప్రయాణికుల అవస్థలు తీర్చేందుకు నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా మొదలైన ప్రయాణం ఒక గొప్ప గమ్యాన్ని ముద్దాడటం ముదావహం. తెలంగాణ జనజీవనంతో విడదీయరాని అనుబంధం కలిగిన ఆర్టీసీ 1932లో 27 బస్సులతో 166 మంది సిబ్బందితో మొదలైంది. నిజాం పరిపాలన అంతరించాక హైదరాబాద్ రాష్ట్రంలో మనుగడ సాగించింది. 1958లో ఏపీఎస్ఆర్టీసీలో విలీనమైంది. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో స్వతంత్ర ప్రతిపత్తి పొందింది. నేడు పది వేల పైచిలుకు బస్సులతో, 43 వేల మంది సిబ్బందితో అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థగా మన ఆర్టీసీ నిలిచింది. తమను ప్రభుత్వంలో విలీనం చేయమని ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటినుంచో అడుగుతున్నారు. ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అందుకు సమ్మతించి ఆచరణ వైపు అడుగులు వేశారు. కానీ గవర్నర్ కొర్రీల రూపంలో మధ్యలో అవాంతరం ఎదురైంది.
గవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం లేదని రాజనీతిజ్ఞులు, రాజ్యాంగవేత్తలు చెప్తున్న మాటలు చేరాల్సిన చెవులకు చేరడం లేదు. ముఖ్యంగా నిన్నటిదాకా క్రియాశీల రాజకీయాల్లో ఉండి రాత్రికిరాతే రాజ్యాంగ పదవులు అధిష్టించినవారు కిరకట్లు పెట్టడం ఇప్పుడు రివాజుగా మారింది. ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో కొర్రీలు వేయడం ద్వారా వారు ప్రజాప్రతినిధుల పాత్రను అపహాస్యం చేస్తున్నారు. మన గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుకు అనుమతిని ఆపడం అలజడి కలిగించింది. ఆర్టీసీ ఉద్యోగులు నోటికాడి కూడు దూరం జరిగినట్టుగా భావించి ఆందోళన బాట పట్టారు. గవర్నర్ వారిని పిలిచి మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు ముసాయిదా బిల్లుకు పది సిఫారసులతో కూడిన అనుమతి గవర్నర్ మంజూరు చేయడంతో కథ సుఖాంతమైంది. బీఆర్ఎస్తో పాటుగా పలుపార్టీలు మద్దతు తెలుపడంతో ఉభయసభలు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాయి. వేల ఆర్టీసీ కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ప్రభుత్వరంగ సంస్థల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు వేరు. వాటిని నిధులు లేకుండా మాడ్చి, దిగజార్చి, దివాళా తీయించడం, ఉద్యోగులను వీధిపాలు చేయడం, ఆపై వాటి ఆస్తులను కార్పొరేట్లకు అడ్డికి పావుశేరు కాడికి అప్పగించడం మోదీ సర్కారుకు అలవాటుగా మారింది. కానీ కేంద్రం విధానాలకు భిన్నంగా తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్నది. ప్రజాసంస్థలను కాపాడేందుకు అత్యంత వ్యూహాత్మకంగా, జాగరూకతతో వ్యవహరిస్తున్నది. నిజానికి ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి బిల్లు తేవాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్‌రంగ ఉద్యోగులను ప్రభుత్వంలో చేర్చుకోవడంపై 1997 చట్టం నిషేధం విధిస్తున్నందున ప్రత్యేకచట్టం తేవాల్సి వచ్చింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని నిధులిచ్చి ఆదుకొని లాభాల బాట పట్టించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు పూర్తిస్థాయి ఉద్యోగ భద్రతను కల్పించి తమది ఉద్యోగమిత్ర ప్రభుత్వమని మరోసారి చాటుకున్నది.